జీవన రీతి

అంతర్యామి

జీవన రీతి

జీవితంలో మనం పయనించే దారి సమస్తం పూలబాట కాదు. ఆ దారిలో ముళ్లుంటాయి... మెత్తని పచ్చిక బయళ్లుంటాయి. అటుపైన గులక రాళ్లు సైతం తారసపడతాయి. ఈ జీవిత గమనంలో కింద పడుతూ సంబాళించుకొంటూ ప్రయత్నించి పైకి లేస్తూ లక్ష్యం వైపు సాగాలి. గాయాలవుతాయి. బాధ కలుగుతుంది. సహనం వహించాలి. గాయం మానాక కొంచెం హాయిగా అనిపిస్తుంది. వడివడిగా అడుగులు వేస్తాం. లక్ష్యం సుదూరంలో కనిపిస్తుంది. అనుకోకుండా రాయి తగిలి కిందపడతాం. మళ్ళీ అసహనం. ఈ అసహనంతో ఒరిగే ప్రయోజనం లేదు. ఓర్పు వహించాలి. మనం చేరుకోవలసిన గమ్యం చేరగానే విజయానందం పరచుకొంటుంది. గాయాలను, బాధలను మరచిపోతాం. అప్పుడు మనం నివసిస్తున్న ప్రపంచమంతా రంగులమయమై కనపడి తీరుతుంది. మనిషి జీవితమంతా ఇలాగే గడుస్తుంది. కానీ చివరి మజిలీ చేరాక మునుపటి బాధనంతా విడచిపెడతాం. ఈ ప్రస్థానంలో పాపపుణ్యాలు లేవు. పొరపాట్లు మాత్రమే ఉంటాయి. వాటిని సరిదిద్దుకొంటూ కిందపడి పైకి లేచేవాడే విజయుడని భర్తృహరి అంటాడు.

మనం సాధకులమో కాదో దైవం కాదు నిర్ణయించేది. మనం సాధించే వాళ్లమో కాదో మనం నడిచే దారి నిర్ణయిస్తుంది. లక్ష్యం చేర్చని దారిపై ఎంత నడిచినా ఏం ప్రయోజనం? మన గతం ఏమిటో, భవిత ఏమిటో మనలోని పట్టుదల నిశ్చయిస్తుంది. మనం అనుభవించే కష్టాలు... వేదనలు పరిష్కరించదగినవే. అవన్నీ ప్రాపంచికమైనవే కదా. మన తీరుతెన్నులు, ప్రవర్తనలు ఆ సమస్యలను పరిష్కరిస్తాయి. ఏకాగ్రత పెంపొందించుకునే కొద్దీ విజ్ఞానం సమకూరుతుంది. విజ్ఞానం వల్ల జీవన పోరాటానికి అవసరమైన ధైర్యం వస్తుంది. గమ్యం తెలుస్తుంది. గమ్యం తెలియని నియంత్రణ లేని మనసు మనల్ని దారి తప్పిస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే ప్రయత్నాలు ఫలించి విజయ శిఖరాలను అధిరోహింపజేస్తాయి. ముందు మనలోని భావాలను పవిత్రం చేసుకోవాలి. జీవన యానం కఠినమైనదనే భావన మనల్ని నిర్వీర్యులను చేస్తుంది. అందుకే కొందరు జీవిత పయనాన్ని సగంలోనే ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఓడిపోవడానికి కాదు కదా మనం పుట్టింది. గెలుపు కోసం జన్మించాం. సమస్యలను పరిష్కరించుకొంటూ ముందుకు సాగితే అపరిమితమైన శక్తి, అజేయమైన సంకల్ప బలం సిద్ధిస్తాయి. మన జీవితం సజావుగా సాగాలంటే దైన్యాన్ని అజ్ఞానాన్ని దుఃఖాన్ని వదులుకోవాలి. జీవన మార్గంలో కంటకాలు ఉంటాయని గ్రహించాలి. బాధ్యతలు పైన పడ్డాక జీవిత పయనం అంత సులువైంది కాదని అనుభవాలు చెబుతాయి. అందుకు సిద్ధమై ముందుకు సాగాలి. అప్పుడు దైన్యం మన దరి చేరదు. కూతురి పెళ్ళి చేయాలి, ఎలాగని కుంగిపోకూడదు. ముళ్లు పక్కకు తొలగించుకుంటూ నడిస్తే ఎక్కడో ఒకచోట మెత్తని పచ్చిక కనపడుతుంది. మన సాధారణత్వం తొలగి అసాధారణ శక్తి ఆవహిస్తుంది. నలుగురూ సహాయ హస్తం అందిస్తారు. కూతురి పెళ్ళి అలా... జరిగిపోతుంది. మనలోని సంకల్ప బలం, పట్టుదల ఆ ఆపన్న హస్తాలకు అర్హత సంపాదించి పెడతాయి. అయినా కష్టసుఖాలు లేని జీవిత గమనంలో విసుగు తప్ప ఏముంటుంది? చీకటి తరవాత వెలుగు ఆవహించినప్పుడు మన లక్ష్యం మరింత చేరువై కనిపిస్తుంది. అక్కడికి చేరితే అదే దివ్యమైన సంతృప్తికరమైన జీవితం. మనల్ని మనం జయిస్తే విశ్వమంతా మనకు స్వాధీనమవుతుందన్నది విదుర నీతి. కష్టంగా ఉన్నా మేలు చేసే మార్గంలోనే మన నడక సాగాలి. సుఖమైన జీవితం కోసం ప్రలోభపడి కష్టాలను కొని తెచ్చుకోకూడదు. శ్రేయో మార్గం కచ్చితంగా లక్ష్యాన్ని చేరుస్తుంది. అదే జీవన విజయానికి ప్రత్యక్షానుభూతి.

- అప్పరుసు రమాకాంతరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న