ధర్మం వైపే మొగ్గు

అంతర్యామి

ధర్మం వైపే మొగ్గు

రీరం పాంచ భౌతికాల అలంకారం. మనసూ అంతే. దాని స్వభావ, గుణగణాలు మనిషి సేవించే ఆహార నియమాలతో అనుసంధానమై ఉంటాయి. తినే అన్నమే దేహం. మనసు, శరీరం ఒకదానికొకటి భూమిక పాత్ర పోషిస్తాయి. మనసు బాగుంటే మనిషి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శరీరం చక్కగా ఉంటే మనసూ మంచిగా ఉంటుంది. పౌష్టిక ఆహారంతో శరీరం దృఢపడుతుంది. మనసూ బలం పుంజుకొంటుంది. వివేకం వికసిస్తుంది. నిజమైన జ్ఞానం(ప్రజ్ఞ) విప్పారుతుంది.

సత్యం(జ్ఞానం) తెలియడం ఒక్కటే మనిషిని నిర్భయుణ్ని చేస్తుంది. గతించినదానికి చింతించకుండా రాబోయే దానిపట్ల భయాందోళనకు గురికాకుండా జీవితాన్ని యథాతథంగా స్వీకరించమంటుంది.

జ్ఞానబలంతో మనిషి బతుకు నిచ్చెనమెట్లను అవలీలగా అధిరోహిస్తాడు. జీవన శిఖరాగ్ర భాగాన నిలిచిన అలాంటి ఉన్నతుడు దేనికీ జంకడు. జీవన తాత్విక మూలాలు ఎరిగినవారు జీవన వ్యాపకాల్ని స్థితప్రజ్ఞతో పూర్తికానిస్తారు.

భూమ్మీద ఎత్తైన భాగం ఒకటి ఉన్నప్పుడు ఆ పరిధిలో దాని చుట్టూ ఉన్న ప్రాంతం దిగువన ఉంటుంది. కింది తలం పైభాగాన్ని నిర్విరామంగా మోయడమే కాకుండా తలభాగాన పడ్డ చెత్త చెదారం, దుమ్ముధూళిని కిందకు లాక్కుని దూరాలకు మోసుకెళ్లి పారవేస్తుంది. ఈ విధంగా ఉన్నత పక్షానికి సేవ కొనసాగుతూంటుంది. ఉచ్ఛస్థితిలో ఉన్నది ఏమీ అడగకుండానే అసంకల్పితంగా ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇది సహజాతి సహజంగా జరిగే ప్రాకృతిక ప్రామాణిక చర్య. ఆకాశమంత ఎత్తుకు పెరిగిన మహావృక్షాన్ని గమనించండి. దానికి పోషణ మొత్తం అడుగు భాగం నుంచే అందుతూంటుంది.

అదేరీతిన ఆధ్యాత్మిక మార్గాన నడిచి అత్యున్నత స్థితికి చేరిన మహానుభావులకూ వారి జీవనమైదానం అన్నివైపులా పల్లంగానే ఉంటుంది. అది ఎల్లప్పుడూ వారికి సానుకూలంగా నడుస్తుంది. ప్రకృతే వారి అవసరాలు గమనించి తీరుస్తుంది.

అవతార పురుషులూ జీవితాన్ని గంభీరమైనదిగా, భారమైనదిగా తలంచరు. ఓ సందేశం ఇచ్చి వెళదామన్నట్లుగా వస్తారు. జీవితం వారి దృష్టిలో ఓ నాటకం. అందులో వారి జన్మను ఒక పాత్రగా భావిస్తారు. జీవితంలో కష్టాలు కడగండ్లు ఎన్ని బాధించినా నిరాశా నిస్పృహలకు లోనుకారు. జీవితంపై విరక్తి చెందరు.

శ్రీరాముడికి దాదాపు జీవితం పొడుగునా కష్టాలే. అయినా ధర్మం తప్పలేదు. జీవన సమతుల్యతలో తేడా రానీయలేదు. పద్నాలుగేళ్ల వనవాసాన్ని ఆనందంగా స్వీకరించాడు. సీతా వియోగంతో మనోవేదన అనుభవించాడు. జీవితకాలంపాటు వేచి చూసిన ‘శబరి’ భక్తి విశ్వాసం అంతటి శ్రీరాముణ్ని ఆలోచింపజేసింది. అత్యంత బలవంతుడైన హనుమంతుడు తనకుతానుగా తారసపడటం, సీతమ్మ తల్లి జాడ తెలపడం శ్రీరామచంద్రుణ్ని మరింత ముందుకు నడిపాయి. వారధి నిర్మాణ సమయాన సముద్రుడు శాంతించడం, సంజీవని మూలికలు తమ్ముడు లక్ష్మణుడి ప్రాణాలు కాపాడటం- ప్రకృతి అనుకూలించడమే. వారధి కట్టేందుకు వానరసైన్యం స్వచ్ఛందంగా ముందుకు రావడం, ఉడుతసైతం చిన్నచిన్న రాళ్లు మొయ్యడం, ప్రతిపక్షంలోని విభీషణుడూ శ్రీరాముడి చెంతకు చేరడం... అనే ప్రక్రియల్ని బట్టి చరాచర జగత్తులోని చైతన్య స్రవంతి ధర్మంవైపే మొగ్గుచూపుతుందని తేటతెల్లమవుతోంది.

- మునిమడుగుల రాజారావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న