శివానందలహరి

అంతర్యామి

శివానందలహరి

పార్వతీపరమేశ్వరులను, సీతారాములను జంటలుగానే పూజించాలి. ఇది సంప్రదాయం. శ్రీ శంకరాచార్యుల వారు ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ, ఉమామహేశ్వరులను ‘శివాభ్యాం’ అని ప్రారంభ శ్లోకంలో స్మరిస్తారు. ఆచారవ్యవహారాలను అవసరమైనంత వరకు పాటిస్తూ, అర్థరహితమైన సంప్రదాయాలను తిరస్కరిస్తూ జీవితం గడిపిన మహాపురుషుడు ఈ జగద్గురువు. మాతృమూర్తికి కాలడి గ్రామంలోని తమ ఇంటిలోనే అంతిమ సంస్కారం గావించి, ‘ఆచారాలు మనుషులకు సాయపడాలే గాని కష్టపెట్టేవిగా ఉండరాదు’ అని శంకరులు ప్రబోధించారు.

శివానందలహరి మధుర మనోహర శివస్తుతి. శివ అంటే శివుడు; శివా అంటే పార్వతి. శంకరుడు, భ్రమరాంబ ఇరువురూ నెలకొన్న పవిత్ర క్షేత్రం శ్రీశైలం. శివనామస్మరణ వల్ల మనసు ఆనంద ప్రవాహంలో ఓలలాడుతుంది. శంకరాచార్యులవారు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఆయన చేసిన శివస్తుతి ఇది.

శివ అంటే మంగళం. సుఖకారకుడైన శంభుడు సంసారం వల్ల కలిగే బాధలను పోగొట్టి, మనసుకు శాంతిని కలిగిస్తాడు. మనసు కోతి లాంటిది. అది మోహం అనే అడవిలో సంచరిస్తూ ఉంటుంది. సదా ఆలుబిడ్డలు అనే కొమ్మలను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. ఇది గ్రహించిన భక్తుడు ‘ఓ శివా! నా మనసు అనే కోతిని నీ భక్తి అనే తాటితో కట్టివేయి స్వామీ!’ అని వేడుకొంటాడు. సంసారంపై ఉన్న భ్రమే జనన మరణాలకు కారణమని గ్రహించి, తన నుదుట బ్రహ్మ రాసిన రాతను చెరిపేసి, సంసారభ్రమ తొలగించమని ప్రార్థిస్తాడు. సంసారి పరమ గమ్యం చేరడానికి సగుణ బ్రహ్మోపాసన సులభమార్గం. ‘నేను చెబుతున్నది సత్యం. ఇది కేవలం స్తోత్రం కాదు. మన హృదయ పుష్పాలను శివార్పణం గావిస్తే చాలు- ముక్తి కరతలామలకం అవుతుంది!’ అని శంకరాచార్యులవారు శివానందలహరిలో ఘంటాపథంగా చెబుతారు. ఇందులో నూరు శ్లోకాలతో శివస్తుతి గావించారు.

భౌతిక ప్రపంచంలో సర్వం దుఃఖమయమే! ముక్తి ఒక్కటే శాశ్వత ఆనంద దాయకం. శివుణ్ని ఆశ్రయిస్తే ముక్తి సులభ సాధ్యం. ఈ సంగతి గ్రహించిన శంకరాచార్యులు ప్రకృతి సౌందర్యాన్ని కవిత్వంతో రంగరించి, ఛందస్సు అనే గిన్నెలో పోసి, శివుడికి నివేదించి, మనకు ప్రసాదంగా పంచి ఇచ్చారు. వారి భావనా పటిమకు ప్రతి శ్లోకమూ ఉదాహరణే, ప్రతి స్తుతీ ఆలోచనామృతమే! జ్ఞాని, భక్తుడు, పండితుడు, కవి... ఇలాంటి మాటలతో శంకరుల ఔన్నత్యాన్ని వర్ణించలేం. శివానందలహరి సగుణ బ్రహ్మోపాసనాత్మకం. పరమగమ్యాన్ని చేరడానికి సంసారికి సులభ మార్గం. రుషులు సాకారాన్ని, నిరాకారాన్ని సమానంగా తలుస్తారు. కానీ సామాన్యులకు రూపం ఉన్న దైవాన్ని ఆరాధించడమే ఇష్టం. భక్తి, విరక్తి... ఇవన్నీ మనసులో జనించేవే. జగద్గురువులు మనసును పలు ఉపమానాలతో వర్ణిస్తారు. హృదయం ఒక గుడారం లాంటిది. భక్తులు ఆ గుడారాన్ని గట్టి తాళ్లతో బిగించి కట్టేశారు. బాగా అలంకరించారు. ‘శివా! నామీద దయ ఉంచి వచ్చి ఈ గుడారంలో నివసించు!’ అని ప్రార్థిస్తారు. తమకు సాయుజ్యముక్తిని ప్రసాదించమని వేడుకొంటారు.

శ్రీ శంకరాచార్యులవారు శివానందలహరిలో భక్తి, ప్రపత్తి, శరణాగతి అనే మూడు మార్గాలనూ నిరూపించారు. భక్తి కంటే గొప్ప ముక్తి మార్గం లేదని ఆయన విశ్వసించారు. మనం పరమగమ్యం చేరే సులభ మార్గాన్ని చూపారు. శివానందలహరి పరమశివుడి జటాజూటం పైనుంచి భక్తుల హృదయ సరోవరం చేరే గంగాఝరి.

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న