మానసిక జాగృతి

అంతర్యామి

మానసిక జాగృతి

జాగృతి మనిషి ఆధ్యాత్మిక జీవనానికి  ముఖ్యమైన అభ్యాసం. మనిషి తనను తాను దూరదర్శినిలానో, ప్రేక్షకుడిలానో వీక్షించుకోవాలి. ఇదే మనిషి తనను తాను జాగృత పరచుకోవడానికి ఉపకరించే మూలమంత్రం.

అందరూ బోధించే ఆధ్యాత్మిక మార్గాలన్నింటి లక్ష్యం ఒక్కటే. మనలోని సూక్ష్మదర్శినిని అప్రమత్తం చేయడం. దారి ఏదైనా పర్వాలేదు. అది గుడి కావచ్చు, మసీదు కావచ్చు, చర్చి కావచ్చు లేదా గురుద్వారా కావచ్చు. ధ్యానం, సత్సంగం, భజన, యోగ, తపస్సు... అన్నింటి అంతిమ లక్ష్యం జాగృతే. ఏ పద్ధతిని అనుసరించినా, దాన్ని ఎందుకు అనుసరిస్తున్నామో, ఆచరిస్తున్నామో అవగాహన ఉండాలి. ఎంపిక చేసుకున్న మార్గంలో ప్రయాణం మొదలుపెట్టాక, గమ్యం ఏమిటో తెలియకపోతే, జీవితాంతం గుడ్డెద్దు చేలో పడ్డ చందంగా అగమ్యంగానే మిగిలిపోతుంది.

జాగృతి పూర్తిగా అంతఃకరణకు సంబంధించినది. ఒత్తిడికి లొంగేది కాదు. శరీరానికి శ్రమ కలిగించి ఏ పనైనా చెయ్యవచ్చు. కానీ మనసు జాగృతం కానిదే, ఏ కార్యంలోనూ సాఫల్యం సాధించలేం. ముఖ్యంగా ఆధ్యాత్మికత అన్వేషణకు మనసు జాగృతం కావాల్సిందే.

జాగృతమైన మనసు అన్వేషణ వైపు అడుగులు వేస్తుంది. అన్వేషణ పూర్తిగా అంతర్గతమైనది. ఆడంబరాలకు, ఆర్భాటాలకు అతీతమైనది. ఈ సత్యం గ్రహించినవారిని ఆత్మాన్వేషణ ఉన్నస్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. దానికి రహదారి ఆధ్యాత్మికత అయితే, దిక్సూచి జాగృతి. ఆ అన్వేషణ కాలాతీతమైనది. జన్మలతో సంబంధం లేనిది. జన్మరాహిత్యం కలిగించి, భగవదైక్యం చెయ్యగలిగే ఏకైక సాధనం జాగృతి.

జీవం అంటే ప్రాణం, కదలిక, చలనం. సృష్టిలో ప్రాణమున్నదేదీ నిశ్చలంగా ఉండదు. ఉంటే అది జడం. సమస్త ప్రకృతిలో ఏదీ స్థిరంగా ఉండదు. మార్పు దాని లక్షణం. మార్పునకు ఆతిథ్యం ఇచ్చే వర్తమానం ఎల్లప్పుడూ నిత్యనూతనం. మానసికంగా జాగృతి పొందిన మనిషి నిరంతరం మార్పును అనుసరించగలుగుతాడు. దీనికి జాగరూకత ఎంతో అవసరం. ఎందుకంటే లిప్తపాటులో అది తిరిగిరాని గతంలో కలిసిపోతుంది.

మార్పును వీక్షించగలిగిన వ్యక్తులే మార్పును స్వీకరించగలుగుతారు. వారికి సాధనకు అడ్డుపడే అంశాలు గోచరమవుతాయి. అనుక్షణం త్యజించాల్సినది ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది.

తొలి అడుగు వేయాలి. దానితోనే నడక అలవాటవుతుంది. నడక నడతను నిర్దేశిస్తుంది. నడతలో వ్యక్తిత్వం  ప్రతిబింబిస్తుంది. వ్యక్తిత్వంతో నిరంతర జాగృతికి అలవాటు పడితే, మార్పుతో పయనం మొదలవుతుంది. జాగృతి లేకుండా జీవితంలో ఆనందం, ఉత్సాహం, సార్థకత, సాఫల్యం పొందడం అసాధ్యం. ఇవన్నీ అనిర్వచనీయాలు కావాలంటే, మీ మార్గాన్ని మీరే ఎంపిక చేసుకోవాలి. అనుకరణ, అనుసరణలు ఆధ్యాత్మిక ప్రవేశ ద్వారం వరకు తీసుకెళ్ళగలవు, కానీ- ప్రయాణం మీరే చేయాలి. అప్పుడే బంధవిముక్తి చేయగలిగే సూక్ష్మ మార్గం ద్యోతకమవుతుంది. మానసిక జాగృతి పొందిన వ్యక్తికి స్వార్థం ఉండదు. లోక కల్యాణం కోసమే వారి మాటలు, చేతలు ఉంటాయి.

సంపాదించిన జ్ఞానానికి జాగృతి సార్థకత చేకూరుస్తుంది. జాగృతి లేకపోతే మనకున్న జ్ఞానమంతా నిరర్థకం.

- ఎం.వెంకటేశ్వర రావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న