కష్టాలు - కన్నీళ్లు

అంతర్యామి

కష్టాలు - కన్నీళ్లు

నిషి జీవితంలో సుఖదుఃఖాలు కలిసే ఉంటాయి. జీవితమంతా దుఃఖమయమంటారు కొందరు. దుఃఖం సుఖానికి భూమికలాంటిది. పూలవద్ద ఉన్న ముళ్లు పూల రక్షణ కోసమే. దట్టమైన చీకట్లో దీపకాంతి లభించినట్లుగా ముందుగా కష్టాలను అనుభవించాకనే సుఖానుభవం పొందడం ఆనందకరమంటాడు భాసమహాకవి. మనిషికి కష్టాలు, దుఃఖభావనలు, అలసట, ఆందోళన లేకపోతే లౌకిక జీవితం నిస్సారమవుతుంది.

ఒక్కోసారి భరించరాని దుఃఖం మనిషిని ఆవరించవచ్చు. అటువంటి సందర్భంలో రెండు జరుగుతాయి. వేదనగల మనిషి మతిస్థిరం కోల్పోయి పిచ్చివాడవుతాడు. దృఢమైన వ్యక్తిత్వం గలవాడు దిక్కుతోచని దశలో ఏదో ఒక విషయం మీద బలంగా దృష్టి నిలుపుకొంటాడు. మనసును శోకం నుంచి మళ్ళించుకుంటాడు. అది అతడి కర్మపరిపాకం, సంస్కారం. అంతులేని దుఃఖంలో తాగుబోతులైనవాళ్లూ ఉన్నారు. అద్భుతమైన కావ్యాల్ని సృష్టించినవారూ ఉన్నారు. రెండింటికీ ప్రాతిపదిక వేదనే.

జీవితంలో అందరికీ కష్టాలు సహజం. ఇష్టం ఉన్నా లేకపోయినా వాటిని ఎదుర్కోక తప్పదు. కొందరు కష్టాల్ని భూతద్దంలో చూసి భయపడతారు. కొందరు ఇతరులకు కష్టాలు చూపించి భయపెడతారు. కొందరు కష్టాల్లో ఆనందాన్ని వెతుక్కుంటారు. ఇత రులకు వచ్చిన కష్టాలతో తమ కష్టాల్ని పోల్చి చూసుకొని మనసు తేలిక చేసుకుంటారు మరికొందరు.

కష్టాలకు చిహ్నం కన్నీరు. కష్టానికి కష్టానికి మధ్య ఆటవిడుపు కన్నీళ్లేనంటాడొక రచయిత. కష్టాలు, కన్నీళ్లు కలకాలం ఉండ వని విజ్ఞులు చెబుతారు. దుఃఖాన్ని ఉగ్గబట్టడం ఒక్కొక్కప్పుడు ప్రమా దమని పెద్దలు చెబుతారు. కరుడుగట్టిన దుఃఖపు శిలను బద్దలుకొట్టాలి. దాన్ని కరగనివ్వాలి. ఆప్తుల వియోగం వల్ల కొందరు విపరీతంగా దుఃఖిస్తారు. బిగ్గరగా రోదిస్తారు. అందరికీ శోకాన్ని నియంత్రించుకోగలిగే శక్తి ఉండదు. ఈతరం వారు అటువంటి ఏడుపుల్ని ఇబ్బందికరంగా భావిస్తారు. స్త్రీలు, గ్రామీణ ప్రజలు దుఃఖం ఆపుకోలేక ఏడుస్తారు. ఆ సమయంలో మనసారా ఏడవనివ్వాలి. ఆ తరవాతే ఓదార్పు మాటలు. కస్తూరిబా కన్నుమూసినప్పుడు మహాత్ముడి కంటివెంట ఒకే ఒక్క అశ్రుకణం రాలిందట. తన సహధర్మచారిణి తననుంచి సెలవు తీసుకున్నప్పుడు మనసు విచలితమైందనడానికి అది ఒక సంకేతం. అంతే. ఆయన దృష్టి మహోన్నతమైన ఉద్యమంవైపు లగ్నమైంది. వ్యక్తిగతమైన దుఃఖానికి గాంధీజీ మనసులో ఆమాత్రం చోటే ఉంది. యోగం, కర్తవ్యం, లక్ష్యశుద్ధి, ధర్మనిరతి కలగలిసిన స్థితప్రజ్ఞ అది.

కొందరికి గుండెల్లో రగిలిన అగ్ని పర్వతాలుంటాయి. ద్రౌపది ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. కృష్ణుణ్ని కౌరవసభకు దూతగా పంపిన సందర్భంలో ఆమె హృదయం బద్దలైంది. చిచ్చును ఒళ్లో మూటకట్టుకుని ఇన్నాళ్లూ సహించానంది. కుంతీదేవి కృష్ణ భగవానుడితో ‘స్వామీ! మళ్ళీ మళ్ళీ విపత్తులే కలిగేలా చెయ్యి, విపత్తుల్లోనే నిన్ను శరణు వేడుకుంటాం. నువ్వొక్కడివే దుఃఖాన్ని దూరం చేసేవాడివని విపత్తులు మాకు బోధించాయి. సుఖాల్లో ఉన్నవారిని నువ్వు పట్టించుకోవు... నీ సంపర్కం కలిగించే విపత్తులే మాకు సంపదలతో సమానం’ అంటుంది. బొమ్మలతో ఆడుకుంటున్న పిల్లవాణ్ని తల్లి పట్టించుకోదు. కడుపు నొప్పనో, కాలు నొప్పనో ఏడుస్తుంటే పరుగెత్తుకొస్తుంది.

దుఃఖంనుంచి పారిపోకూడదు. ఒక సవాలుగా స్వీకరించాలి. బంగారం శుద్ధం కావాలంటే నిప్పుల్లో పడాలి. వెదురును విరిస్తేనే వేణువవుతుంది. శిలను చెక్కితేనే దేవతామూర్తి ఉద్భవిస్తుంది.

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న