విజయ సాధనం

అంతర్యామి

విజయ సాధనం

సోమరి తన సమయాన్నే కాక, ఇతరుల కాలాన్ని కూడా వ్యర్థం చేస్తుంటాడు. శ్రమజీవి తనకూ తన కుటుంబానికే కాక మొత్తం సమాజానికే ప్రయోజనం చేకూరుస్తాడు. కర్షకుల కృషి వల్ల అందరికీ ఆహారం లభిస్తుంది. మూడేళ్లు వరసగా వర్షాలు పడకపోయినా, పట్టు వదలక పొలం దున్నుతూనే ఉంటాడు. నాలుగో సంవత్సరం వాన కురిస్తే తన శ్రమ భగవంతుడి దయవల్ల ఫలించిందని కర్షకుడు మురిసిపోతాడు. కృషీవలుడికి తన పొలమే సర్వస్వం. తన చేనులో పెరిగే మొక్కల్ని చూసి అతడు మురిసిపోతాడు. వాటిని రక్షించడానికి ఎంత శ్రమకైనా వెనకాడడు.

ఒక రైతు పొలందగ్గర కాపలా ఉన్నాడు. ఇంతలో కొందరు భటులు వేటాడుతూ అటువచ్చి, పొలంలో పడి, పెద్దగా అరుచుకుంటూ, పంటను తొక్కుతూ పరుగెత్తుకుంటూ వెళ్లారు. వాళ్లందరినీ రైతు తిట్టసాగాడు. చివరలో వాళ్ల రాజు కూడా మంత్రితో కలిసి గుర్రంపై వచ్చాడు. ఆయన బరోడా రాజు అని రైతుకు తెలియదు. రైతు ఆయన్ని కూడా తిడుతూ ములుగర్రతో కొట్టబోయాడు. భటులు రాజును చూసి జయజయ ధ్వానాలు గావించారు. అప్పుడు గాని రైతు గుర్తించలేదు... తానెంత తప్పు చేశాడో! అందరూ రాజు రైతును కఠినంగా శిక్షిస్తాడని భావించారు. కాని, రాజు మాత్రం గుర్రం దిగివచ్చి, రైతుకు నమస్కరించి నిలిచాడు. ‘మీరు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మేము ఎడాపెడా తొక్కి నాశనం చేయడం తప్పే! అందుకు మీరే మమ్మల్ని క్షమించాలి! మంత్రిగారూ, రైతు పంటలు పండించకపోతే మనకు కనీసం ఆహారం కూడా లభించదు. కాబట్టి రైతులమీద ఎటువంటి పన్నులూ వేయవద్దు! నా ఈ ఆజ్ఞను వెంటనే అమలు చేయండి!’ అన్నాడు రైతుకు నమస్కరిస్తూ.

ఓటమి శాశ్వతం కాదు. అందువల్ల కలిగే కష్ట నష్టాలు కూడా తాత్కాలికమే! అత్యున్నత స్థానానికి చేరాలంటే, ఎన్నో అడ్డంకులు దాటవలసి ఉంది. వాటన్నింటినీ నేర్పుతో ఓర్పుతో అధిగమించిన వారే తుదకు విజయం సాధించగలరు. చరిత్రలో వారి పేర్లే నిలుస్తాయి. ఐన్‌స్టీన్‌ విద్యార్థిగా ఉన్నప్పుడు గణితంలో వెనకపడి ఉపాధ్యాయుల చేత తిట్లు తినేవాడు. ‘ఎప్పటికైనా నేను గణిత శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి తీరతాను’ అని సహచర విద్యార్థులతో ఐన్‌స్టీన్‌ అనేవాడు. అవిశ్రాంత కృషితో గొప్ప శాస్త్రజ్ఞుడిగా అనంతర కాలంలో ప్రపంచ ఖ్యాతిని ఆర్జించాడు.

సునాయాసంగా ఎవరికీ ఏదీ లభించదు; లభించకూడదు. అలా శ్రమ లేకుండా లభిస్తే దాన్ని దుర్వినియోగ పరచడాన్ని లోకంలో మనం చూడవచ్చు. గొప్పవారి ప్రఖ్యాతి వెనక కఠిన తపశ్చర్య వంటి కృషి దాగి ఉంటుంది. ఈ సత్యాన్ని గ్రహించలేనివాళ్లు గొప్పవారిని చూసి అసూయ పడుతూ ఉంటారు. తాతలు సంపాదించిన ఆస్తులను తమ సంపాదనగా చెప్పుకొంటూ సంతోషిస్తుంటారు కొందరు. కానీ ప్రపంచానికి అసలు విషయం తెలుసు కాబట్టి వాళ్లకు నిజమైన గౌరవం లభించదు. రాక్‌ ఫెల్లర్‌ లోకంలోనే ‘గొప్ప ధనవంతుడు’ అని పేరు గాంచాడు. కేవలం నిరంతర కఠోర కృషి ద్వారా చెమటబిందువులను పెట్టుబడిగా పెట్టి, నూనె వ్యాపారం ద్వారా ధనం సంపాదించాడు. తాను సంపాదించిన డబ్బుతో అనేక సంస్థలను స్థాపించి వేలమంది నిరుద్యోగాన్ని పోగొట్టాడు.  అంత ధనమూ ఉండి కూడా నిరాడంబర జీవితాన్నే గడిపాడు.

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న