చక్రభ్రమణం

అంతర్యామి

చక్రభ్రమణం

శిశిరం అనంతరం వచ్చే వసంతంలా, చీకటి వెనక వెలుగులా మనిషి జీవితంలోనూ సుఖానుభవాలు, దుఃఖానుభవాలు ఒకదానివెంట మరొకటి కలుగుతాయి. సముద్రంలో ఆటుపోట్లు సర్వసాధారణం. అలాగే ప్రతి మనిషికీ ఎదురుదెబ్బలు, కష్టాలు తప్పవు. వాటిని తట్టుకుని నిలబడినవారే ధీరులు, కార్యసాధకులు. సుఖదుఃఖాలు, కలిమి లేములు అందరి జీవితాల్లోనూ తారసపడక మానవు. అవి అశాశ్వతాలు. అటువంటి వాటికి పొంగిపోరాదని, కుంగిపోకూడదని అన్ని సమయాల్లో ధీరోదాత్తంగా మెలగాలని విదురనీతి బోధిస్తుంది.

అరణ్యాల్లో అనేక కష్టాలు అనుభవించిన శ్రీరాముడే విజయం సాధించాడు. అరణ్య, అజ్ఞాతవాసాల్లో క్లేశాలను అనుభవించిన పాండవులే చివరికి విజేతలయ్యారు. అరణ్యంలో దుర్భర కష్టాలు ఎదుర్కొన్న నలుడే కడకు విజయం సాధించి మహారాజయ్యాడు. అందువల్ల ప్రతి మనిషీ సుఖదుఃఖాలను సమదృష్టితో చూడాలి. అలా చూడగలిగిన మనిషే అసలైన భక్తుడు, భగవంతుడికి ఇష్టుడు.

దుఃఖం వెనక సుఖం, సుఖం వెనక దుఃఖం... పగలు, రాత్రిళ్లలా వస్తూంటాయని వాల్మీకి బోధించాడు. కష్టసుఖాలు కావడి కుండలని, కష్టమైనా, సుఖమైనా కలకాలం కాపురం చేయవని మన పెద్దలు చెబుతారు.

ఈ ప్రపంచంలో గొప్ప సుఖం పొందగలిగేది ఎవరు అని భీష్ముణ్ని ధర్మరాజు ప్రశ్నిస్తాడు. ‘నిందాస్తుతులను సరిసమానంగా భావించడం, నిర్వికారంగా ఉండటమే సుఖమయ జీవితానికి మొదటి సోపానం’ అని బదులిచ్చాడు భీష్ముడు. జీవితంలో సుఖసంతోషాలే కాదు... కష్టాలను కూడా సహనంతో భరించడం నేర్చుకోవాలి. కష్టాలు, బాధలు మనిషి జీవితంలో అలజడి సృష్టిస్తుంటాయి. నిజమే. కానీ, అవి మనిషి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి పరోక్షంగా తోడ్పడతాయి. కష్టాలను భగవంతుడి దీవెనలుగా, వరాలుగా స్వీకరించాలంటారు సద్గురువులు.

ఒకసారి మహాభక్తురాలైన కుంతీదేవిని పలకరించడానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు. ‘అత్తా, నీకేం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను’ అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు కుంతీదేవి ‘కృష్ణా, నాకెప్పుడూ కష్టాలు, దుఃఖాలు ఉండేటట్లు అనుగ్రహించు’ అంది. శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయి ‘అత్తా, ఏమిటి నీ విపరీతమైన కోరిక?’ అన్నాడు. దానికి కుంతీదేవి ‘నాయనా! మేము కష్టాలలో ఉన్నప్పుడే కదా నీవు పరుగులు తీస్తూ మా వద్దకు వచ్చావు... నీ దర్శనాన్ని కలిగించే కష్టాలే కావాలి’ అంది.

భక్తుల ఆలోచనలు నిరంతరం భగవంతుడి చుట్టూ పరిభ్రమిస్తాయి. దుఃఖం భగవంతుడికి సన్నిహితుణ్ని చేస్తుంది, సుఖం భగవంతుడికి దూరం చేస్తుందని నమ్ముతారు భక్తులు. అందుకే వారు సుఖదుఃఖాలను భగవత్‌ ప్రసాదంగా స్వీకరిస్తారు. నిజానికి కష్టాలే మనిషిలోని మనోబలాన్ని పెంచి, కార్యోన్ముఖుడిగా మార్చి ముందుకు నడిపిస్తాయి. అబ్రహం లింకన్‌ జీవితంలో అనేక వైఫల్యాలు ఎదుర్కొని, ప్రతి ఓటమి నుంచీ గుణపాఠం నేర్చుకుని చివరికి అమెరికా అధ్యక్షుడయ్యాడు. విలియం షేక్‌స్పియర్‌, చార్లెస్‌ డికెన్స్‌ బాల్యంలో ఎన్నో కష్టాలనుభవించి చివరకు అద్భుత రచయితలుగా చిరకీర్తిని సంపాదించారు.

ప్రతి విషయాన్నీ సానుకూల దృక్పథంతో ఆలోచించడం అభ్యసిస్తే లోకంలో ఏదీ దుఃఖ హేతువుగా అనిపించదు. సుఖాన్ని, దుఃఖాన్ని సమంగా చూడగలిగే స్థితి ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే కలుగుతుంది. ఆ జ్ఞానం వల్లే మనిషి సుఖదుఃఖాలకు అతీతంగా ఉంటాడు. అతడే స్థితప్రజ్ఞుడు, పరిపూర్ణమైన భక్తుడు.

- విశ్వనాథ రమ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న