వరలక్ష్మీ వ్రతం

అంతర్యామి

వరలక్ష్మీ వ్రతం

ప్రపంచం అంతా కుటుంబానికి ప్రతిరూపమే. కుటుంబాలు లేని సమాజం అసంభవం. కుటుంబంలో ప్రధాన పాత్ర వహించేది స్త్రీమూర్తి. తల్లిగా, భార్యగా, సోదరిగా ఎన్నో రూపాలలో కనబడే స్త్రీ లేకుంటే ఏ కుటుంబంలోనూ సౌభాగ్యం ఉండదు. గృహిణులు తమ కుటుంబాలలోని అందరి క్షేమాల కోసం పాటుపడుతుంటారు. అమూల్య సేవలతో అందరి మన్ననలను అందుకుంటుంటారు. గృహిణి జీవితం అంతా ఒక వ్రతం లాంటిదే. అలాంటి స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, కుటుంబ క్షేమం కోసం చేసే ఉత్తమ పూజా విధానమే వరలక్ష్మీ వ్రతం.
‘వరం’ అనే పదానికి శ్రేష్ఠమైంది అని అర్థం. ‘లక్ష్మి’ అంటే సకల శుభలక్షణాలు గల దేవత. ఈ దేవత కరుణా కటాక్షాలతోనే కుటుంబంలో సకల శుభాలు, సంపదలు కలుగుతాయని స్త్రీ జాతి విశ్వాసం. అందుకే శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయంగా మారింది. వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ మాసంలోని పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారంనాడు ఆచరించాలని వ్రతరత్నాకరం చెబుతోంది.
ఈ వ్రతం ఎలా భూలోకంలో ఆవిర్భవించిందో వివరించే వృత్తాంతం భవిష్యోత్తర పురాణం చెబుతోంది. పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో కొలువుదీరి ఉన్న సమయంలో ‘లోకంలో పరమ పావనమైన వ్రతం ఏదో దాన్ని ఉపదేశించు’మని పార్వతీదేవి కోరగా, పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతాన్ని గురించి చెప్పాడని పురాణ కథనం.
‘పూర్వం ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా?’ అని పార్వతీదేవి అడిగిన ప్రశ్నకు సమాధానంగా శివుడు- పూర్వం కుండిన నగరంలో ‘చారుమతి’ అనే గృహిణి ఈ వ్రతాన్ని ఆచరించి, సకల సౌభాగ్య సంపదలను పొందిందని చెబుతాడు. ‘చారుమతి’ (అందమైన మనసు కలది) పేరుకు తగినట్లే నిర్మల స్వభావురాలు. కుటుంబంపై ఆమెకు గల ప్రేమ అపారం. అలాంటి నిర్మల హృదయురాలు లక్ష్మీదేవిని తలచుకొంటూ నిద్రించడం, కలలో లక్ష్మీదేవి కనిపించి ఆమెను అనుగ్రహిస్తూ శ్రావణ మాసంలో తన వ్రతాన్ని ఆచరించమని చెప్పడం మొదలైన సంఘటనలన్నీ ఈ వ్రతాచరణ ఎంత పవిత్రమైందో శుభదాయకమైందో చెబుతాయి. పూజా ప్రారంభంలో చేసే ప్రార్థనలో- ‘ఓ కమలాలయా! వరలక్ష్మీదేవీ! నీవు ఎప్పుడూ సంతుష్టురాలవై మా ఇంటిలో సుస్థిరంగా ఉండి, మమ్మల్ని దీవించు’ అనే మాటలు వ్రతం ద్వారా కలిగే ప్రయోజనాలకు ప్రతిరూపాలుగా కనబడతాయి. పూజలోని భాగాలైన ఉపచారాలు, నామార్చనలు తనువును, పలుకును, మనసును పవిత్రం చేసేవి. పవిత్ర భావనలున్నచోట లక్ష్మి తాండవిస్తుంది.
సంపదలన్నీ లక్ష్మీదేవికి ప్రతిరూపాలు. ధనం, ధాన్యం, సంతానం, సౌభాగ్యం, ఆయుష్యం, ఆరోగ్యం... ఇవన్నీ సంపదలే. ఇవన్నీ స్థిరంగా ఉండాలనే స్త్రీమూర్తి ఆకాంక్షను వరలక్ష్మీ వ్రతం సఫలం చేస్తుంది. వాక్కుకు సరస్వతి, సంపదలకు లక్ష్మి, మంగళానికి పార్వతి అధిష్ఠాన దేవతలు. ఈ ముగ్గురూ ఒకరిలో ఒకరు విడదీయలేని దివ్యశక్తులై ఉంటారు. కనుక వరలక్ష్మీ వ్రతం బహుళార్థ సాధకమని మహర్షుల ఉపదేశం.
శ్రావణ మాసం వర్షర్తువుకు నెలవు. సుభిక్షాలకు కొలువు. పుష్కలత్వానికి ప్రతిరూపం. కనుక ఈ మాసంలోనే సకల దేవతలకు సంబంధించిన వ్రతాలను మహర్షులు ఉపదేశించారు. ఆకాశం నుంచి మేఘాల ద్వారా కుండపోతగా ఎలా వర్షాలు కురుస్తాయో, అలాగే వరలక్ష్మీదేవి కారుణ్యం అనే ఆకాశం నుంచి సకల సౌభాగ్య సంపదలు వర్షించాలని కోరడమే వరలక్ష్మీ వ్రత లక్ష్యం.

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న