భజే నారసింహం

అంతర్యామి

భజే నారసింహం

దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి అంతర్యామి సర్వదా సిద్ధంగా ఉంటాడని వేద పురాణేతిహాసాల అధ్యయనంతో భక్తులకు అవగతమవుతుంది. భగవంతుడి కోసం భక్తులు కాదు, భక్తులకోసం భగవంతుడు అన్నది ఆధ్యాత్మికోన్నతి సాధించిన పెద్దల ఉవాచ. ఆ లోకం నుంచి ఈ లోకానికి అవతారాల రూపంలో అప్రమేయుడు అరుదెంచి చెడును తుంచి మంచిని పెంచిన రుజువులున్నాయి. అవతారాలను పెద్దలు మూడు విధాలుగా చెబుతారు. పూర్ణావతారాలు- రామావతారం, కృష్ణావతారం. ఇవి మానవ జాతిలోని అన్ని దశలను స్పృశించినవి. ఆవేశావతారాలు- పరశురామ, నరసింహ. పరిస్థితులకు అనుగుణంగా ఉగ్ర రూప ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నవి. అంశావతారాలు- విష్ణుదేవుడి శక్తిలోని కొంత భాగంతో ఆవిర్భవించినవి... మత్స్య, కూర్మ, వరాహాలు. అవసరాల నిమిత్తం రూపొంది కార్య సాఫల్యం సాధించినవి.

దశావతారాల్లో నాలుగోదైన నరసింహావతారం ఉగ్రం, ఉత్కృష్టం కలగలిసినది. జన్మల్లో ఉత్తమమైన మానవుడిలోని కొంత భాగం, మృగాల్లో శ్రేష్ఠమైన సింహంలోని మరికొంత భాగం కలిసి కంబం నుంచి నారసింహుడి ఉద్భవం జరిగింది. ప్రహ్లాదుడి అనన్య భక్తి, నారాయణుణ్ని కోపోద్రిక్త నృసింహావతారంతో ఇలకు రప్పించి హరి అరి అయిన రాక్షస తండ్రిని చీల్చి చెండాడించింది. శ్రీ నారసింహావతారం సద్యోజాతం. భక్తుడి రక్షణ కోసం అప్పటికప్పుడు జనించినది. పద్మ, కూర్మ, విష్ణు పురాణాల్లో నృసింహస్వామిని గురిం చిన ప్రస్తావన ఉంది.

నరసింహస్వామిని పర్వతాల మీద, కొండ గుహల్లో, అరణ్యాల్లో, దేశ సరిహద్దుల్లో ప్రతిష్ఠించాలని ప్రాచీన వాస్తు గ్రంథం మయమతం తెలియ జేస్తుంది. ఉగ్రరూపధారి అయిన నృసింహుడు భక్తుల అభీష్టం నెరవేర్చడానికి ఎన్నో చోట్ల స్వయం భువుగా వెలశాడు. తమ ఇక్కట్లు తీర్చినందుకు జనులు ఇల వేలుపుగాను పలుచోట్ల ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. ఉగ్రనరసింహుడు వెలసిన అహోబిల క్షేత్రం నవ నారసింహ మూర్తులకు ఆదివాసం. బ్రహ్మాండపురాణంలో అహోబిల క్షేత్ర వివరణ ఉంది. వైష్ణవులకు నూటెనిమిది దివ్య క్షేత్రాలున్నాయి. ఆళ్వారులు దర్శించి సేవించిన ఆలయాలను దివ్య క్షేత్రాలంటారు. అందులో అహోబిలం ఒకటి.

సర్వమంగళ స్వరూపిణి, సర్వశ్రేయోప్రదాయిని శ్రీలక్ష్మి తపస్సు చేసిన మంగళప్రద ప్రదేశం మంగళగిరి. హిరణ్యకశిపుడి సంహారానంతరం ఉగ్రరూపంతో దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ, ఊగిపోతున్న స్వామికి శ్రీలక్ష్మి అమృతంపోసి శాంతింపజేసిందని ఒక కథనం. ఇక్కడి నారసింహుడికి భక్తులు కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునెయ్యిని, ద్వాపరయుగంలో ఆవుపాలను సమర్పించేవారంటారు. కలియుగంలో బెల్లం పానకాన్ని సమర్పించి స్వామి కోపాన్ని చల్లబరచి, తమ కోర్కెలను సానుకూలం చేసుకొంటున్నారు.
కరీంనగర్‌ ధర్మపురిలోని నరసింహస్వామి ఆలయం వెలుపల ఉన్న యమధర్మరాజు ఆలయాన్ని దర్శించి, అక్కడి గండ దీపంలో నూనె సమర్పించినవారికి అపమృత్యు దోషం, మృత్యుభీతి ఉండవని భక్తుల విశ్వాసం. వివాహానంతరం కుజదోష విషయం తెలిసినప్పుడు, దంపతులు ధర్మపురి క్షేత్రంలోని స్వామివారిని దర్శిస్తే పరిహారం లభిస్తుందంటారు.

జీవితంలో కష్టాలపాలు అధికమై బాధపడుతున్నప్పుడు, దొంగలు చుట్టిముట్టినప్పుడు, శత్రువుల మీదికి యుద్ధానికి వెళుతున్నప్పుడు, దుష్టగ్రహాలు జీవితాన్ని అల్లకల్లోలం చేస్తున్నప్పుడు శ్రీనారసింహుని ఆరాధించాలని శాస్త్రవచనం.

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న