విజయ దశమి

అంతర్యామి

విజయ దశమి

చెట్లను దేవతలుగా భావించడం మన సంస్కృతి, సంప్రదాయం. ఇలాంటి ఉత్కృష్ట సంప్రదాయమే దసరా పండుగనాడు చేసే శమీ వృక్ష పూజ. శమీ వృక్షాన్ని ‘జమ్మిచెట్టు’ అంటారు. 

ప్రతి ఏడాదీ ఆశ్వీయుజ శుద్ధ దశమినాడు జరుపుకొనే ఈ పండుగ వెనక ఎన్నో విశేషాలున్నాయి. ఆశ్వీయుజ మాసం శక్తిపూజకు ఎంతో ముఖ్యమని తంత్రశాస్త్రం ఉపదేశిస్తోంది. పూర్వం రాజులు, చక్రవర్తులు ఆశ్వీయుజ మాసంలోనే దిగ్విజయ యాత్రలకు వెళ్ళేవారు. శత్రువులపై విజయం సాధించడానికి ‘శక్తి’ అనుగ్రహం కావాలి. ఆ శక్తి పేరే అపరాజిత. ఈ శక్తి ఆశ్వీయుజ శుద్ధ దశమినాడు సాయంకాలం నక్షత్రోదయ సమయంలో ప్రకృతిలో ఆవహించి ఉంటుందని, సకల విజయాలనూ ప్రసాదిస్తుందని శాస్త్ర వచనం. పూర్వం త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ శక్తిని పూజించి, రావణాసురుడిపై యుద్ధంలో విజయం సాధించాడని పురాణ కథనం. ద్వాపరయుగంలో పాండవులు, విశేషించి అర్జునుడు ఈ శక్తిపూజ వల్లనే ఉత్తరగోగ్రహణ సమయంలోను, కురుక్షేత్ర సంగ్రామంలోను విజయాలను సాధించారని ఇతిహాసం చెబుతోంది. 

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమినాడు ప్రారంభమయ్యే దేవీ నవ రాత్రోత్సవాలు మహర్నవమి (మహా నవమి) వరకు తొమ్మిది రోజులు వైభవంగా జరుగుతాయి. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, అతిభైరవి, సర్వసిద్ధి అనే రూపాలతో శక్తిని ఈ తొమ్మిది రోజుల్లో ఆరాధించడం కనబడు తుంది. నవరాత్రులు గడిచాక, పదో దినాన వచ్చే విజయదశమినాడు నవరాత్రీ దీక్షను ముగించిన భక్తులు ‘సీమోల్లంఘం’ (ఊరి పొలిమేరలు దాటి ఉత్తర దిక్కుగా వెళ్ళడం) చేస్తారు. ఈ సమయంలోనే ‘పాలపిట్ట’ను చూస్తే, మేలు కలుగుతుందని, అది శుభ శకునమనీ భావిస్తారు.

విజయదశమిని ‘దసరా’ అనీ కూడా పిలుస్తారు. ‘దశ(కంఠ)హార’ అనే పేరే దసరాగా పరిణమించిందని కొందరి భావన. దసరానాడు బొమ్మల కొలువులు పెట్టడం, నూతన వ్యాపారాలను ప్రారంభించడం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. మహాలయ అమావాస్య(భాద్రపద అమావాస్య) నాడు ప్రారంభమయ్యే బతుకమ్మ పూజలు తొమ్మిది రోజులపాటు రోజుకొక నైవేద్యంగా సాగుతూ ‘దుర్గాష్టమి’ నాడు ‘చద్దుల బతుకమ్మ’ పేరుతో ఎన్నో విధాలైన పులిహోరల నైవేద్యాల సమర్పణతో ముగుస్తాయి. ప్రకృతిలోని అందాలకు, ఆరాధనలకు నిలయాలైన పూలను పూజించడమే ‘బతుకమ్మ’ పండుగలోని వైశిష్ట్యం. తెలంగాణలో పుట్టిన ఈ బతుకమ్మ పండుగ నేడు విశ్వవ్యాప్తమై, అన్ని దేశాల్లోనూ పూజలను అందుకొంటోంది.

చీకటిలో ఉన్నప్పుడు వేకువ కోసం తపించడం మానవ స్వభావం. అలాగే నిత్యజీవితంలో ఎప్పుడూ విజయాలే కలగాలని ఆకాంక్షించే మనిషికి ‘విజయదశమి’ వేగుచుక్కలా దారి చూపుతుంది. పండుగలన్నీ సమైక్య, శాంతిమయ జీవనానికి దారి తీస్తాయి. సౌజన్యం, సౌభ్రాతృత్వం, అభ్యుదయం, ఆనందం... ఇవే కదా పండుగల లక్ష్యాలు! వీటిని మానవాళికి ప్రసాదించే ‘విజయదశమి’ శుభప్రద పర్వదినం!

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న