పంచ యజ్ఞాలు

అంతర్యామి

పంచ యజ్ఞాలు

జ్ఞం అనే పదానికి ఇష్టి, యాగం, క్రతువు మొదలైన పేర్లు ఉన్నాయి. భూలోకంలో మానవులు దేవతలను ఉద్దేశించి అగ్నిముఖంగా ద్రవ్యాలను సమర్పించే క్రియ యజ్ఞం. మనిషి తనను తాను సంస్కరించుకొని కోరిన కోరికలు నెరవేరడానికి చేసే హోమమే ‘యజ్ఞం’ అని నిఘంటువులు చెబుతున్నాయి. వీటిని ఆచరించడం వల్ల పాపాలు నశించి సుఖశాంతులు కలుగుతాయని, పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి మానవుడు చేసే ప్రయత్నాల్లో యజ్ఞం ఒక మార్గమని పురాణాలు చెబుతున్నాయి. మరోలా చెప్పాలంటే-  యజ్ఞం అంటే ఆత్మ పరిత్యాగం అనవచ్చు.

సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు యజ్ఞం చేసిన తరవాతనే మానవులను సృష్టించాడని, అలా సృష్టించిన వారితో ‘మీరందరూ ఈ కర్తవ్య కర్మ రూపమైన యజ్ఞం ద్వారా వృద్ధి పొందండి’ అని చెప్పాడని బ్రహ్మపురాణం వల్ల తెలుస్తోంది.

అగ్నిముఖంగా కాకుండా అర్పణ, కృతజ్ఞత భావాలతో చేసే కృత్యాలను సైతం యజ్ఞం అనే పిలుస్తారు. ఇవి ప్రధానంగా అయిదు రకాలు. మొదటిది దేవయజ్ఞం. అంటే దేవతల పట్ల కృతజ్ఞత ప్రకటించడం. రెండోది పితృయజ్ఞం. జన్మనిచ్చి, పెంచి పోషించి, విద్యాబుద్ధులు నేర్పిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ప్రకటించడం. తల్లిదండ్రులకు తర్పణం చేయడం లాంటి పుత్రుడి బాధ్యతలు నిర్వర్తించడమే ఈ యజ్ఞ నిర్వహణ. దీనివల్ల కుటుంబ వ్యవస్థ పటిష్ఠమై వంశానికి అభ్యుదయం చేకూరుతుంది. మూడోది ఋషి యజ్ఞం. అంటే, మనకు జ్ఞానభిక్ష అనుగ్రహించిన రుషులు, సత్యాన్వేషకుల పట్ల కృతజ్ఞత ప్రకటించడం; వారిపట్ల విధేయుడై భక్తిశ్రద్ధలతో మెలిగి వారి ఉపదేశానుసారం కర్మలు నిర్వర్తించడమే ఈ యజ్ఞం చేయడమని భావం. అది మానవుల ముఖ్య కర్తవ్యం. నాలుగోది, బ్రహ్మ యజ్ఞం. అంటే వేదాధ్యయనం. దీని ద్వారా లోకానికి శాంతి కలిగించడం. చివరిది భూత యజ్ఞం. ప్రాణుల పట్ల ప్రేమ చూపడం దీని విధానం. ఇవన్నీ నెరవేర్చే మానవులనే జగన్మాత అనుగ్రహిస్తుందని, అందుకే ఆ పరాశక్తిని ‘పంచయజ్ఞ ప్రియా’ అన్నారని దేవీ భాగవత కథనం.

గీతాచార్యుడు ద్రవ్య యజ్ఞం, మనోనిగ్రహ యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, తపోయజ్ఞం, జ్ఞానయజ్ఞం తదితరాల్నీ పేర్కొన్నాడు. వీటన్నింటిలోనూ జ్ఞాన యజ్ఞమే శ్రేష్ఠమైనదని శ్రీకృష్ణుడు చెప్పాడు. తత్వ విచారం, ఆత్మానాత్మ వివేకం, ఇంద్రియ నిగ్రహం, వాసనా క్షయం వంటివి జ్ఞానయజ్ఞంలోని భాగాలు.

ప్రజలు వారి వారి సంస్కారాలు, అభిరుచులను అనుసరించి మరికొన్ని భిన్న మార్గాల ద్వారా చిత్తశుద్ధి పొంది చివరకు పరమాత్మను చేరుకోవచ్చు. ఈ క్రియనూ యజ్ఞమనే అంటారు. ఈ యజ్ఞాలు మూడు రకాలు. ‘ఇవి చేయదగినవే’ అని మనసును సమాధానపరచి శాస్త్ర సమ్మతమైన విధానంలో ఫలాపేక్ష లేకుండా చేసేది సాత్విక యజ్ఞం. బలాన్ని ప్రదర్శించి దంభం కోసం చేసేది రాజస యజ్ఞం. దీని వల్ల చిత్తశుద్ధి కలగదు. అలాంటప్పుడు ఆత్మతత్త్వం ప్రకాశించదు. అయినప్పటికీ రాజసం రాజు కర్తవ్యం కాబట్టి యజ్ఞంగానే పరిగణిస్తారు. పరులకు ఉపకారం చెయ్యడమే దీని ఆచరణ విధానం.

ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేది యజ్ఞం. యజ్ఞాలు కామధేనువులాగా జీవుల అభీష్టాలను నెరవేర్చి వారిని ఉన్నత పథగాములుగా చేస్తాయి. వీటిని ఆచరిస్తే జన్మ రాహిత్యం, పరమానంద ప్రాప్తి పొందగలరని, జీవుల నైతిక, ఆర్థికాభివృద్ధికి అవి ఉపయోగపడతాయని రుషులు ఉద్బోధించారు.

- వి.ఎస్‌.ఆర్‌.మౌళి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న