మనలోకి మనం...

అంతర్యామి

మనలోకి మనం...

పండితుల పలుకుల్లో క్లిష్టత ఉంటుంది.  ప్రవక్తల మాటల్లో స్పష్టత ఉంటుంది. ఒకానొక గాఢమైన జీవితానుభవంలోంచి దర్శనంలోంచి జాలువారే సూక్తులు మనిషిని వెంటాడతాయి. మనకేదో చెప్పబోతాయి. ఆ ఊసుల్ని వినేదాకా మనల్ని వదలనంటాయి. వాటిని ప్రవచనాలంటారు. జిబ్రాన్‌వి కవితామయ ప్రవచనాలు. ‘గాలి గడ్డిపరకలతో ఎంత స్నేహంగా సంభాషిస్తుందో, పెద్ద ఓక్‌ వృక్షాలనూ అదే విధంగా పలకరిస్తుంది’  అన్నాడు జిబ్రాన్‌. అదే నిజమైన ప్రవచనాల లక్షణం, లక్ష్యం. అసలైన ప్రవక్త తీరు- గీతాచార్యుడి ప్రవచనం మాదిరే ‘సమదర్శనం’గా సాగిపోతూ ఉంటుంది. అప్పుడే దాని లక్ష్యం నెరవేరుతుంది. వివేకవంతుడైన ఆధ్యాత్మిక ప్రవచనకర్త అపారమైన తన జ్ఞానసాగరంలో మనల్ని ముంచి ఉంచి ఉక్కిరిబిక్కిరి చేయడు. మనవైన నిర్మల హృదయ తటాకాల్లోకి నింపాదిగా మనల్ని ప్రవేశపెడతాడు. ఇదీ జిబ్రాన్‌ చెప్పిన మాటే. మనలోకి మనల్ని ప్రవేశపెట్టడం ఒక సద్గురువు స్వభావం. విశిష్టమైన ఆ ప్రక్రియలో ప్రయాణమంతా ఆనందమయమే. ఖలీల్‌ జిబ్రాన్‌ను లోతుగా అధ్యయనం చేసినవారంతా ఆ ఆనందాన్ని ఆస్వాదించిన భాగ్యవంతులే!

జిబ్రాన్‌ మాటలు వింటున్నప్పుడల్లా మనకు వేదాలో, ఉపనిషత్తులో లేదా మన పురాణ వాఙ్మయమో స్ఫురిస్తూ ఉంటే- దానిలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. సత్యం అనేది ఏ కాలంలోదైనా, ఏ భాషలోదైనా ఎల్లప్పుడూ ఒక్కటే. అది సమకాలీనమే కాదు, సర్వకాలీనం కూడా. దాంపత్యం గురించి ఆల్‌ ముస్తఫా ఏం చెప్పాడో వినండి- ‘మీరు కలిసి జన్మించారు, కలిసే ఉంటారు. మృత్యుమేఘాలు ఆవరించే ఘడియల్లోనూ మీరు కలిసే ఉంటారు’. ఇది విన్నప్పుడు మనకు వైదిక వివాహమంత్రాలు గుర్తొస్తే అందులో తప్పేమీ లేదు. ‘వీణ తంత్రులు వేరు కావచ్చు. కానీ వాటి నుంచి వెలువడే స్వరం ఒకటే కావాలి. శ్రుతి కలవాలి’ వంటి వాక్యాలు మనకు పరిచయమైనవాటిలాగే అనిపిస్తాయి. ఎందుకంటే సప్తపదిలో ‘సఖా సప్తపదాభవ... సాత్వంద్వౌః అహం పృథిÅవీ... నీవు నింగి, నేను నేల...’ వంటి పెళ్ళిమంత్రాలకు చెందిన ఒకానొక వైదిక సంస్కారం మన రక్తంలో ఇప్పటికే కలగలిసి ఉంది కనుక.

అలాగే, పిల్లల గురించి చెబుతూ ‘నీ సంతానం నీలో నుంచి వచ్చారు కానీ నీ నుంచి కాదు. వారి శరీరాలలో నీవు ఉండి ఉండవచ్చు.. కానీ ఆత్మల్లో కాదు’ అంటారు ముస్తఫా. వీటినీ మనం పలు రూపాల్లో వినే ఉంటాం. భాష వేరు కావచ్చు, భావం ఒకటే. ‘నీవొక నేత కార్మికుడివై చీర నేస్తుంటే, ఆ చీర నువ్వు నీ ప్రియురాలికి కానుకగా నేస్తున్నాననే ఆత్మీయ భావంతో మొదలుపెట్టు’ అనేది నేటి కార్పొరేట్‌ సంస్థల వ్యక్తిత్వ వికాస తరగతుల్లో పాఠంగా చెప్పదగిన మాట.

‘మతములన్నియు మాసిపోవును’ అని గురజాడ చెప్పిన మాట వినగానే ఎంతోమందికి గగుర్పాటు కలిగింది. అద్భుతం అనిపించింది. మాట్లాడటం మొదలుపెట్టారు. వక్తలుగానే కాక వ్యాఖ్యాతలుగానూ మారారు. కొద్దిమంది మాత్రం నిదానించారు. నిలిచి వెలిగే సత్యాన్ని గురించి ఆ మహాకవి చెప్పేదాకా ఓపిక పట్టారు. ఆయన చెప్పిన సత్యదర్శనం కోరి తపస్సులు చేశారు. జ్ఞానులుగా మారారు. మతాలకు అతీతమైన శాశ్వత సత్యాన్ని గుర్తించి తరించారు. అలా మతం కన్నా సత్యం చాలా విలువైనదని చప్పున గుర్తించిన తత్త్వవేత్తగా మనం చెప్పుకోదగిన మహాకవి- ఖలీల్‌ జిబ్రాన్‌. జిబ్రాన్‌ కూడా మాట్లాడాడు... ఎవరితో అంటే ఈశ్వరుడితో! ఆ సంవాదమే ‘ది ప్రాఫెట్‌’ గ్రంథం.

- ఎర్రాప్రగడ రామకృష్ణ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న