బ్రహ్మ జిజ్ఞాస

అంతర్యామి

బ్రహ్మ జిజ్ఞాస

ర్రిచెట్టును చూస్తున్న మనిషికి అంతటి మహావృక్షాన్ని నిలబెట్టి ఉంచుతున్నది భూమి లోతుల్లోకి చొచ్చుకుపోయిన ఆ వృక్షం వేళ్లని తెలియనిది కాదు. అంతటి శక్తి ఆ వేళ్లకు వచ్చింది ఎక్కడనుంచి, ఇస్తున్నది ఎవరు? అవి తెలుసుకోవాలని అనిపిస్తే అతడిలో కలిగే భావన వంటిదే బ్రహ్మజిజ్ఞాస. రుగ్వేదం అదేమాట చెబుతుంది. మట్టిపాత్రలు ఎన్ని ఆకారాల్లో కనపడినా, అవి తయారవుతున్నది ఒక మట్టి ముద్దనుంచేనని తెలిసినా చూసి ఊరుకోకుండా- ఆ మట్టిముద్ద ఏమిటని, ఎక్కడిదని వివరాల కోసం కనబరచే కుతూహలం వంటిదే బ్రహ్మజిజ్ఞాస.

మనుషుల్లో ఆలస్యంగా బయటపడే ఆసక్తి బ్రహ్మజిజ్ఞాస. మనిషిలో అది బలపడుతూ ఉన్నప్పుడు అతడు తన ఆలోచనల్ని భౌతికలోకం అవధులు దాటిస్తాడు. తన ఉనికి గమ్యాల గురించి ప్రశ్నలడగాలని అతడికి అనిపిస్తుంది. జీవులెవరు, జీవవ్యాపారాలు జరిపించే ఆ శక్తి అదేమిటి, జగత్తు కాలాతీతమా కాలనియమితమా, తాను అక్కడ చూస్తున్నదంతా సత్యమా, సంఘటనలా? ఇలా తనలో రేకెత్తే సంశయాలకు సమాధానాలు చెప్పగలవారి కోసం అతడు అన్వేషిస్తూ ఉంటాడు. అతడికి సంశయనివృత్తి చేయగలవారు కొద్దిమందే ఉంటారు. వారే జ్ఞానమార్గంలో స్వయంగా నడిచివచ్చిన సద్గురువులు. గురువులిస్తున్న సమాధానాల్లో వినిపించే తత్వమసి వంటి ఉపనిషత్తుల్లోని మహావాక్యాలు, జగన్మిథ్యత్వం, బ్రహ్మం, సత్యం, అవిద్య, అహంకారం అనే మాటలు- తనలో బ్రహ్మ జిజ్ఞాసను చిగురి స్తుంటే, మనిషికి ఆసక్తికరంగా మారతాయి.

మనిషి ఆధ్మాత్మిక ప్రయాణంలో అతడితో తొలి అడుగులు వేయించేది బ్రహ్మజిజ్ఞాస. అది సడలిపోకుండా ఉంటున్నప్పుడు, గురువులు ప్రవచించే ఆధ్యాత్మికపరమైన అంశాలన్నింటిపై ప్రాథమికమైన అవగాహన క్రమంగా ఏర్పడుతూ ఉంటుంది. బ్రహ్మమనే దివ్యచైతన్యం వ్యక్తం చేస్తున్నది తాముంటున్న భౌతిక ప్రపంచమన్న గ్రహింపు మొదలవుతుంటే, ఆ మర్త్యలోకంలోనిదంతా శాశ్వతత్వం లేని వస్తు విషయాలని, తనకున్న జ్ఞానం ఏపాటిదనుకుంటూ ఆత్మ పరిశీలనకు దిగుతాడు. ఆత్మ విచారంతో కాని అర్థంకానిదిగా గ్రహించి మరింత స్పష్టత కోసం గురువుల నాశ్రయిస్తాడు. గురువుల సహకారంతో వారు సూచించిన సాధనలతో జరిగే ఆత్మవిచారం పూర్తయితే అతడికి లభించేదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానం. ఆత్మజ్ఞానిగా సాధకుడు అద్వైత సత్యమైన బ్రహ్మాన్ని భగవంతుడిగా గుర్తించి అతడు తనలోనే స్థితుడై ఉన్నాడని, బ్రహ్మైక్యమే ముక్తీ మోక్షాలని తెలుసుకుంటాడు.

బ్రహ్మజిజ్ఞాస స్వచ్ఛమైన, నిర్భయమైన వైఖరులతో సాగించవలసిన ఆత్మజ్ఞాన సంవాదాలన్నింటికీ అవసరమైనది. జ్ఞానుల నుంచి ఆధ్యాత్మిక సత్యాలను మనిషి ముఖాముఖి గ్రహించడానికి అవకాశం కల్పిస్తుంది. వేదాంతులెప్పుడూ దివ్యత్వమైన బ్రహ్మం తనలోనే ఉందని తెలిసినంతమాత్రాన మనిషికది సరిపోదంటారు. ఆ దివ్యశక్తికి అభివ్యక్తీకరణ అతడు జరుపుకోనంతకాలం మనిషిగానే మిగిలిపోతాడని మహనీయుడు కాలేడని అంటారు.

జీవితం అన్ని దశలలో అద్వైత దృక్పథం విస్తరింపజేసే బ్రహ్మజిజ్ఞాసను సజీవంగా తనలో నిలుపుకొంటూ ఉన్నప్పుడు మనిషిని గతం భయపెట్టదు. వర్తమానం విసిగించదు. భవిష్యత్తుమీద బెంగ ఉండనీయదు. ఆధ్మాత్మిక సత్యాలపై పట్టు సాధించడం కష్టమైన పనిగా అనిపించనీయదు.

- జొన్నలగడ్డ నారాయణమూర్తి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న