దేవుడి కోరిక

అంతర్యామి

దేవుడి కోరిక

నుషులకు కోరికలుంటాయి. దేవుడికి కోరికలుండటమేమిటి అనే సందేహం రావచ్చు. దేవుడికి ఉండేవి చిన్నపిల్లాడి కోరికల్లాంటివి. పిల్లలు ఐస్‌క్రీం కావాలనో, చిన్న బొమ్మ కావాలనో కోరతారు. అవి కొనివ్వడం మనకు ఏమంత కష్టమైన పనేమీ కాదు. సంతోషంగా మనం కొనిస్తాం. భగవంతుడి మనస్తత్వం ఇలాంటిదే!

మనుషుల కోరికలకు అంతుండదు. తీరినకొద్దీ ఊరుతూనే ఉంటాయి అవి. పొయ్యిలో మంట తగ్గుతుంటే పుల్లలు పెట్టి ఆ మంటను పెంచుతాం. అలాగే మన కోరికల మంటలు పెరుగుతూనే ఉంటాయి. వీటివల్లనే దుఃఖాలు కలిగేది. బెంగకు, దుఃఖానికి దూరంగా ఉండాలంటే కోరికలను క్రమేపీ తగ్గించుకోవడం వినా మరో మార్గం లేదు. ఆర్జించిన సంపద చాలదు, దొరికిన పదవి చాలదు. వచ్చిన కీర్తి చాలదు. అందివచ్చిన అధికారం చాలదు. ఇంకా ఏదో ఏదో, ఎంతో ఎంతో కావాలనే వెంపర్లాట; తపన, ఆతృత, పోరాటం. మనిషి వీటికోసం దేవుడితో మొరపెట్టుకుంటాడు. మొక్కుతుంటాడు. యాత్రలు చేస్తాడు. హోమాలు యాగాలు, అభిషేకాలు, షోడశోపచార పూజలు, వ్రతాలు- ఇలా ఎన్నో చేస్తాడు. మనకు యోగ్యత ఉంటేనే పరమాత్మ ప్రసాదిస్తాడన్న సత్యం గ్రహించడు.

భగవంతుడివన్నీ పసిబాలుడి కోరికలు. అవి గ్రహించి తీరిస్తే, మనమేదీ అడక్కపోయినా అన్నీ మన లోగిట్లోకి వచ్చి చేరతాయి. అవకాశాలైనా అంతే! స్వామి కోరే ఆ చిన్ని చిన్ని కోరికలేమిటి? నిశ్చలమైన భక్తి కలిగి ఉండమన్నాడు. మనకిది ఏమంత కష్టమైన పని? నామస్మరణ తరణోపాయమన్నాడు. ధర్మబద్ధంగా నీ పని చేసుకుంటూ ఫలితం తనకొదిలేయమన్నాడు. ధన, కనక, వస్తు, వాహనాలు కాదు... పత్రమో, పుష్పఫలమో జలమో- ఏది నీకు అందుబాటులో ఉంటే అదే సమర్పించమన్నాడు. చింతకు చికిత్స చింతనం ఒక్కటే అని సూచించాడు. నన్ను నీ మనసులో బందీ చెయ్యి. నిన్ను బంధవిముక్తుణ్ని చేస్తానన్నాడు. మన భక్తి బాంధవ్యం దృఢంగా ఉంటే నిన్ను మించిన విజేతే లోకంలో ఉండడన్నాడు. రెండు చేతులూ ఓసారి జోడించు. నీకు సంపూర్ణారోగ్యం ప్రసాదిస్తానన్నాడు. ఓంకారం ఉచ్చరిస్తే చాలు, నువ్వే దేవుడివై మానవాళిని ఉద్ధరిస్తావన్నాడు. ఇవి ఏమంత కష్టమైన పనులు? నిజానికి అంతర్యామివి కోరికలు కావు. అంధకార బంధురమైన మన బతుకుబాటకు అందించిన కరదీపికలు అవి.

మనసులో మాధవుడున్నప్పుడు మానవతా మందిరం కాక మరేముంటుంది? మమతాజ్యోతి కాక మరేముంటుంది? కామక్రోధాది అరిషడ్వర్గాలు పిరికివై పారిపోవా? నీ చిత్రంలో నీ చిత్తంలో నా చిత్రం దాచుకొమ్మంటే అదీ బరువనుకుంటే ఎలా? పరమేశ్వరుడి బోళాతనానికింతకంటే ఉదాహరణలు ఏం కావాలి? ఇవన్నీ పసిబాలుడి లేేతనవ్వుల రవ్వల వెలుగులు కావా? వాటిని ఆహ్వానించి మన తనువులోని అణువణువునా నింపుకోగలిగితే బతుకు ఇంద్రధÅనుస్సే! నవవిధ భక్తుల్లో ఏదైనా మనకు సులభగ్రాహ్యమైనదే. మనకు ఆయన పట్ల నమ్మకం ఉండాలి. ఆయన మీద ప్రేమ ఉండాలి. మనల్ని ఆనందంగా ఉంచడానికే దేవుడు మనం కోరినవన్నీ ఇవ్వడు. ఆయన కోరింది చేస్తే, మనమేదీ కోరుకోవాల్సిన అవసరమే ఉండదు. మనం ఆయన వైపు ఒక అడుగేస్తే ఆయన పది అడుగులు వేసి మన ముందుకొస్తాడు.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న