బాల్య సౌందర్యం

అంతర్యామి

బాల్య సౌందర్యం

ప్రతి ఒక్కరూ ఇష్టపడే విషయాల్లో సౌందర్యం ఒకటి. శారీరక, మానసిక ఔన్నత్యాన్నే సౌందర్యమని చెబుతారు లాక్షణికులు. మనసును రంజింపజేయడం దీని లక్షణం. బాల్య సౌందర్యం మరింతగా మనసును మురిపింపజేస్తుంది. అందుకే భాగవతంలో దీనికి చాలా ప్రాధాన్యమిచ్చారు కర్తలు. ఉదాత్తం, హృద్యం అని సౌందర్యం రెండు రకాలు. వాటిని విస్తృతంగా, ప్రత్యేకంగా వర్ణించడానికి చాలా కృషి చేశారు భాగవతకారులు.

హృద్య సౌందర్యానికి ఉదాహరణ చిన్ని కృష్ణుడి రూపం. ఆయన ప్రత్యంగ మనోహరత్వం ఏ ఇతర దేవతల్లో ఎంత వెదికినా కనిపించదు. భాగవతంలోనైనా, మరే ఇతర కృష్ణ సంబంధిత సాహిత్యంలోనైనా ఈ విషయం ప్రస్ఫుటమవుతుంది.
శైశవం, బాల్యం (రెండూ వేర్వేరు) అనగానే గుర్తు వచ్చే రూపం కృష్ణుడిదే. పద్మంలాంటి ముఖ సౌందర్యం, చిదిమితే పాలు కారుతాయా అన్న ట్టుండే బుగ్గలు, ఆ అమాయకమైన చూపులు, ఆ చిరునవ్వు సొగసు, మనసును చక్కిలిగింతలు పెట్టే చిలిపితనం... లాంటివన్నీ ఒక్క బాలకృష్ణుడిలోనే కనిపిస్తాయి. ఆ బాల్య సౌందర్య పిపాస లోకంలో ఎంతగా విస్తరిల్లిందంటే... నేటికీ ప్రతి తల్లీ తన బిడ్డడిని చిన్ని కృష్ణుడితోనే పోల్చుకుంటుంది. శైశవం (శిశు దశ) దాటి బాల్యంలోకి అడుగు పెడుతున్న సమయంలో ఆ బిడ్డకు కొద్దిగా పెరిగిన కేశాలను దగ్గరగా చేర్చి తలపైన ముడివేసి కృష్ణుడి జడ అని మురిసిపోతుంది. గడపలో, నడయాడే ప్రదేశంలో తమ బిడ్డల పాదాలను ఆసరాగా చేసుకుని చిన్ని కృష్ణుడి పాదముద్రల్లా చిత్రించి కృష్ణ పాదాలుగా పిలుచుకుని ముచ్చట తీర్చుకుంటారు. అవకాశం దొరికినప్పుడల్లా బిడ్డను బాల కృష్ణుడిలా అలంకరించి మురిసిపోతుంటారు. భాగవతంలో బాలకృష్ణుడు చేసిన చిలిపి దొంగపనులు చూసిన, భరిస్తున్న గోపికలు, అత్తాకోడళ్లు, ఇరుగు పొరుగు అమ్మలక్కలు అతణ్ని శిక్షించక పోవడానికి కారణం ఆ బాల్య సౌందర్యానికి ముగ్ధులు కాబట్టే. ఆయన చేసే అల్లరినీ ఆస్వాదించారు వారు.

దేవుణ్ని బిడ్డగా, అతడికి చేరువగా, ఆయనతో చనువుగా, ఆయన్ని సులువుగా చూసుకునే/ చేరుకునే అవకాశం బాల కృష్ణుడి రూపంలోనే వారికి సాధ్యమవుతుంది. మరే ఇతర దైవాలలోనూ ఇంత దగ్గరతనం కనిపించదు.
వామనుడిది ఉదాత్త సౌందర్యం. ఆయన సౌందర్యాన్ని పోతన వర్ణిస్తూ- అతడు బాల్య దశలో ఉన్న పరమ శివుడో, విష్ణువో, కుబేరుడో, అగ్నియో, సూర్యుడో అయి ఉంటాడన్నాడు. పై వారంతా తేజశ్శాలురు. సౌందర్యానికి ప్రతీకలే. కాకపోతే కాస్త స్థాయి ఎక్కువ. ఆ సౌందర్యాన్ని తట్టుకోవడం అందరి వల్లా కాదు. అందరూ ఆస్వాదించే సౌందర్యం ప్రత్యేకమైంది. అదే ఉదాత్త సౌందర్యం. అది వామనుడికి ఉందని వర్ణించాడు పోతన. వామనుడి బాల్య సౌందర్యం ఎంత గొప్పదంటే- ఆయన రూపాన్ని చూసి ముగ్ధురాలైన బలిచక్రవర్తి కుమార్తె (రత్నమాల) ఈ బాలుడికి స్తన్యమిచ్చే అదృష్టం తనకు కలిగితే బాగుణ్ను కదా! అని మనసులో కోరుకుందట.

తన కుమారుడిగా జన్మించిన బాలుణ్ని చూసిన అదితి మురిసిపోయి ‘నన్ను కన్న తండ్రీ! నా పాలిట దైవమా! నా తపః ఫలితమా! నా కులదీపకుడా నా భాగ్యరాశీ!’ అని బిడ్డడైన వామనుణ్ని ముద్దు చేస్తూ పిలిచేది. ఆ తల్లి పలికిన గారాల పిలుపులు నేటికీ ప్రతి తల్లి నోటంటా చిన్న మార్పులతో వెలువడుతూనే ఉంటాయి. ‘నా కన్నా! నా తండ్రీ! నా బంగారు కొండా! నా నోముల పంట!’ లాంటి పలకరింపులతో అమ్మలు గారాలు పోతుంటారు. బాల్యంలో అంత బలముంది. మధురిమ ఉంది!

- అయ్యగారి శ్రీనివాసరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న