పదాల అక్షయపాత్ర

అంతర్యామి

పదాల అక్షయపాత్ర

లోకంలో పేరులేని ప్రాణి కానీ, పేరు లేని వస్తువు కానీ ఉండదు. రూపం ఉన్నదంటే పేరు ఉండటం తప్పనిసరి. పేరులో గుణాలు, స్వభావాలు ప్రతిబింబిస్తాయి. ఒక వ్యక్తికి గానీ, వస్తువుకు గానీ ఎన్నో పేర్లు ఉండవచ్చు. వీటినే పర్యాయ (సమాన) పదాలని అంటారు. ఉదాహరణకు శివుడికి ఎన్నో పేర్లున్నాయి. శివ, శంభు, పశుపతి, మహేశ్వర, శంకర, చంద్రశేఖర, హర, త్రిలోచన, గంగాధర అనే పేర్లన్నీ శివుడికి చెందినవే. ఇలా ఏ ‌ప్రా§ణికి, ఏ వ్యక్తికి, ఏ వస్తువుకు ఎన్నెన్ని పేర్లున్నాయో, ఆ పేర్లు ఎందుకు ఏర్పడ్డాయో తెలిపే శబ్ద(పద) కోశాలను నిఘంటువులు అని అంటారు. ప్రతి భాషలోనూ ఆయా భాషా పదాలను నిర్వచించే నిఘంటువులు ఉంటాయి. అలాగే, దేవభాష, విస్తృత పద సంపద గల భాష అయిన సంస్కృతంలోనూ ఎన్నో నిఘంటువులున్నాయి. అన్నింటిలోనూ మిన్నగా లోకాదరణను పొందిన నిఘంటువు అమరకోశం.

అమరశబ్దం దేవతలను చెబుతోంది. అమరులంటే దేవతలు. మరణం లేనివారు. వారు మాట్లాడే భాష అమర భాష. అంటే సంస్కృతం. అందువల్ల ఈ గ్రంథం అమరభాషా కోశం కావడం సార్థకం. ఈ కోశాన్ని రచించినవాడు అమరసింహుడు. అతడి పేరుతోనే ఈ పదకోశం అమరకోశం అయింది. అమరకోశం అని, అమరం అనీ పిలవడం ప్రసిద్ధం. ఈ గ్రంథంలోని ప్రార్థన శ్లోకాలను అనుసరించి ఇతడు బౌద్ధుడని ఒక వాదం ఉంది. వైదిక కర్మలకు సంబంధించిన పదాలనూ చక్కగా నిర్వచించాడు కనుక ఇతడు హిందువే అనీ ఒక వాదం. వాదాలు ఎలా ఉన్నా అమరుడు అందరివాడు. జ్ఞానం అందరిదీ కదా! ‘జ్యోతిర్విద్యాభరణం’ అనే గ్రంథంలోని ఒక శ్లోకం ఆధారంగా ఇతడు విక్రమార్కుడి ఆస్థానంలోని నవరత్న విద్వాంసులలో ఒకడని తెలుస్తోంది.

వాఙ్మయ ప్రపంచం అత్యధికంగా ఆరాధించే గ్రంథం అమరకోశం. లోకంలో సంస్కృత భాషను నేర్చుకోవాలనుకునేవారు మొట్టమొదట అమరకోశాన్ని కంఠస్థం చేయడం సంప్రదాయం. సంస్కృత భాషాభ్యాసానికి ఈ కోశం బాలశిక్ష వంటిది.  ప్రతి నామం వెనక ఒక అర్థం ఉంటుంది. అర్థాన్ని బట్టి లింగం (పురుష, స్త్రీ, నపుంసక) ఏర్పడుతుంది. ఇలా నామాలను, వాటికి లింగాలను చక్కగా నిర్దేశించి చెప్పినందువల్ల ఈ కోశానికి ‘నామలింగానుశాసనమ్‌’ అనే పేరు ఏర్పడింది. దీనిలో మూడు కాండలు(అధ్యాయాలు) ఉన్నాయి. ప్రథమ కాండలో పన్నెండు వర్గాలు, ద్వితీయ కాండలో పది వర్గాలు, తృతీయ కాండలో అయిదు వర్గాలు ఉన్నాయి.

లోకంలో చాలామంది పేర్లు పెట్టుకుంటారు. కానీ ఆ పేర్లలోని అంతరార్థాలు వారికి పూర్తిగా తెలియకపోవచ్చు. అందుకే లోకంలోని ప్రతి నామం వెనక దాని సారం ఉంటుందని గ్రహించాలి. అర్థం లేని పేరు వ్యర్థంగా మారుతుంది. అర్థవంతమైన పేరు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తేజాన్ని ఇస్తుంది. పదంలోని అక్షరాల సంయోజనంలో అర్థశక్తి ఉద్భవిస్తుందని, అదే ఒక మంత్రంలా మనిషిని ఆకర్షిస్తుందని పెద్దల మాట. ఏ నామాన్ని (పేరును) ఎలా ఉచ్చరించాలో స్పష్టంగా తెలిపేదే నిఘంటువు. పేరులో ఏముందని ప్రశ్నించేవారికి ‘పేరులోనే అంతా ఉంది’ అని చెబుతారు భాషా కోవిదులు! పేరు లేనివాణ్ని అనామకుడు అన్నట్లే పేరులోని అంతరార్థం తెలియని వాణ్ని అజ్ఞాని అంటారు తెలిసినవారు. తెలియకపోవడం తప్పు కాదు కాని, తెలుసుకోవాలనే జిజ్ఞాస లేకపోవడం దోషమే అవుతుంది.

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న