కర్తవ్యనిర్వహణ యజ్ఞం

అంతర్యామి

కర్తవ్యనిర్వహణ యజ్ఞం

సంతానప్రాప్తి కోసమా... కీర్తిప్రతిష్ఠలా... స్వర్గప్రాప్తా... దీనికి సంబంధించినవే కాకుండా ఇంకా ఎన్నో ఊహించదగిన కోరికలకూ యజ్ఞం నిర్దేశితమైంది! యజ్ఞం అంటే హోమం. దేవతలకు అర్పణలు చేయడం, ఆరాధన గావించడం- వేదాలలో సూచించిన విధంగానే జరగాలి. యజ్ఞం- హోమ రూపంలో దేవతలకు కృతజ్ఞత తెలుపుకోవడం.

సూర్యశక్తి, నీరు, భూమి, వాయువు, ఆకాశం- వీటిని దేవతలుగా భావించేవారు యజ్ఞాలు చేస్తారు. ఈ ప్రకృతి శక్తులు లేకపోతే మనిషి ఎక్కడుంటాడు? యజ్ఞానికి ఇదొక్కటే భావం కాదు.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు జీవ పర్యావరణ చక్రం గురించి వివరిస్తాడు. ప్రాణులన్నీ ఆహారంపైనే ఆధారపడి జీవిస్తాయి. ఆహారం ఉత్పత్తి అయ్యేది వర్షం వల్ల. వర్షాలు యజ్ఞాల వల్ల, యజ్ఞం చేయడం సాధ్యమయ్యేది కర్మ వల్ల. యజ్ఞం అనేది సర్వజనుల సామూహిక చర్యల వల్ల. దాని కారణంగా ఆహార చక్రం కొనసాగుతూ ఈ ప్రపంచం నివాసయోగ్యమవుతుంది.

ఈ రోజున మనిషి జీవిస్తున్న ఈ ప్రపంచం పరిణామక్రమం వల్ల ఏర్పడింది. శాస్త్రవేత్తలు, యంత్ర నిర్మాతలు, వైద్యులు, ఉపాధ్యాయులు, శ్రామికులు... ఎందరెందరో తోడ్పాటును అందించారు. ప్రతి ఒక్కరూ తమవంతుగా చిన్నా పెద్దా అన్ని రకాల పాత్రలూ పోషించి ప్రపంచాన్ని మెరుగ్గా రూపొందించారు. ఇలా యోగ్యంగా మలచినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి.

ప్రపంచం నుంచి ఎంతో తీసుకుంటూ దాంతో సమానంగా తన కర్తవ్యాన్ని మనిషి నిర్వహించకపోతే... పాపం. ఒక ఉద్యోగి కార్యాలయంలో పనేమీ చేయకుండా, చేస్తున్నట్లు నటిస్తూ, అధికారులను ప్రసన్నం చేసుకునే మార్గాలను అన్వేషిస్తూ జీతం తీసుకోవడం ఎంత అధర్మమో... అదీ అలాంటిదే.

కర్తవ్య నిర్వహణ విషయంలో ఎటువంటి స్వార్థం, అహం, నిర్లక్ష్యవైఖరి పనికి రావంటుంది గీత.

ప్రతిరోజూ అయిదురకాల యజ్ఞాలను చేయాల్సి ఉంటుందంటారు. దేవయజ్ఞం- పంచభూతాలకు కృతజ్ఞతలు తెలియజేసుకోవడం. రుషి యజ్ఞం- జీవించడానికి అవసరమయ్యే వివేకాన్ని తమ జ్ఞానంతో అందించిన రుషులకు కృతజ్ఞతలు చెప్పుకోవడం. ప్రతిరోజూ పవిత్ర గ్రంథాల పఠనం, శ్రవణం... పితృయజ్ఞం- వివిధ లోకాల్లో ఉండే పూర్వులకు కలశంలో నీటిని, కొంత ఆహారాన్ని సూర్యభగవానుడి ఎదుట సమర్పించడం. అతిథి యజ్ఞం- తోటివారి పట్ల కృతజ్ఞతతో మెలగడం. ఆకస్మికంగా వచ్చే అతిథికో, ఆకలితో ఉన్న ఓ వ్యక్తికో ఆహారాన్ని అందించడం. భూతయజ్ఞం- గోవులకు, పశుపక్ష్యాదులకు, క్రిమికీటకాలకు ఆహారం ఏర్పాటు చేయడం. ఈ అయిదు యజ్ఞాలు ప్రతిరోజూ చేస్తూ తమ కర్తవ్య నిర్వహణను సక్రమంగా చేయాలంటారు. ఫలితాలను దైవప్రసాదంగా స్వీకరించాలి.

వేదాలు- అత్యున్నతమైన సత్యాన్ని గ్రహించిన రుషుల అనుభవాలు. ప్రతి ఒక్కరినీ ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఉద్ధరించాలనేది వాటి ఉద్దేశం. వేదాలను అర్థం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఉపనిషత్తుల ద్వారా వేదసారాన్ని అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది. అన్ని ధర్మాలకూ మూలం వేదాలు అనే అవగాహనతో మనిషి జీవించాలి.

- మంత్రవాది మహేశ్వర్‌


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న