పాండిత్యం - జ్ఞానం

అంతర్యామి

పాండిత్యం - జ్ఞానం

పాండిత్యం, జ్ఞానం- ఈ రెండు మాటల్నీ నిత్యవ్యవహారంలో తరచుగా ఉపయోగిస్తుంటాం. పాండిత్యాన్ని విద్యాత్మక శక్తిగాను, జ్ఞానాన్ని మనోవికాస చిహ్నంగాను గుర్తించడం పరిపాటి. పండ అంటే బుద్ధి, తెలివి. బుద్ధిగలవాడు పండితుడు. శాస్త్రాలు, దర్శనాలు, ఛందోవ్యాకరణాలంకారాల పరిజ్ఞానం గలవారిని పండితులుగా పరిగణిస్తుంటారు. పూర్వం రాజాస్థానాల్లో పండితులుండేవారు. శాస్త్ర చర్చలు జరిగేవి. ఆధునికంగా సాహిత్య బోధన, ప్రవచనాల వంటి కార్యక్రమాల్లో నిమగ్నమైనవారిని పండితులుగా లోకం వ్యవహరిస్తోంది.

‘జ్ఞ’ అంటే తెలుసుకోవడం. ఆ ఎరుక సమృద్ధిగా గలవారిని జ్ఞానులుగా లోకం భావిస్తుంది. విభిన్న లౌకిక విద్యల్లో, ఆధునిక శాస్త్రాల్లో విస్తారమైన పరిజ్ఞానం గలవారిని ఆయా విషయాల్లో నిష్ణాతులుగా, మేధావులుగా గుర్తించాలే తప్ప జ్ఞానులుగా కాదు. జ్ఞానమంటే లౌకికమైన తెలివి కాదని గ్రహించాలి.

నిజమైన పండితుడు విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుణ్ని, కుక్క మాంసం తినే చండాలుణ్ని, గోవు ఏనుగు శునకం మొదలైన జంతువుల్ని సమదృష్టితో చూస్తాడని కర్మ సన్యాస యోగంలో పరమాత్మ వచనం. సర్వభూతాల్లోనూ ఒకే ఆత్మను దర్శించే ఆత్మజ్ఞుడు భేదాలను పరిగణించడు. ఇదే సమబుద్ధి లేక సమదర్శనం. ఈ సమదర్శనం గలవారే పండితులు. అటువంటివారు సర్వ భూతాల హితాన్ని అపేక్షిస్తూ, ఆ భూతాలతో కలిసి మెలిసి జీవిస్తారు. రుషుల ఆశ్రమ ప్రాంగణాల్లో సకల జీవకోటి శత్రుత్వం విడిచి ఒకదాని నొకటి నొప్పించకుండా ఒకటిగా కలిసి జీవించడం ప్రాచీన కావ్యాల వర్ణనల్లో కనిపిస్తుంది. సమదర్శనం పొందిన వ్యక్తి సన్నిధిలో జీవకోటి కూడా సమదర్శనం సాధిస్తుందని ఈ సన్నివేశాలు చెబుతున్నాయి. సమదృష్టి గలవాడు తన తోటివారికి ఉద్వేగం కలగకుండా, వారి ప్రవర్తనవల్ల తాను ఉద్వేగం పొందకుండా హర్షరోష భయాలకు అతీతమైన యోగ స్థితిలో అంతర్యామికి ప్రియుడై వర్తిస్తుంటాడని భక్తియోగం చెబుతోంది. ఎవరి మనసు సౌమ్యస్థితిలో అంటే నిశ్చలంగా ఉంటుందో వారు జనన మరణాల్ని జయించిన వారు లేక జీవన్ముక్తులు. కామవాసనలు లేకపోవడం నిర్దోషం. దోషం ఉన్నంతవరకు మనో చాంచల్యం తప్పదు. నిర్దోషమైన మనసు స్థిరంగా ఉంటుంది. స్థిరమైన మనసు గలవారే స్థితప్రజ్ఞులు. వారే జ్ఞానులు.

జ్ఞానం గంధపు చెక్కలాంటిది. సానపై రుద్దేకొద్దీ మరింతగా పరిమళిస్తుంది. వేలమందిలో ఉన్నా జ్ఞాని తన పాండిత్యం, ప్రజ్ఞలవల్ల ప్రకాశిస్తుంటాడు. జ్ఞాన సంస్కారం చాలా గొప్పది. ‘ఎరుక కన్నను సుఖము లోకమున లేదు. ఎరుక సాటికెరుక ఎరుకయే తత్వంబు’ అన్నాడు వేమన. పండితులు ప్రియాప్రియ వస్తువియోగ సంయోగం వల్ల జనించే దుఃఖానికి మనసులో చోటివ్వరని తిక్కన మహాభారతం స్త్రీ పర్వంలో పేర్కొన్నాడు. ఇక్కడ పండితుడంటే జ్ఞాని అనే గ్రహించాలి. పరమాత్మను తెలుసుకున్నవాడే జ్ఞాని. పాండితి, జ్ఞానాలను లౌకిక దృష్టితో గాక ఆధ్యాత్మికంగా అవగాహన చేసుకుంటే రెండూ ఒకటే. జ్ఞాని కావడానికి పాండిత్యం సాధనంలా ఉపకరిస్తుంది. పాండిత్యం బోధనాంశమైతే, జ్ఞానం అనుభవ విషయం. పండితుల బోధనలవల్ల అజ్ఞానావరణం తొలగి జ్ఞానసూర్య ప్రకాశం అనుభూతమవుతుంది.

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న