హృదయ పూర్వకంగా...

అంతర్యామి

హృదయ పూర్వకంగా...

ళ్లు తెరిస్తేనే చూపు. కానీ తెరిచిన ప్రతీ కన్నూ చూసినట్లు కాదు. అలాగే మూసుకున్నంత మాత్రాన నిద్రించినట్లూ కాదు. తెరవడం, మూయడం లాంటివి కేవలం భౌతికమైన చర్యలు మాత్రమే. మన కళ్లెదుటే ఎవరో వస్తారు. వెళ్తారు. కానీ వారిని మనం గుర్తించని సందర్భాలు అప్పుడప్పుడు తటస్థిస్తాయి. అలాగే కళ్లు మూసుకుని కూడా నిద్రకు నోచుకోని అనుభవాలూ మామూలే! ఇదే సూత్రం చెవులకు, నోటికి సైతం వర్తిస్తుంది. వీటన్నింటికీ మూల కారణం- పైన ఉటంకించిన యాంత్రిక చర్యలకు హృదయాన్ని జోడించ(లే)కపోవడమే. మామూలు మాటల్లో చెప్పాలంటే ‘మనసు పెట్ట(లే)కపోవడం’. దీన్నే ధ్యాస అంటారు.

ఈ ధ్యాసను పెంచుకోవడం కళ్లుమూసుకుని ప్రశాంతంగా ధ్యానించడం ద్వారా సాధ్యమవుతుందని వివిధ సాధన మార్గాలకు చెందిన గురువులు సూచించారు. కేవలం కళ్లు మూసుకుంటే ప్రశాంతత చేకూరుతుందా, ధ్యానించినట్లవుతుందా? అంటే కాదు. తెరిచిన కళ్లు చూసినట్లు ఎలా చెప్పలేమో, మూసిన కళ్లు ధ్యానిస్తున్నట్లుగానూ భావించలేం. ఇక్కడ కూడా ధ్యాసకే ప్రాధాన్యం. ‘ఇది హృదయపూర్వకంగా, అత్యంత సహజంగా నిర్వర్తించాల్సిన ఆధ్యాత్మ ప్రక్రియ’ అని జ్ఞానులు పేర్కొన్నారు. భగవంతుడు అత్యంత సూక్ష్ముడు. ఆయనతో అనుసంధానమయ్యే మార్గం కూడా అంతే సరళంగా ఉండాలి. నేల మీద పడ్డ సూదిని ఒడిసి పట్టాలంటే సన్నని వేలి కొసలు చాలు, భారీ క్రేన్ల అవసరం లేదని ఓ సద్గురువు అన్నారు. ఇందుకు హృదయంలో దివ్యకాంతి మూలాన్ని ధ్యానించమని ఆయన సూచించారు. ఇక్కడ కూడా ధ్యానం మీద ధ్యాస ఎలా ఏర్పడుతుందన్న ప్రశ్న సాధకులకు ఎదురవుతుంది. ఇందుకోసం వారో ఆచరణ యోగ్యమైన పరిష్కారాన్ని సూచించారు. పరిపరి విధాలుగా ఆలోచించే మనసును బలవంతంగా కట్టడి చేయవద్దన్నారు. ముసురుకునే ఆలోచనలను పిలవకుండా వచ్చే అతిథులుగా భావించమన్నారు. మనం పట్టించుకోకపోతే కాసేపటికి అవే తిరుగుముఖం పడతాయని సూచించారు.

‘నేను ధ్యానిస్తున్నాను’ అని ఎవరికి వారు గుర్తు చేసుకోవడం ద్వారా, కిక్కిరిసిపోయిన ఆలోచనలకు తలుపు తెరుచుకుంటుంది. మూత తెరిచిన సోడా సీసాలోంచి వాయువు ఒక్కసారిగా పైకి వెళ్ళి, నీరు క్రమంగా స్థిరపడినట్లుగా, అనవసరమైన తలపులు మనసు పొరల్లోంచి సాధకుడికి తెలియకుండానే కనుమరుగవుతాయి. ధ్యానం మీద ధ్యాస అత్యంత సహజంగా ఏర్పడి, హృదయపు లోతుల్లో స్థిరపడుతుంది. ఇలా సాధన చేస్తున్న కొద్దీ భౌతికమైన చేతలకు, హృదయానికి చక్కని సమన్వయం కుదురుతుంది. ధ్యానానికి, ధ్యాతకు మధ్య  సరిహద్దు రేఖ చెరిగిపోతుంది. దీని ఫలితంగా అనవసరమైన ఆలోచనలను వడపోయడం సహజమైన ప్రక్రియలో భాగమైపోతుంది. ఆలోచనలకు  పదును పెట్టి, నాణ్యమైన ఫలితాలను ఇస్తుంది. కీలకమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు మంచి, చెడ్డలను బేరీజు వేసి, సన్మిత్రుడిలాగా సలహాలను ఇస్తుంది. అదేవిధంగా సత్వర నిర్ణయాలను తీసుకోవాల్సిన పరిస్థితులలో గురి తప్పకుండా వ్యవహరించే నైపుణ్యాన్ని సంతరింపజేస్తుంది. అజ్ఞాతంగా వెన్నంటి ఉంటూ సహాయపడుతుంది. ఒత్తిడికి గురిచేసే పోటీ ప్రపంచంలో మనసును ఆటుపోట్ల నుంచి కాపాడి, మానసిక సమతౌల్యాన్ని పరిరక్షించడంలో ధ్యానం ప్రముఖ భూమికను వహిస్తోందన్నది నిపుణుల మాట. శారీరక దృఢత్వం  కోసం రకరకాల పోషకాలు ఉన్నట్లే- వృత్తి, ఉద్యోగాల్లో, సృజనాత్మకమైన కార్యకలాపాల్లో మెరుగైన ఫలితాలను సాధించే దిశగా మానసిక శక్తిని పెంపొందించే దివ్యౌషధమే  ధ్యానం!

- ఓలేటి శ్రీనివాసభాను


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న