అణువణువూ అపర శివం

అంతర్యామి

అణువణువూ అపర శివం

లోకంలో దేని విలువ దానిది. పువ్వు విలువ పువ్వుది. ముల్లు విలువ ముల్లుది. పర్వతం విలువ పర్వతానిది. గులక రాయి విలువ గులక రాయిది. పువ్వుల్లో రాణి అయినా ముల్లుతో సహజీవనం ఏమిటని గులాబీ పువ్వు ముల్లుతో గొంతు కోసుకుని మరణించదు. పర్వతం ముందు తానెంత అని గులకరాయి పర్వతం కిందకు దొర్లిపోయి పగిలిపోదు. చూర్ణం కాదు. దేని విలువ దానిది. పరిమాణంతో, పనితనంతో సంబంధం లేదు. ఉప్పుగల్లు  చిన్నది. పెద్ద గిన్నెడు పులుసును రుచిరం చేస్తుంది. అదే సమయంలో కడివెడు పాలను విరిచేస్తుంది.  చుక్క విషం ప్రాణాలను హరిస్తుంది. అదే చుక్క విషం ప్రాణాలను నిలిపే ఔషధంగా అమృతతుల్యంగా మారుతుంది. లోకంలో ఏ వస్తువుకైనా బహుముఖ ప్రజ్ఞ ఉంటుంది. బహుళ ప్రయోజనాలు ఉంటాయి.  అణువు... కొలతకు కూడా అందనంత సూక్ష్మమైంది. దాని విస్ఫోటాన్ని ఎవరు అంచనా వేయగలరు? ఆకాశం అంతులేనిది. దాని ఘనరాశిని తూచగలమా? ఎవరూ తూచలేరు.

మన విలువ మనం గ్రహించడమే కాదు. ఇతరుల, ఇతరాల విలువను కూడా గ్రహించాలి. ఏదీ అల్పం కాదు. ఏదీ అప్రయోజనకారి కాదు. ఈ జీవితం, ఈ ప్రపంచం సర్వ రుచిర సమ్మేళనం. షడ్రుచుల సమ్మిళితం. సర్వవర్ణ శోభితం. ప్రతి వస్తువులో సర్వ శ్రేయోదాయకకారి అయిన మూలకం ఉంది. ప్రతి మనిషిలో సర్వ విభావనకారి అయిన కీలకం ఉంది. అందువల్ల దేన్నీ అవత రింపజేసే శక్తి మనకు లేదు. అందువల్లే దేన్నీ అంతరింపజేసే శక్తి మనకు లేదు. ఉండదు. అధికారం అంతకంటే లేదు.

దేన్నీ సృష్టించే అర్హత లేనప్పుడు నాశనం చేసే అధికారం మాత్రం ఎక్కడిది... తననైనా, ఇతరులనైనా. పువ్వు చాలా కష్టపడి ఎదుగుతుంది. ఇష్టపడి అవసరమైన వనరులు సమకూర్చుకొంటుంది... రంగులు, రుచులు, తావులు, తేనెలు, పుప్పొడులు, పళ్లు... దాని ప్రయోజనమేమిటో దానికి తెలుసు. అవకాశం ఉందికదా అని, అడ్డంలేదు కదా అని దాన్ని మొగ్గలోనే ఛిద్రం చేయకూడదు. ఎదిగే దాని ఉత్సాహానికి ఉరి వేయకూడదు.  ఈ లోకంలో ప్రతిదానికీ ఎదిగే క్రమం ఉంది. పరిణమించే పనితనం ఉంది. దుర్వినియోగం చేసే దుర్మార్గం లేదు. దేన్నీ దురాక్రమణ చేసే దురుద్దేశం లేదు. అవసరం ఉన్నంత మేరకు, అవకాశం ఉన్నంత మేరకు స్వయంగా వనరులు సమకూర్చుకొంటుంది. జీవితకాల సంతోషాన్ని సమర్పిస్తుంది. ఒక చెట్టు మరణిస్తూ కూడా  మరోసారి, చివరిసారి తన సహాయ కార్యక్రమాన్ని, సమర్పణా భావాన్ని ఈ ప్రపంచానికి అందిస్తూనే కాలిపోతుంది. కాలి బూడిదైపోయినా ఆ భస్మాన్ని కూడా ప్రపంచ ప్రయోజనానికే వదిలిపోతుంది. ఏమీ మిగలని ఆ భస్మం, ఆ విభూతి లోకానికాదర్శం. లోకానికే కాదు. మానవ జన్మకే  ఆదర్శం. చివరికి ఏమీ కాని మనం, ఏమీ మిగలని మనం శివమైపోయే అవకాశాన్ని, అదృష్టాన్ని ఆ భగవంతుడు మనకిస్తే- మనం జీవితమంతా మాలిన్యాల బరువులను తగిలించుకొంటూ మరణంలోనూ వాటి తాలూకు శేషాలను, శ్లేష్మాలను మోస్తూ మరో జన్మకు బదిలీ చేసుకుంటూ, వాటి తాలుకు దస్త్రాలు, రసీదులు భద్రం చేసుకుంటూ... కేవలం శవంగా మాత్రమే మిగిలిపోతున్నాం!

ఏమిటీ అజ్ఞానం! ఎందుకీ అవిద్య! నిజానికి జీవితం లేదా జన్మ అంటే పాత మోతలను వదిలించుకోవడమే. వదిలించుకునేందుకే. ఆ స్పృహ వదిలేసి కొత్త బరువులను తలకెత్తుకోవడం ఎందుకు?!

- చక్కిలం విజయలక్ష్మి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న