స్వరార్చన

అంతర్యామి

స్వరార్చన

గవంతుడికి చేరువ చేసే భక్తిమార్గాల్లో ‘కీర్తనం’ ఒకటి. షోడశ ఉపచారాలు ఆచరించలేకపోయినా భక్తితో మధురమైన కీర్తనలనే మాలలుగా కూర్చి భగవంతుణ్ని అర్చించి ధన్యులైన వాగ్గేయకారులెందరో ఉన్నారు. ‘నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువడేని’ అని పోతన అన్నాడు.

త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్‌, శ్యామశాస్త్రులను సంగీతత్రయంగా పిలుస్తారు. వీరే కాకుండా ఇంకా ఎందరో భక్తితో సంకీర్తనలను రచించి భగవంతుణ్ని కీర్తించారు. వాక్కును గేయ రూపంలోకి మార్చి భక్తి పూర్వకమైన స్వరార్చన చేసి ధన్యతనొందారు. వారిని ‘వాగ్గేయకారులు’ అని వ్యవహరిస్తారు.

రాధామాధవుల మధ్య ఉన్న అలౌకిక ప్రేమతత్వాన్ని గీత గోవిందం అనే కావ్యంగా పన్నెండు సర్గల్లో, ఇరవై నాలుగు అష్టపదులతో రచించాడు జయదేవుడు. ఒక్కొక్క ప్రబంధంలో ఎనిమిది ద్విపదలు ఉంటాయి. వీటినే అష్టపదులు అంటారు. జీవాత్మ నాయకిగా, పరమాత్మను నాయకుడిగా భావిస్తూ సాగుతాయి ఈ అష్టపది కీర్తనలు. ఇవి మధురభక్తికి నిదర్శనం.

‘గీత గోవిందం’ రచించినా తృప్తిచెందని జయదేవుడు మరుజన్మలో నారాయణతీర్థులుగా జన్మించి ‘కృష్ణలీలా తరంగిణి’ రూపంలో కీర్తనలు, ఇంకా భక్తిదాహం తీరక మరో జన్మ ఎత్తి క్షేత్రయ్యగా పుట్టి మువ్వగోపాల పదాలను రచించాడని పెద్దలు అంటారు. ముగ్గురి కీర్తనలలోని భావాలకు సామ్యత, సారూప్యత ఉంటాయి కాబట్టి ఇలా అని ఉంటారని విమర్శకుల మాట.

అద్వైత తత్వాన్ని కీర్తనలుగా మలచి భగవంతుడికి అర్పించిన మహాభక్తుడు సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి. ఆధ్యాత్మికోన్నతికి పరమ సోపానాలు ఆయన కీర్తనలు. పరమహంస ముద్రతో ఈ స్వర కుసుమాలు ప్రసిద్ధి పొందాయి.

వేదాంత గ్రంథాలు వేదాంతులకే పరిమితం. కానీ వేదాంతం సమ్మిళితమైన ఈయన కీర్తనలు, భజన కూటములు, గాయకుల మూలంగా సామాన్యుల నాలుకల పైకి చేరాయి. సగుణ నిర్గుణ బ్రహ్మగా ఈయన రాసిన కీర్తనలు ఆత్మజ్ఞానాన్ని, స్థితప్రజ్ఞుడైన పురుషుడికి ఉండవలసిన లక్షణాలను విశదపరుస్తాయి.

కేశవుణ్ని ధ్యానించినా, ‘మద శిఖిపింఛా అలంకృత చికురే’ అని బాలగోపాలుణ్ని వర్ణించినా మధురమైన రామనామాన్ని గ్రోలమంటూ ‘పిబరే రామరసం’ అని రామనామాన్ని సంకీర్తనామృత రూపంలో కీర్తించినా- సదాశివ బ్రహ్మేంద్రులు లోకానికి బ్రహ్మజ్ఞానాన్ని పంచిన ఆదర్శ యోగి.

మొదట వజ్రాల వ్యాపారిగా, తదుపరి విఠలుని అనుగ్రహంతో జ్ఞానాన్ని పొంది ‘విఠలా’ అనే ముద్రతో ఎన్నో కీర్తనలను గానం చేశాడు పురందరదాసు. అపార సాధనతో గాత్రం, సంగీతాన్ని సాధించిన సంకల్ప సిద్ధి ‘పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్‌’ది. రాగమాలికలను అద్భుతంగా రచించడంలో వీరిది అందెవేసిన చెయ్యి. ఇదే బాటలో నడిచినవారు మైసూర్‌ వాసుదేవాచార్య, ముత్తయ్య భాగవతార్‌, వీణ కుప్పయ్యలు. రాముడి పట్ల తన భక్తిని పాటల రూపంలో వ్యక్తం చేయడం వల్ల కంచర్ల గోపన్నను రామదాసు అని పిలుస్తారు. భక్తిభావ రాగ మాలికలతో వేంకటేశ్వరుణ్ని అర్చించిన అన్నమయ్య పదం, ముక్తికి దగ్గరి పథం.

వీరే కాకుండా ఎందరో వాగ్గేయకారులు స్వరార్చనలో తరించారు. ఉత్తరాదిన తమ భజనలతో మీరాబాయి, సూరదాసు, తులసీదాసు వంటి మహాభక్తులు తమ స్వర మాలలతో ఆ వాణి మెడను అలంకరించి ధన్యులయ్యారు.

- గంటి ఉషాబాల


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న