స్వరూపం

అంతర్యామి

స్వరూపం

నిషి స్వభావం కన్నా ముందు స్వరూపమే ప్రజలకు పరిచయమవుతుంది. మన్నన, మర్యాదలను దక్కేలా చేస్తుంది. ‘రామా నీలమేఘ శ్యామా!’ అంటూ మునులు తనివితీరా రాముణ్ని కీర్తించారు. నల్లనివాడు, పద్మనయనంబులవాడు అంటూ పోతన కృష్ణభగవానుడి రూప సౌందర్యాన్ని వర్ణించాడు.

ప్రతి ఒక్కరం సమాజంలో గౌరవాన్ని పొందాలనుకుంటాం. అందుకు వకారం ఆదిగా ఉన్న అయిదు పద లక్షణాలను కలిగి ఉండాలన్నది సంస్కృత నీతి. అందంతోపాటు పొందికగా ఉన్న మంచి వస్త్రాలు ధరించాలి. ఆరోగ్యకరమైన వపువు(శరీరం) కలిగి ఉండాలి. ఎదుటివారి హృదయాలను రంజింపజేసే  వాక్కును సొంతం చేసుకోవాలి. మంచి చెడుల విచక్షణ తెలిపే విద్యను అభ్యసించాలి. భగవంతుడికి పెద్దలకు ప్రీతి కలిగేలా వినయ స్వభావాన్ని అలవరచుకోవాలి.

వేంకటేశ్వరస్వామి అలంకార ప్రియుడు. ప్రతిరోజూ అనేకానేక పత్ర పుష్పాలతో ఆయన స్వరూపం భక్తులకు కనువిందు చేస్తుంది. నూతన వస్త్రాలతోను తాజా పువ్వులతో, మంచి గంధంతో అలంకరించుకుని స్వామి నిత్య కల్యాణానికి సిద్ధంగా ఉంటారు. అమ్మవారు ఐశ్వర్య ప్రదాయిని కావడం వల్ల సకలాభరణాలను ధరించి ఉంటుంది. భక్తజనుల కోరికలు తీర్చే వారి ముగ్ధ మనోహర సౌందర్యం మళ్ళీ మళ్ళీ చూడాల నిపించేలా ఉంటుంది.

కావ్యారంభంలో కవులు ఇష్టదేవతా స్తుతి చేయడం సంప్రదాయం. ఆ సందర్భంలో ప్రతి కవీ తనకు ఇష్టమైన దైవస్వరూపాన్ని పాఠకుల కళ్లకు కట్టినట్లుగా వర్ణిస్తారు. మానవ స్వరూప వర్ణనలో కవులు ఒక నియమాన్ని పాటిస్తారు. దేవతల్ని వర్ణించేటప్పుడు ముందుగా పాదాలనుంచి క్రమంగా పైరూపాన్ని వర్ణిస్తారు. మానవ వర్ణన చేసేటప్పుడు శిరస్సు కురులనుంచి కిందకు వర్ణించడం సాధారణ నియమం.
ఒక్క క్షణంలో సమస్త కోరికలను నెరవేర్చేవాడు శంకరుడు. అతడి స్వరూపం తక్కిన దేవతలకన్నా విభిన్నంగా ఉంటుంది. ఏనుగు చర్మాన్ని వస్త్రంగా చుట్టుకొని ఉంటాడు. సర్పాన్ని కంఠహారంగా ధరిస్తాడు. శ్మశానవాసియై కపాలాన్ని భిక్షాపాత్రగా చేసుకున్న శివుడు భక్తసులభుడు.

స్వరూపాన్ని బట్టి వ్యక్తి స్వభావాన్ని, అతడి శక్తి యుక్తులను అంచనా వెయ్యలేం. జ్ఞాని సామాన్యమైన రూపంతో నివురు(బూడిద) కప్పిన నిప్పులా ఉండవచ్చు. రూపాన్ని చూసి చులకన చెయ్యకూడదు. ఒకనాడు రావణాసురుడు శివ దర్శనం కోసం కైలాస పర్వతానికెళ్ళాడు. సరాసరి లోపలికెళ్ళబోతున్న రావణుడిని నందీశ్వరుడు అడ్డగించాడు. శివపార్వతుల ఏకాంతానికి భంగం కలుగుతుందని వారించాడు. అహంకారియై రావణుడు నందిని వానరుడిలా ఉన్నావంటూ గేలి చేస్తాడు. తన రూపాన్ని పరిహసించిన రావణుడిపై నందికి ఆగ్రహం కలుగుతుంది. నాలాంటి వానరులే నీ వంశ నాశనానికి కారణమవుతారంటూ శపిస్తాడు.
ఒక్కొక్క వ్యక్తికి తనకంటూ ప్రత్యేకమైన ఒక రూపం ఉంటుంది. శ్రీకృష్ణభగవానుడి పేరు చెప్పగానే శిరస్సుపైన నెమలిపింఛం, చేతిలో వేణువుతో ఉన్న స్వరూపం కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. ఆ దివ్య సుందర రూపం తరతరాలుగా అందరినీ భక్తి పారవశ్యంతో ఓలలాడిస్తుంది. ప్రపంచం ఏ విధంగా తనను గుర్తుంచుకోవాలని ఆశిస్తాడో ఆ స్వరూప, స్వభావాలను పొందడానికై మానవుడు కృషి చెయ్యాలి.

- గోలి రామచంద్రరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న