సంకల్పబలం

అంతర్యామి

సంకల్పబలం

లౌకిక జీవితాలను శాసించేది దైవసంకల్పమని మనుషుల సర్వసాధారణ భావన. దైవేచ్ఛ ఎదిరించలేనిదన్న దృఢ నమ్మకంతో ఊహాతీతమైన అది తనకు అనుకూలమా, ప్రతికూలమా అని మనసును వేధించే ఆలోచనలతో, మనిషి సమస్యల వలయంలోకి జారుకుని బయటపడలేడు. దైవసంకల్పం ప్రతికూలమైతే కష్టాలు తప్ప సుఖాలు శూన్యమనుకుంటాడు. అసహనం, ఆందోళనల మధ్య జీవిస్తాడు. జీవితంలో ఎదురయ్యే సంఘటనలను, కలిగే అనుభవాలను అదృష్ట దురదృష్టాలుగా తానే విభజించుకుంటాడు. అన్నింటికీ భగవంతుణ్ని, విధిని బాధ్యులు చేస్తాడు.

సమస్యలనేవేవీ భగవంతుడి సృష్టిలోనివి కావు. ఆయన సృష్టిలో సమస్యలుండవు. గీతలోని కర్మయోగం- కోరికల స్వభావం ఆత్మజ్ఞాన సాధనలతోకాని అర్థంకాని విషయమంటుంది. సుఖదుఃఖాల్లో సంయమనంతో వ్యవహరించడమెలాగో అది మాత్రమే భగవంతుడు కర్మయోగంలో చెబుతాడు. భగవత్సంకల్పం, విధి నిర్ణయాలనే విషయాల్ని ప్రస్తావించడు. మనిషిని రాగద్వేషాలకు అతీతంగా జీవించమంటాడు. భగవంతుడిపై శ్రద్ధ వహిస్తూ, నిరాపేక్షతతో నిరీక్షించినవారెవరైనా తనకు ప్రీతిపాత్రులేనంటాడు. మనిషి ఎదుగుదలకైనా అధోగతికైనా అతడి కర్మాచరణలే కారణమని, దైవాన్నీ విధినీ బాధ్యులు చేయనవసరంలేదని స్పష్టం చేసే భగవత్‌ ఉవాచలు కర్మయోగమంతటా వినిపిస్తాయి.

అంతులేని కోరికలు కలిగి ఉండటం- మనుషుల స్వాభావిక లక్షణం. అతడి కోరికలన్నీ తీరేవి కావు. అలాగని తెలిసినా, అవి తీరడానికి అతడు చేయని ప్రయత్నమంటూ ఉండదు. కొన్నింటినైనా అతడు సిద్ధింపజేసుకోగల సంకల్పశక్తినైతే మాత్రం భగవంతుడు అతడికిచ్చాడు. మనుషులందరిలో కనపడని, అంతర్గతమై వారిలో ఉండే అరుదైన ఆసక్తి దేహబలాన్ని మించినది. అది ఉపయోగపడినప్పుడు అసాధ్యమనే ఆలోచనలు మనిషిని బాధించవు.

మృత్యుముఖంలోకి అడుగుపెట్టిన మార్కండేయుడు సంకల్పశక్తితో దైవాన్ని మెప్పించాడు. యమపాశాలు విప్పుకోగలిగాడు. చిరంజీవిగా నిలిచాడు. సడలని సంకల్పంతో సాధ్వి సావిత్రి యముడిని ఒప్పించి భర్తను పునరుజ్జీవుణ్ని చేసుకుంది. తన పూర్వీకులందరికీ పుణ్యలోక ప్రాప్తి కలిగించాలన్న భగీరథుడి సంకల్పం అతడితో పట్టువీడని ప్రయత్నాలు చేయించింది. సంకల్పబలం ఉన్నవారికి భగవంతుడి సహకారమెప్పుడూ ఉంటుందని చెప్పే గాథలు ప్రామాణిక పురాణ గ్రంథాలన్నింటా కనిపిస్తాయి.
లక్ష్యముంటేనే సరిపోదని, వజ్రసంకల్పం ఉన్నప్పుడే మనిషికది చేరువలో ఉంటుందని, యువతకు తానిచ్చిన అన్ని సందేశాల్లో వివేకానంద ప్రస్తావించేవారు. అహింస, శాంతి, సత్యాగ్రహాలు సాధనాలుగా దేశానికి స్వాతంత్య్రం సాధించగలనని సంకల్పించిన గాంధీ మహాత్ముడు, రవి అస్తమించని ఆంగ్లేయ సామ్రాజ్యాన్ని కదిలించడానికి, మారుతున్న ప్రపంచంలో అవి నిరుపయోగమని ఎందరు నిరుత్సాహపరచినా- తన సంకల్పం మార్చుకోలేదు.

పడిన ప్రతి కష్టం మనిషికి ఒక సుఖాన్ని అందిస్తుంది. అది జీవన సత్యం. సంకల్పబలం లేని మనుషుల్లో అది మరుగునపడి ఉంటుంది. పరిష్కారం లేని సమస్యలు ఉండవని, పరిష్కారాలను ఉన్నచోటనే వెదకలేకపోవడం మనుషుల నిజమైన సమస్యగా మానసిక విశ్లేషకులు చెబుతారు.

సంకల్పబలముంటే మనిషి జీవితం అందమైనదని గుర్తించి ప్రేమించడం నేర్చుకుంటాడు. భౌతిక జీవనంలో ఉన్నదంతా దైవత్వమేనని, సారూప్య ముక్తి సాధించుకునేందుకు, జీవనదిలాంటి జీవిత ప్రవాహంతో కొనసాగాలనే సంకల్పం బలపరుచుకుంటూ, దానితోపాటు కొనసాగుతాడు.

- జొన్నలగడ్డ నారాయణమూర్తి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న