జీవిత పథం

అంతర్యామి

జీవిత పథం

‘యజమాని ఉన్నాడు. అన్నీ చూసుకుంటున్నాడు. వేళకు పండో కాయో అందిస్తాడు. ఇన్ని నీళ్ళు పోస్తాడు. అంతా బాగానే ఉంది కదా?’ అనుకొంటుంది పంజరంలో చిలుక. పచ్చి రెక్కల తడి ఆరకముందే అది పంజరంలోకి వచ్చింది. ఊచల మధ్య ఊగిసలాడుతూ అదే ప్రపంచంగా బతుకుతోంది. తనకు రెక్కలు ఉన్నాయని, విప్పితే హాయిగా ఎగరవచ్చుననీ తెలియదు. నింగి నీలాలను, ఆకుపచ్చని అడవి అందాలను, తోటి చిలకలతో కలిసి గుంపుగా జీవించడంలోని మాధుర్యాన్ని బొత్తిగా ఆస్వాదించని ఏకాకి జీవితం! విచిత్రం ఏమిటంటే- ఆ బతుకే బాగుందనుకుంటోంది వెర్రి చిలక! ప్రపంచంలోనే జీవిస్తున్నా- అందులోని విస్తృతిని, వైవిధ్యాన్ని అన్నింటికన్నా ముఖ్యమైన మానవీయమైన స్పందనలను గుర్తెరగనివారికి, పంజరంలోని చిలుకకు పెద్దగా తేడా లేదు.

మహాభారతంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న కథ ఇది. అత్యంత సాధారణ జీవితాన్ని గడిపే వ్యక్తి నుంచి ఓ తపశ్శాలి జీవిత పథం గురించి పాఠాలు నేర్చుకున్న ఉదంతమిది! ఆయన పేరు కౌశికుడు. తపస్సే సర్వస్వంగా భావించి నిష్ఠగా జీవిస్తున్నాననే భ్రమలో బతికాడు. ఓ సారి కౌశికుడు తపస్సు చేసుకుంటున్న సమయంలో చెట్టుపై నుంచి ఓ కొంగ ఆయన మీద రెట్ట వేసింది. అంతటి తపస్సంపన్నుడు అమాయక పక్షి మీద కన్నెర్ర చేశాడు. తప్పొప్పుల అవగాహన లేని పక్షి నేల మీద పడింది. ప్రాణాలు విడిచిపెట్టింది. దాని కర్మ అనుకుంటూ ఊళ్ళో భిక్షకు వెళ్ళాడు కౌశికుడు. భిక్ష వేసేందుకు ఆలస్యం చేసిన ఓ గృహిణి మీద కూడా కన్నెర్ర చేయబోయి, భంగపడ్డాడు. ఆ భంగపాటు గుణపాఠమైంది. కౌశికుడి కళ్లు తెరిపించింది. వాస్తవ ప్రపంచం తాలూకు రూపురేఖలను తెలుసుకునే దిశగా నడిపించింది. గృహిణి సూచన మేరకు జీవిక కోసం మాంసాన్ని విక్రయించే ధర్మవ్యాధుడి వద్దకు కౌశికుడు వెళ్ళాడు. జీవన పథంలోని నిజాలను తెలుసుకున్నాడు. కళ్లుమూసుకుని అంతరంగంలోకి తొంగి చూడటంతోపాటు కళ్లు తెరిచి కట్టెదుట ప్రాపంచిక జీవితాన్ని సైతం దర్శించాలన్న వాస్తవాన్ని అర్థం చేసుకున్నాడు.

గిరిగీసుకుని బతకడం కాదు జీవితమంటే! ఇదో హరివిల్లు. దీని నిండా వైవిధ్యభరితమైన వర్ణ సముదాయం ఉంది. కానీ, ఏ ఒక్క రంగునో అంటిపెట్టుకుని- దాన్నే ఇంద్రధనుస్సుగా పొరపడితే అది పంజరంలో చిలుక బతుకే! ముక్కు మూసుకోవడంలోనే ముక్తి ఉందని భావిస్తూ, తన తపశ్శక్తిని కన్నెర్ర చేసేందుకు మాత్రమే వినియోగించే కౌశికుడి కోవకు చెందినదే!

జీవితం తాలూకు విస్తృతి, లోతులు అవగాహనలోకి వచ్చిన వ్యక్తికి గీతావాక్యం అర్థమవుతుంది. కర్మ సన్యాసమంటే నిష్క్రియ కాదని తెలుస్తుంది. నిర్దేశిత కార్యాన్ని నిర్వర్తిస్తూ, వివిధ మానసిక అవస్థలకు అతీతంగా, ప్రతిఫలాన్ని అంతటా వ్యాపించిన పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాలన్న ఈశావాస్యోపనిషత్‌ సారాంశం అవగాహనలోకి వస్తుంది. సమస్తమూ నాదేనన్న అహంభావననుంచి విశ్వసంపదకు తానొక ధర్మకర్తననే భావన మనిషిలో బలంగా వేళ్లూనుతుంది.

ఆధ్యాత్మిక, లౌకిక కోణాల మధ్య సమతౌల్యాన్ని సాధించడమే జీవితం! కళ్లు మూసుకుని అంతరంగాన్ని అన్వేషించడంతోపాటు, వాస్తవిక ప్రపంచంలో వక్రగతి లేని జీవితపథంలో సాగిపోవాలి! ఈ సత్యాన్ని మహానుభావులు  సూచిస్తూనే ఉన్నారు. మనిషి దారి తప్పిన ప్రతిసారీ అంతిమ సత్యాన్ని గుర్తుచేస్తూనే ఉన్నారు. చెవులొగ్గి వినడం, చేతల్లో చూపించడం మనిషి వంతు!

- ఓలేటి శ్రీనివాసభాను


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న