ఇవ్వడంలో ఉన్న హాయి

అంతర్యామి

ఇవ్వడంలో ఉన్న హాయి

న సామాజిక జీవన వ్యవస్థలో ఇచ్చిపుచ్చుకోవడం అనే విధానం అంతర్లీనమై ఉంది. వర్తమాన కాలంలో ఇవ్వకుండానే పుచ్చుకోవడానికే మనిషి ప్రాధాన్యమివ్వడంవల్ల ఆ వ్యవస్థ బలహీనపడిపోతుంది. ఇవ్వడమంటే ఏదైనా కావచ్చు. ధనం, వస్తువు, వాహనం... ఏదైనా. కనీసం సాటి మనిషి శ్రేయస్సుకు తనకు తెలిసిన విషయ పరిజ్ఞానంతో ఓ చిన్న సలహాగాని, సూచనగాని ఇచ్చే తీరిక, ఓపిక మనుషులకు ఇవాళ లేకపోవడం దురదృష్టకరం. ప్రార్థించే పెదవులకన్నా సేవ చేసే చేతులు మిన్న అని పెద్దలు ఏనాడో చెప్పారు. మనకన్నా గొప్పవారైతే, వారిని అనుసరించాలి. తక్కువవారైతే చేయందించి ఆదుకోవాలి. సంసారి అయినవాడు ఇవాళ ఓ నిస్సహాయుడికి సాయం చేశాను అనుకోగలిగితే, ఆ రోజున హాయిగా నిద్రపోతాడు. నిస్వార్థమైన ఆలోచనలనుంచే సేవాభావం ఉదయిస్తుంది. పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడే వ్యక్తిని ఆనందం, సంతృప్తి నీడలాగా వెన్నంటే ఉంటాయి.

ఇతరులకు మనం ఏదైనా మనస్ఫూర్తిగా, ప్రేమగా ఇవ్వడాన్ని అలవాటు చేసుకోవాలి. మొక్కుబడిగానో, ఎవరి ఒత్తిడివల్లనో ఇచ్చేది ఇవ్వడమనిపించుకోదు. ‘మనం సుఖంగా ఉండటానికి అత్యంత సులభమైన మార్గం, ఇతరులనూ సుఖంగా జీవించేలా చేయడమే’ అంటారు స్వామి వివేకానంద. ఎంతకాలం జీవించామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం. ఇతరులకు హితం చేకూర్చడం వల్లనే ఆ గొప్పతనం వస్తుంది. ప్రతి మనిషిలోనూ ఏదో ప్రతిభ, ప్రత్యేకత ఉంటాయి. వాటిని పరుల మేలుకు పంచిపెట్టడమే జన్మసార్థక్యం.  గురువు విద్యాదానం చేస్తాడు. శిష్యుడు దాన్ని గ్రహించినకొద్దీ గురువు పట్ల గౌరవభావం వృద్ధి చెందుతుంది. అది కోరగా వచ్చిన గౌరవం కాదు. విద్యాదానం చేస్తే వచ్చిన గౌరవం. దీనినే మర్యాద అనీ అంటాం. మర్యాదకు శ్రీరామచంద్రమూర్తి పెట్టింది పేరు. ఆయనను మర్యాదాపురుషోత్తముడన్నారు. స్మితభాషి, హితభాషి రాముడు. ముందు తానే ఎదుటివారిని మర్యాదగా పలకరించేవాడు. రామాయణంలో ప్రతి పాత్ర నుంచీ మనం ఇవ్వడమే గొప్ప ఆదర్శగుణంగా గ్రహిస్తాం. పరుల హృదయాన్ని గెలవాలంటే ముందు ఇవ్వడం నేర్చుకోవాలి. వారికవసరమైనది ఇవ్వడంలో కలిగే ఆనందం వర్ణనాతీతం. ప్రతిఫలం కోసం నిరీక్షించే పనే ఉండకూడదు. రావలసింది, రాదగింది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. అందుకు మనం కూడా పాత్రత కలిగి ఉండాలి. అపాత్రదానం ఎన్నటికీ ఫలితమివ్వదు. మృదుభాషణం, ప్రియభాషణం, పరుషోక్తులు పలక్కపోవడమనేవి మనిషికి సహజంగా ఉండదగిన ఆభరణాలని భర్తృహరి చెప్పాడు. ఒక్కొక్కప్పుడు మాట్లాడక మౌనంగా ఉండటం కూడా మర్యాదకు సంకేతమని విజ్ఞులు చెప్పారు. అది గ్రహించినవాడే వివేకి. సృష్టిలోని ప్రతి వస్తువుకూ ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చే గుణముంది. గాలి, నీరు, చెట్టు- మనిషి స్వార్థానికి గురవుతూనే మానవాళికి మేలు చేస్తున్నాయి.

పూర్వం చక్రవర్తులు ఆర్తులను ఆదుకొని, విరివిగా దానాలు చేసి కీర్తిమంతులైనారు. శిబి చక్రవర్తే అందుకు ఉదాహరణ. రుషులు మానవజాతి సముద్ధరణకు ఎన్నో హితోపదేశాలు చేశారు. దానం చేయగలిగిన మనసు స్వర్గంలాంటిది. ఆ స్వర్గంలో హింసకు, ద్వేషానికి, నిర్దయకు తావుండదు. ఇవ్వడం తెలిసినవాడి మనసు నిండా ఔదార్యం ఉంటుంది. ప్రేమ, అహింస, కారుణ్యం, ఆర్ద్రత నిండుగా ఉంటాయి. దయను తల్లిగా, ధర్మాన్ని తండ్రిగా భావించగలిగేవాడే ముక్తుడు, విముక్తుడు. నేను, నాది అన్న అహం కలిగినవాడు ఎవ్వరికీ ఏమీ ఇవ్వలేడు.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న