ఇచ్చి పుచ్చుకొనే గౌరవం

అంతర్యామి

ఇచ్చి పుచ్చుకొనే గౌరవం

నుషులు గౌరవం ఇచ్చి, పుచ్చుకొన్నట్లు ప్రకృతిలో ఏ ఇతర జీవులూ చెయ్యవు. చెయ్యలేవు. ఎందుకంటే వాటికి ఆ దృష్టి లేదు, బుద్ధి లేదు.

యుగయుగాలుగా మానవుడు గౌరవంగా బతుకుతున్నాడు. గౌరవం కోసం బతుకుతున్నాడు. గౌరవానికి భంగం వస్తే మనిషి జీవించలేడు. ఏ విధంగానైనా గౌరవం పొందిన మరుక్షణమే అతడు ఆనందం పొందుతాడు. గౌరవమే ప్రాతిపదికగా మనిషి గొప్ప గొప్ప పనులు చేస్తాడు. గౌరవం లేని జీవితం ఎందుకని చాలామంది తలపోస్తారు. మానవ సంస్కృతిలో, చరిత్రలో గౌరవానికి పెద్ద పీట వేశారు. హీనులుగా, దీనులుగా బతకాలని ఎవరూ కోరుకోరు. అందరికీ గౌరవం కావాలి. దేవతలు, దేవుళ్లు వారి ప్రతిబింబమైన మనిషిని దివ్యత్వం వైపు నడిపించి, ఎనలేని స్థాయిలో నిలబెట్టి, గౌరవాన్ని కట్టబెట్టారు.

గౌరవమే ఊపిరిగా బతుకుతారు కొందరు. గౌరవంగా బతకాలని దైవాన్ని వేడుకుంటారు మరికొందరు. గౌరవం కావాలంటే, గౌరవం ఇవ్వడం వల్లనే అది వస్తుందని తెలుసుకుని బతుకుతారు అవగాహన కలిగినవారు. ఇతరులను గౌరవించడం రానివాళ్లు, ఎప్పటికీ గౌరవాన్ని పొందలేరు.

మనిషికి గౌరవం ఎందుకు? మానవదేహంలో నివసించే పరమాత్మ పూజనీయుడు. అది గుర్తించి ఒకరినొకరు గౌరవించుకోవడంలో సంతోషం ఉంది. సామరస్యం ఉంది. సోదర సౌభ్రాతృత్వం ఉంది. ఆత్మ బంధుత్వం ఉంది.

శ్రీరామచంద్రులవారు సాటివారితో సమానంగా సేవకులకు సైతం ఇచ్చిన గౌరవం అనన్య సామాన్యమని రామాయణం చెబుతోంది. రామ ప్రేమతో కూడిన గౌరవాభిమానాలు పొందినవారు ధన్యులని చరిత్ర చాటింది. శ్రీకృష్ణుడు ఎవరికి తగిన గౌరవం వారికి ఇచ్చి- సముచిత రీతిన సత్కరించేవాడు. ఆత్మ గౌరవం అనేది ఆత్మ తత్వం తెలిసిన వారికి బాగా బోధపడుతుంది. సృష్టిలో ఏ జీవినీ హీనంగా చూసే సంస్కృతి మనది కాదు. గౌరవాన్ని అహంగా పొరపడకూడదు. అహంకారులకు గౌరవం గురించి తెలియదు. రావణ సభలో హనుమంతుణ్ని అగౌరవపరచి అవమానించారు. వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో తెలిసిన మారుతి తన గౌరవం నిలుపుకొన్నాడు.

మానవ జన్మకు పరమార్థం ఉంది. ఆ పరమార్థం ప్రతి మనిషినీ తన లాగే భావించి, దయ చూపి, ప్రేమించి, గౌరవించే జ్ఞానం కలిగిన తరవాత బోధపడుతుంది. గౌరవంగా జీవిస్తే సృష్టి నియమాలను ఉల్లంఘించకుండా బతికిన వాళ్లమవుతాం. దైవం దృష్టిలో ప్రియ భక్తులుగా నీరాజనాలు అందుకుంటాం. పెద్దలను గౌరవించాలి. పిల్లలకు ఆ విషయం నేర్పాలి. గౌరవ, మర్యాదలు పుట్టుకతోనే రావు. నేర్చుకోవాల్సిందే.

ఏ స్థితిలో ఉన్నా- ‘ఇది నేను తెచ్చుకున్నది కాదు. నా కర్మల ఫలితంగా ఇది లభించింది’ అని స్పష్టంగా తెలుసుకున్నవారు మానావమానాలకు అతీతంగా ఉంటారు. గౌరవం, అగౌరవం రెండింటినీ వారు ఒకే విధంగా భావిస్తారు.

గౌరవం కోరుకోగానే రాదు. మంచి పనులు, గొప్ప పనులు చేసేవారిని సహజంగా గౌరవిస్తారు. ధర్మరాజు లాంటి వ్యక్తిత్వం కలిగినవారు మంచివాళ్లను, చెడ్డవాళ్లను సమానంగా గౌరవిస్తారు. వారికి భేదాలు కనిపించవు. దానికి విశేషమైన జ్ఞానం, మానసిక పరిణతి కావాలి.

- ఆనందసాయి స్వామి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న