వెల కట్టలేని ఆభరణం

అంతర్యామి

వెల కట్టలేని ఆభరణం

నం మరో మనిషితో కరచాలనానికి చేతులు చాపడాని కన్నా, పెదవి విప్పి మాట్లాడటానికన్నా ముందు- మన ముఖంలోని చిరునవ్వు పలకరిస్తుంది. కాబోయే పనిని తేలిక చేస్తుంది. మాటలతో సాధించలేనిది చిరునవ్వుతో సాధించవచ్చు అంటారు అనుభవజ్ఞులు. చిరునవ్వు సహజ ఆభరణం. ఇళ్లల్లోని గోడలకు వేళ్లాడదీసిన ఫొటోలు, కూడళ్లలోని నాయకుల విగ్రహాలు నవ్వు ముఖాలతోనే నిత్యస్ఫూర్తిని కలిగిస్తాయి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నప్పుడు, చిత్రంలో చిరునవ్వుతో నిలుచున్న సత్యదేవుణ్ని చూస్తూ అయిదు కథలు వింటుంటే మనసు ఆధ్యాత్మికానుభూతితో పరవశించిపోతుంది. రామాయణం చదువుతున్నప్పుడు రాముడు, భాగవతం వింటున్నప్పుడు కృష్ణుడు మన మనోవీధుల్లో చిరునవ్వులతోనే సంచరిస్తారు.

మనుషులందరూ పసితనాన్ని ఇష్టపడటానికి కారణం కల్లాకపటం తెలియని స్వచ్ఛమైన మనసులు, వారి లేత ముఖాల్లో ప్రతిఫలించే చిరునవ్వులు. ఇవే నవ్వులు జీవిత కాల అనుభవసారాన్ని గ్రహించి తలపండినవారి ముఖాల్లోనూ కని పిస్తాయి. ముఖాన చిరునవ్వును ధరించడానికి మనమేం శ్రమించ నక్కర్లేదు. డబ్బు ఖర్చు చేయన క్కర్లేదు. విరిసీవిరియని పూరేకుల్లా పెదాలను కాస్త విప్పారిస్తే సరి. మన చిరునవ్వే బలమైన ఆయు ధమై ప్రత్యర్థిని బలహీనుణ్ని చేస్తుంది. మనిషి జీవితంలో సుఖం దుఃఖం పడుగుపేకల్లాంటివి. ఏ ఒక్కటీ మనలను ఎల్లకాలం అంటి పెట్టుకుని ఉండదు. సమస్యల కారుమబ్బు వీడినా, కొంతమంది విషాద ఛాయలను మనసు నుంచి తొలగించుకోలేరు. కనిపించిన వారికల్లా తమ గోడు వినిపిస్తుంటారు. అనుక్షణం అదే ఆలోచనతో వర్తమానంలో దక్కిన ఆనందాన్ని అనుభూతించలేరు. మరికొంతమంది ఎంత తీవ్రమైన కష్టాల్లో ఉన్నా ముఖాన చిరునవ్వు చెదరనివ్వరు. వారి గురించి మనకు మరొకరు చెప్పినా, లేదా కొంతకాలానికి మనకై మనం గ్రహించినా వారి చిరునవ్వు వెనకాల గూడు కట్టుకుని ఉన్న బాధ ఆశ్చర్యం కలిగిస్తుంది. వాళ్ల ఆత్మ స్థైర్యం, గుండెబలం నివ్వెరపరుస్తాయి. శాంతికి పర్యాయపదంగా నిలిచేవి ధవళవర్ణ కపోతం, బుద్ధుడి చిరునవ్వు. చిరునవ్వుతో కూడిన రాయబారి సంధి ప్రయత్నాలు ఎంతటి యుద్ధాలనైనా నివారించగలవు. రాఖీ కట్టిన చెల్లి, కట్టించుకున్న అన్న ముఖాల్లోని ఆనందం మహార్ణవం. చూడటానికి రెండు కళ్లు చాలవు.

ఆంధ్రమహాభారతంలో తిక్కన ముప్పై రెండు రకాల నవ్వులను ఉదాహరించాడు. ఏ నవ్వయినా, ఎలాంటి నవ్వయినా మొదట చిరునవ్వుతోనే మొదలవుతుంది. చిరునవ్వుతో సంభాషించడం వ్యక్తిత్వ వికాసంలోని ఒక కళ. అందాన్ని ఇనుమడింపజేసే ఆభరణం చిరునవ్వు అంటుంది సౌందర్య శాస్త్రం. నవ్వు రుగ్మతల్ని దూరం చేసి మరో ఏడేళ్ల ఆయుష్షును పెంచుతుందంటారు శాస్త్రవేత్తలు. నవ్వుతూ నిద్రలేచి నవ్వుతూ నిద్రకు ఉపక్రమించే వ్యక్తి కన్నా అదృష్టవంతుడు మరొకడు ఉండడు. నిర్మల నిశ్చల తటాకంలాంటి మానసిక స్థితి కలిగిన వారికే అది సాధ్యం. కృతకంగా కనిపించే పొడి నవ్వుల కన్నా పెదాలపై జీవం పోసుకునే నవ్వులే మానవ సంబంధాలను గట్టిపరుస్తాయి. నవ్వు అసంకల్పితం కారాదు. కొన్ని చోట్ల నవ్వలేం. అసందర్భంగా ఉంటుంది. మనసు విప్పి మనస్ఫూర్తిగా నవ్వే సందర్భాలు మరికొన్ని ఉంటాయి. అలాంటి చోట్ల హృదయం సంపూర్ణ వికసిత పుష్పమవ్వాలి. నవ్వే ముఖం సర్వత్రా వెలుగు కిరణాలు పంచాలి. నవ్వే వ్యక్తి చుట్టూ స్వర్గం ఆవరించుకుని ఉంటుంది. ఇది సత్యం.

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న