జగన్మాత

అంతర్యామి

జగన్మాత

‘మాత’ అంటే మమతల పుట్టినిల్లు. తనలోంచి మరొక దేహాన్ని సృజించగల శక్తి మాతకే ఉంది. ‘జగన్మాత’ అంటే జగత్తుకే తల్లి. ‘మా అమ్మ’ అంటే మనకు జన్మనిచ్చిన తల్లి. జగజ్జనని అంటే అన్ని లోకాలకూ అమ్మ. భారతీయ ఆధ్యాత్మికత తల్లికిచ్చిన విశేష ప్రాధాన్యాన్ని మరెక్కడా చూడలేం.

మంచి-చెడు శక్తులతో సృష్టి నిండి ఉంది. చెడు శక్తులను ప్రపంచ రక్షణ చేసే దైవశక్తులు నిర్మూలిస్తాయి. అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు అమ్మ నుంచే లభిస్తాయి. తల్లి తొలి దైవం. ఎంతటి మహనీయులైనా తల్లికి విధేయులు. ఎవరి జీవిత చరిత్రలు చూసినా, ఈ పరమ సత్యం మనకు అర్థమవుతుంది. శ్రీ రమణులు తమ తల్లికి మోక్షాన్ని అనుగ్రహించారు. కంచి పరమాచార్యులు కూడా- చివరి దశలో, తనకు జన్మనిచ్చిన తల్లినే స్మరిస్తూ దేహత్యాగం చేశారు. ఇలాంటి సంఘటనలు తల్లి ప్రాధాన్యానికి అద్దం పడతాయి.

జగన్మాత దివ్యతత్వం అపురూపమైనది. అది అనంతం, ఊహాతీతమని పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. ప్రజాపీడకుణ్ని తొమ్మిది రోజుల మహాయుద్ధంలో మాత అంతం చేసింది. ఆ తొమ్మిదో రోజునే మనం ‘మహర్నవమి’గా కొలుస్తున్నాం. ఆ మరునాడే అమ్మవారి విజయోత్సవం దసరా. తొమ్మిది రాత్రుల ఉపాసన పదో రోజున ముగుస్తుంది.

అమ్మవారు తొమ్మిది రోజులు- రేయింబవళ్లూ మహాసంగ్రామం చేసింది. ఉపాసకులు అమ్మవారిని ప్రత్యేక శ్రద్ధాసక్తులతో తొమ్మిది రోజులు ఆరాధిస్తారు. పదో రోజున ముగిస్తారు. విశిష్ట ఆరాధకులు తొమ్మిది మంది బాలికలను పూజించి నూతన వస్త్రాలు సమర్పిస్తారు. శ్రద్ధా భక్తులతో చేసిన భక్తులకు విశేష ఫలితాలు లభిస్తాయంటారు. భారతదేశంలో ఒక్కో ప్రాంతంలో తల్లిని ఒక్కో పేరుతో పిలుస్తారు. పూజలు, ఆరాధనలు జరుగుతుంటాయి. దసరా ఉత్సవాలను మాత్రం దేశంలోనే కాదు, భారతీయులు ఎక్కడ ఏచోట ఉన్నా, ఒకేలా నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా కోల్‌కతా వంటి ప్రదేశాల్లో తల్లికి దసరా మహోత్సవాల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మైసూరు కూడా దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి.

తల్లి ఆరాధన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా సాగడాన్ని మనం గమనిస్తుంటాం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జగన్మాతను ‘బతుకమ్మ’ పేరుతో ఆరాధిస్తారు. బతుకమ్మ పండుగను చాలా శ్రద్ధాసక్తులతో నిర్వహించుకుంటారు. ఈ వేడుకల్లో మహిళల పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది. బతుకమ్మ పండుగలో నైవేద్యాలది పెద్దపీట. ‘అమ్మ’ అనే శబ్దం తరతమ భేదాలతో దాదాపు అన్ని భాషల్లోనూ గొప్పగా ధ్వనిస్తుంది. భారతీయుల గొప్పదనం తల్లిని దేవతగా ఆరాధించడం. బిడ్డలోని లోపాలను పట్టించుకోకుండా అక్కున చేర్చుకునే అమృతమూర్తి అమ్మ. తల్లి లేని వారిక్కూడా జగజ్జనని ఆ ప్రేమను అందిస్తుంది. అమ్మవారిది దివ్యానుగ్రహం. అది అందుకోగలిగిన వారిదే అదృష్టం. లోకంలో తమ బిడ్డలను ఎంతో ప్రేమగా చూస్తారు తల్లులు. ఈ లోకంలో మనుషులు ఎవరూ శాశ్వతం కాదు. కేవలం మంచి గుణాలే మనిషికి శాశ్వత కీర్తినిస్తాయి. ప్రతి పండుగలోనూ నిత్యజీవితంలో మనం ఎదుర్కొనే అనేక సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. దాన్ని మనం అందుకోగలగాలి. అప్పుడే అది పండుగ.

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న