పరిపూర్ణ జీవితం

అంతర్యామి

పరిపూర్ణ జీవితం

మానవ జీవితం విశిష్టమైంది. పవిత్రమైంది. ఎన్నో లక్షల జీవరాశులలో మానవ శరీరం అత్యున్నత ప్రమాణాలు కలదిగా చెబుతారు. సృష్టిలోనే ప్రత్యేకత సంతరించుకున్న మనిషి జీవితం పరిపూర్ణత సాధించాలంటే ఎంతో తపన కావాలి. తపనే తపస్సు.
బుద్ధిజీవి మానవుడు తన మేధాశక్తితో ఎన్నో అద్భుతాలు సృష్టించగలడు. సృష్టికి ప్రతిసృష్టి చేయగలడు. నూతన విశ్వాంతరాళాలను కనిపెట్టగల చతురుడు. పాతాళం నుంచి అంతరిక్షానికి ప్రయాణించగల ప్రతిభావంతుడు. మనిషి ఎక్కడికైనా వెళ్ళగలడు, చూడగలడు. కానీ తనలోకి వెళ్ళే ప్రయత్నంలో విఫలం అవుతున్నాడు. అంతరంగాన్ని అర్థం చేసుకోవడంలో వెనకడుగు పడుతున్నది. నీవెవరో నీవు గ్రహిస్తే అదే నీ పరిపూర్ణ జీవితానికి నాంది అని పెద్దలు పేర్కొంటారు. ఆకార మానవుడి స్థాయి నుంచి పరిపూర్ణ మహోన్నత స్థాయికి చేర్చడమే ఆధ్యాత్మిక మార్గ లక్ష్యం. అత్యున్నత స్థాయి ఒక్కసారిగా అందేది కాదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి. ప్రతిరోజు, ప్రతిక్షణం, నిరంతరం కృషి చేస్తూ గడిచిన క్షణం కన్నా వచ్చే క్షణం మెరుగ్గా ఉండేట్లు మలచుకోవాలి.

పతంజలి యోగశాస్త్రం మనిషి తనకుతానే నియంత్రణతో జీవించే మార్గాలను చెప్పింది. చిత్తశుద్ధి, ఏకాగ్రత, సమదర్శనం, విశ్వాసం, నిగ్రహశక్తి, ఇచ్ఛాశక్తి, ఆలోచనలపై అదుపు విధానాలను బోధించింది.

ధర్మరాజుకు యక్షుడికి జరిగిన సంభాషణలో ‘గాలికన్నా వేగంగా ప్రయాణించేది ఏది’ అని ప్రశ్నించాడు. ‘మానవుడి మనసు’ అన్నది ధర్మరాజు సమాధానం. ‘మనసులో ఆలోచనల సంఖ్య ఎంత’ అన్న ప్రశ్నకు ‘ప్రపంచంలోని అన్ని గడ్డిపోచలను దగ్గరికి చేర్చినా వాటికన్నా అధిక సంఖ్యలో ఉండేవి మానవుడి ఆలోచనలు’ అని సమాధానం చెప్పాడు. ఆలోచనలపై అదుపు, మనసు నిగ్రహం విజయానికి మూలసూత్రాలుగా భారతం వర్ణించింది.

అందివచ్చిన అధికారాన్ని, సుఖాలను వదిలి ధర్మబద్ధంగా ప్రవర్తించి శాశ్వతకీర్తిని సాధించాడు భరతుడు. తల్లికైక కోరికతో అయోధ్యా నగరానికి చక్రవర్తి కాగలడు. అశాశ్వతమైన సంపదకన్నా ధర్మమార్గమే శరణ్యంగా శ్రీరామ పాదుకలకు పట్టాభిషేకం చేసి, తనకు తాను రుషిగా మారి, జీవన విధానాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకున్నాడు. అధికారం కన్నా ఆదర్శ జీవితం గొప్పదని నిరూపించాడు.

ప్రకృతిలో గ్రహాలు, పర్వతాలు, వృక్షాలు, రుతువులు ఒక క్రమపద్ధతిని అనుసరిస్తాయి. యమ, నియమాలను (నిబంధనలను) ఆచరిస్తాయి. మనిషీ ప్రకృతిని అనుకరించి జీవిత మార్గాన్ని పరిపూర్ణంగా మలచుకోవచ్చు.

క్రమశిక్షణ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఆంజనేయుడు. పనిపై విశ్వాసం, శ్రీరాముడిపై భక్తి కలిగి- దుర్బలమైన మనసును అదుపులో ఉంచి సాగర లంఘనం చేసి క్లిష్టతరమైన కార్యాన్ని సాధించాడు. సముద్రం దాటే సమయంలో ఆతిథ్యం ఇచ్చిన మైనాకుణ్ని సంతోషపరచాడు. ఆకర్షణకు లోనుకాలేదు. సురస పరీక్షను తెలివితో గెలిచాడు. ఛాయాగ్రాహిని శక్తితో జయించాడు. సువర్ణలంకలోని ఐశ్వర్యం, అందచందాలు, భౌతిక ఆకర్షణలకు మనసు చెదరలేదు.

అభ్యున్నతిలో పురోగతి కావాలంటే నియమబద్ధ జీవితం ముఖ్యమని శ్రీరమణులు బోధించారు. ‘నిధి చాల సుఖమా రాముడి సన్నిధి సుఖమా’ అని కీర్తించి త్యాగయ్య విచక్షణా భక్తితో మనో నిగ్రహాన్ని ప్రకటించాడు. శరభోజి మహారాజు అనేక విలువైన కానుకలు పంపి రాజాస్థానానికి ఆహ్వానించినా ప్రలోభానికి లోనుకాలేదు. రాజులలోకెల్ల అత్యుత్తమ రాజు త్యాగరాజుగా కీర్తిపొందాడు.

- రావులపాటి వెంకటరామారావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న