మహోపకారి

అంతర్యామి

మహోపకారి

నిషి పుట్టినప్పటి నుంచి ఆకలి దప్పికల గురించి ఆలోచిస్తాడు. దొరికిన ప్రతి ఆధారాన్నీ ఉపయోగించుకుంటాడు. కొందరు అతిగా ఆరాటపడేవారు ఇతరుల సంపాదనను నిర్లజ్జగా దోచుకునేందుకు వెనకాడరు. ఈ క్రమంలో ఎరిగిన వారిని, రక్తసంబంధీకులనే కాదు- చివరకు ప్రకృతినీ గాయపరచి అవసరాలకు మించి అనుభవించేందుకు ప్రయత్నిస్తారు. విశృంఖల చేష్టలతో అజ్ఞానపు చీకట్లలో తిరుగాడుతూ భూమికే భారమవుతారు. బలహీనతలతో కొట్టుమిట్టాడే మనుషుల బాహ్యాంతరంగాలను సంస్కరించేందుకు సృష్టికర్త అల్లాహ్‌ పంపిన చిట్టచివరి ప్రవక్త మొహమ్మద్‌(స.అ.వ.) అత్యుత్తమ జీవన విధానానికి మార్గదర్శి. మానవతా దృక్కోణంతో ఆధ్యాత్మిక రుజుమార్గం చూపిన మహోపకారి.
మొహమ్మద్‌(స.అ.వ.) మృదువైన మాటతీరుతో మనసులు గెలుచుకొనేవారు. తెల్లని వస్త్రధారణతో ఆకర్షణీయంగా లక్షలాది అరబ్బులను ఆకట్టుకునేవారు. చిరునవ్వుతో సలాం చేసి ప్రేమగా ఎదుటివారిని పలకరించి ఆత్మీయంగా మాట్లాడేవారు. ఎవరైనా కానుకలు అందిస్తే బదులుగా కానుకలిస్తూ అల్లాహ్‌ దయకోసం ప్రార్థించేవారు.
పసిపిల్లలంటే అమితంగా ఇష్టపడే ప్రవక్త మొహమ్మద్‌(స.అ.వ.) వారిని ‘దేవుడి ఉద్యానవనంలో పుష్పాలు’గా వర్ణిస్తూ ఆటలు ఆడేవారు. చిన్నపిల్లలకు ముందుగా ఆయనే సలాం చేసేవారు. ఇస్లామీయ సూత్రాలను బాల్యంలోనే బోధించాలనేవారు. మహిళలను గౌరవించేవారు.
హజ్రత్‌ అస్మా అన్సారియా కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్‌ (స.అ.వ.) ఆమెకు, ఆమె స్నేహితురాళ్లకు సలాం చేసి క్షేమ సమాచారాలు తెలుసుకునే వారు. ఆయన నిగర్వి. అత్యంత వినయ విధేయతలు కలిగిన అల్లాహ్‌ విశ్వాసి.
మనిషి చనిపోతే అతడి ఆచరణల పరంపర ఆగిపోతుంది. అయినా మూడు మార్గాల ద్వారా అతడికి సదాచార పుణ్యం లభిస్తుంది. జీవితకాలంలో తాను పొందిన జ్ఞానంతో ఇతరులకు నేర్పిన విద్యాఫలం, సద్వర్తనులుగా తీర్చిదిద్దిన సంతానం, దానధర్మాలు- ఇవే ఆ మూడూ. తల్లిదండ్రుల కోసం వారి జ్ఞాపకార్థం మంచినీటి బావిని తవ్వినా చాలు పుణ్యం దక్కుతుందని, సమర్పణ జరుగుతుందని ప్రవక్త(స.అ.వ.) ప్రబోధించేవారు. దానం నికృష్టమైన చావు నుంచి మనిషిని కాపాడుతుంది. జల దానం అన్నింటికంటే మేలైనదని చెప్పేవారు. బిడ్డలు దానధర్మాలు చేస్తే వారి తల్లిదండ్రులకు ఆ పుణ్యఫలం చేరుతుందని అనేవారు.
ప్రవక్త(స.అ.వ.) మహా ప్రాసాదాలు కట్టలేదు. విలాస వస్తుసామగ్రి సమకూర్చుకోలేదు. ఎండ నుంచి చలి నుంచి రక్షణ, క్రూరమృగాల నుంచి భద్రత, వ్యక్తిగత అవసరాలకు కావలసిన సౌలభ్యంతో ఇళ్లు ఉండాలనేవారు. పరిశుభ్రత, పవిత్రతలే ఇంటికి అలంకారాలు అనేవారు. భోగభాగ్యాలతో రాజులు జీవిస్తారు కదా అని అనుచరులు అడిగితే- మెత్తని పడకలపై ఆదమరచి నిద్రపోవడం కంటే అర్ధరాత్రి దాటాక చేసే తహజ్జుద్‌ నమాజు గొప్పది అనేవారు. దయాగుణం కలిగిన ప్రవక్త ఆడంబరాలకు వ్యతిరేకి. మొహమ్మద్‌(స.అ.వ.) ఒక కాల్పనిక వ్యక్తి కాదు. ఆయన జీవితం ఒక కథ కాదు. తరతరాలవారు నిత్యం స్మరించుకొనే చరిత్ర. హీరాగుహలో జిబ్రయిల్‌(అ.స.) దైవదూతతో ప్రవక్త(స.అ.వ.) సంభాషించినది మొదలు సౌర్‌ గుహ వరకు, కాబా గృహంలో నమాజు నుంచి తాయిఫ్‌ బజారు వరకు, గృహస్థ ధర్మం నుంచి యుద్ధ మైదానాల్లో గెలుపు వరకు ప్రతీ చర్య సాంఘిక, ఆధ్యాత్మిక విప్లవాలకు నాంది పలికింది.

- షేక్‌ బషీరున్నీసా బేగం


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న