అంతులేని రహస్యం

అంతర్యామి

అంతులేని రహస్యం

జ్ఞాని అని తీర్మానించిన వ్యక్తినీ తలకిందులు చేసి, ఈ విశాల విశ్వం అంతులేని రహస్యంగా మిగిలిపోతోంది. ఏమీ తెలియని అజ్ఞానికి సంవత్సరాల తరబడి తవ్వే పురాతన తవ్వకంలా ఉంటోంది. కొత్తకొత్త విషయాలు తెలియజేస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. అద్భుతమైన మార్మిక పౌరాణిక గాథలా గొప్ప విస్మయం కలిగిస్తోంది. అంతులేకుండా, ఆగకుండా ఈ చక్రం తిరుగుతూనే ఉంది... మనిషి మేధకు పరీక్ష పెడుతూనే ఉంది.

ఇటువంటి ఒక రసవత్తరమైన ఆట కల్పించి మనిషిని ఖాళీగా ఉంచకుండా చూడాలనుకున్నాడేమో భగవంతుడు. అప్పుడే నవ్విస్తాడు. అప్పుడే ఏడిపిస్తాడు. మరుక్షణమే మరుభూమి దృశ్యాల్లో ముంచి హృదయాన్ని శోకసముద్రం చేస్తాడు.

నేనే భగవంతుడినైతే ఈ ప్రపంచాన్ని ఇంత రాక్షసంగా సృష్టించకపోదును అంటారు స్వామి వివేకానంద. గులాబీల తోటలా కనిపించినా కింద ముళ్లు ఉంటాయి. నీలి సముద్రంలా అందంగా కనిపించినా అందులో తిమింగిలాలు ఉంటాయి. పైకి కనిపించే పచ్చదనాన్ని పట్టుకుని వేలాడే చీడపురుగులూ ఉంటాయి. జగత్తు పరిమళించే పూలు నిండిన ఆహ్వానపు గుత్తి కాదు. వాస్తవాలు దాచేస్తే దాగవు. ఇది ప్రతికూల ఆలోచనా వైఖరి కాదు. బతకాలంటే యుద్ధం తప్పదు. అస్త్రం, శాస్త్రం ఉండాలి. ఆలోచన, తెలివితేటలు ఉండాలి. అవగాహన ఉన్నవాడికి ఈ లోకం గోడ మీద గీసిన బొమ్మపులి. లేనివాడికి ఎదురొస్తున్న గాండ్రించే భయంకరమైన పులి. భయం, భీతి లేనివాడే చివరకు విజయం సాధిస్తాడు.

ఎప్పటినుంచో ఎవరినీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది ఈ ప్రపంచం. అందులో మనిషి ఉనికి చాలా చిన్నది. అయినా మనిషి వదలడు. అది అతడి నైజం. వదిలిపెట్టడానికి అతడు ఈ భూమ్మీదకు రాలేదు. ఆ అంతులేని రహస్యమేదో తేల్చుకోవాలని, కిందపడినా లేస్తున్నాడు. వెయ్యి పోరాటాలైనా చేస్తున్నాడు. మనిషి ప్రతిభావంతుడనే, తన రహస్య ప్రణళికను అమలు చేయడానికి సర్వ జీవుల్లో అతడిని ఎంచుకున్నాడు భగవంతుడు. అతడి శరీరంలో తిష్ఠ వేసుకుని కూర్చున్నాడు. దారి చూపుతున్నాడు. కానీ, రకరకాల ఆకర్షణలకు లొంగిపోయి పక్కదారులు పడుతున్నాడు మనిషి. లక్ష్యం చేరుకోవడానికి కాలయాపన చేస్తున్నాడు.

ఈ గమ్మత్తయిన ఆటలో చిట్టచివరకు మనిషిని ప్రేమతో గెలిపిస్తున్నాడు భగవంతుడు- అర్జునుణ్ని యుద్ధంవైపు నడిపించిన శ్రీకృష్ణుడిలా. ఎవరి ఆట వాళ్లు హాయిగా ఆడుకునే అవకాశం ఇచ్చింది ప్రపంచం. సత్యం కొందరిని మాటరాని మూగవాళ్లుగా మారుస్తుంది. అందుకే వారు మౌనం వహిస్తారు. కొందరిని అసత్యాన్ని ఎదిరించే మహావీరులుగా తయారుచేస్తుంది. జీవన సత్యాన్ని తెలుసుకోవడమే అంతులేని రహస్య ఛేదనం. ప్రపంచాన్ని మరింత పటిష్ఠంగా, శక్తిమంతంగా, దివ్యంగా నిర్మించుకుంటాడు నరుడు. పరమాత్మ కోరుకునేదీ అదే. బిడ్డ ఎదుగుదల తండ్రికి సంతోషమే కదా!

ఎట్టి పరిస్థితుల్లోనూ దైవాన్ని అనుమానించకూడదు. ఆయన అనుభూతిలోకి రావాలంటే ప్రేమ తప్ప మరో మార్గం లేదు. ప్రకృతి ముసుగులో అంతులేని విశ్వంగా కనిపించే ఈ మహా భువన భవనం ఈశ్వరుడి నివాసమే. ఇందులోని చిత్ర విచిత్రాలతో ఆటలాడుకునే బాలుడు మానవుడు. మనిషి కోసం ప్రతి నిమిషం ఎన్నో పదబంధ ప్రహేళికలతో, గళ్ల నుడికట్లతో, ఇంద్రజాల మహేంద్రజాల విద్యలతో, టక్కుటమార, యంత్ర, తంత్ర, మంత్ర మాయలతో దైవం మనిషి చూపును ఏమారుస్తూనే ఉన్నాడు. సత్యం తెలుసుకోవాలనుకునే వివేకి అటువైపు కన్నెత్తి అయినా చూడడు. ఇదే రహస్యాల్లోకెల్లా రహస్యం. అంతులేని రహస్యం.

- ఆనందసాయి స్వామి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న