బంగారు బతుకమ్మ!

అంతర్యామి

బంగారు బతుకమ్మ!

మస్త జగత్తును రసార్ణవంగా, ఆహ్లాదభరితంగా, నిత్యనూతనంగా తీర్చిదిద్దడానికి భగవత్‌ ప్రేరణతో కుసుమాలు కనువిందు చేస్తున్నాయని ‘పుష్ప చింతామణి’ ప్రస్తావించింది. పుష్ప మూలంలో బ్రహ్మ, పుష్పం మధ్యలో విష్ణువు, పుష్పాగ్రంలో ఈశ్వరుడు విలసిల్లుతారని పద్మపురాణం ప్రకటించింది. దైవదత్తమైన పువ్వులతో నిత్య పూజావిధిని ఆచరించడం మన సంప్రదాయం. ఆ పుష్పరాశినే దేవతామూర్తిగా సంభావన చేస్తే- ఆ పూలదొంతర బతుకమ్మగా వర్ధిల్లుతుంది. ప్రకృతి శక్తిని పూలపుంతగా బతుకమ్మగా తెలంగాణ వ్యాప్తంగా మహాలయ అమావాస్య నుంచి తొమ్మిది రోజులపాటు ఆటపాటలతో ఆరాధిస్తారు.

వెదురు పళ్లెంలో గుమ్మడి ఆకుల్ని పరచి, వాటిపై పసుపు కుంకుమల్ని చల్లి, నవధాన్యాలు వేస్తారు. ముందుగా గుమ్మడి పువ్వుల్ని వర్తులాకృతిలో పేర్చి, వాటిపై తంగేడు, గునుగు, బీర, గన్నేరు, నిత్యమల్లె, సీతమ్మ జడ, రుద్రాక్ష, గోరింట, బంతి వంటి పుష్పాల్ని క్రమానుగతంగా ఒద్దికగా పేర్చుతారు. ఈ పువ్వుల దొంతర శీర్షభాగంలో గుమ్మడిపువ్వుపై జంట తమలపాకుల్ని ఉంచి, వాటిపై పసుపు గౌరమ్మను నెలకొల్పుతారు. మహిళలు లయాత్మకంగా అడుగులు వేస్తూ, కరతాళధ్వనులు చేస్తూ బతుకమ్మ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. బతుకమ్మ ఆవిర్భావం, గౌరీదేవి లీలలు, కుటుంబ అనుబంధాలు, పురాణగాథలు, సామాజిక జీవనరీతులు... ఇలా ఎన్నో అంశాలకు సంబంధించిన ఘట్టాల్ని పాటలుగా మగువలు ఆలపిస్తారు. ఆటపాటల అనంతరం పసుపుబొట్టు పేరిట స్త్రీలు ఒకరికొకరు తాంబూలాలు, వాయనాలు ఇచ్చిపుచ్చుకొంటారు. బతుకమ్మల్ని జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు.

ప్రాణశక్తి, ప్రాణేశ్వరి, ప్రాణధాత్రి అనే జగన్మాత నామధేయాలకు బతుకమ్మ ప్రతీక. లలితా త్రిశతి దివ్య జననిని ‘చైతన్య కుసుమప్రియ’గా అభివర్ణించింది. ఆ చైతన్యధాత్రి, మంగళ జనయిత్రి ప్రకృతి హృదయనేత్రి- బతుకమ్మ. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల సమష్టిరూపం- బతుకమ్మ. వైదిక సంప్రదాయంలో నవరాత్రుల్లో నిర్వహించే శ్రీ చక్రార్చనకు ప్రతిఫలనమే బతుకమ్మ వేడుక. మూడు, ఏడు, తొమ్మిది వరసల్లో పుష్పాల అమరికతో బతుకమ్మ కనువిందు చేస్తుంది. మూడు వరసలుగా పువ్వుల్ని పేరిస్తే ఆ రూపం ముగురమ్మలకు సూచిక. ఏడు వరసల్లో తీర్చిదిద్దితే సప్త మాతృకలకు ప్రతిబింబం. తొమ్మిది వరసలుగా కుసుమాలను అలంకరిస్తే ఆ స్వరూపం నవదుర్గలకు ప్రతిఫలనం.

బతుకమ్మ నేపథ్యంగా ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. మహిషాసురుడితో యుద్ధం చేసిన మహాశక్తి అలసిపోతే, ఆమెకు సేద తీర్చడానికి మహిళలు పాటలు పాడి కొత్త ఉత్సాహాన్ని అందించారు. ఆ నవ్యశక్తితో దుర్గమ్మ అసురుణ్ని అంతం చేసి, లోకానికి కొత్త బతుకును ప్రసాదించిందంటారు. ఏటేటా దుర్గమ్మను పూల పొత్తిళ్లలోకి ఆహ్వానించి ఆటపాటలతో ఆరాధిస్తున్నారు! దక్షయజ్ఞ సందర్భంలో అగ్నికి ఆహుతి అయిన సతీదేవికి ప్రతీకగా దేవతలు పసుపు గౌరమ్మను సృష్టించారు. ఆమె పసిడి ఛాయలో మెరిసి, సమస్త జీవకోటికి జాగృతిని అనుగ్రహించి విశ్వచైతన్య శక్తిగా సాకారమైందంటారు. ఆ గౌరమ్మ రూపాన్నే బతుకమ్మగా కొలుచుకుంటున్నారు! ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతనల కలబోత- బతుకమ్మ వేడుక!

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న