close

ప్రధానాంశాలు

హైరానా..

హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారిని సరిహద్దుల వద్ద ఏపీలోకి అనుమతించిన ప్రభుత్వం
ఇద్దరు ముఖ్యమంత్రుల చర్చలతో సమస్య కొలిక్కి
కొత్తగా ఎవరినీ అనుమతించవద్దని నిర్ణయం
అంతకుముందు.. హైదరాబాద్‌లో హాస్టళ్ల మూసివేతతో పోలీస్‌ స్టేషన్ల వద్దకు వేల మంది
8వేల మందికి నిరభ్యంతర పత్రాలు
సరిహద్దుల వద్ద అడ్డుకున్న ఏపీ పోలీసులు
రాత్రి వరకూ అవస్థ

కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రైవేటు హాస్టళ్ల మూసివేత వ్యవహారం బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ తీవ్ర గందరగోళానికి దారితీసి.. చివరకు ఇద్దరు ముఖ్యమంత్రుల చర్చలతో కొంతమేర పరిష్కారమైంది. హైదరాబాద్‌లో నిరభ్యంతర పత్రాలు తీసుకుని సరిహద్దులకు చేరుకున్న వారిని ఏపీలోకి అనుమతించాలని, ఇక మీదట ఎవరికీ అనుమతులివ్వకుండా ఎక్కడివారిని అక్కడే ఉంచాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. దీంతో సరిహద్దులకు చేరుకున్న వారిని ప్రత్యేక కేంద్రాలకు తరలించి వైద్య పరీక్షల అనంతరం ఇళ్లకు పంపనున్నారు. బుధవారం అర్ధరాత్రి అందుకు అనుగుణంగా వైద్య పరీక్షల కోసం వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వారిని నూజివీడు ట్రిపుట్‌ ఐటీకి, తూర్పుగోదావరి వారిని రాజమహేంద్రవరం, పశ్చిమగోదావరి వారిని తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం క్వారంటైన్‌ కేంద్రాలకు తీసుకెళ్లారు. ఇక హైదరాబాద్‌ నుంచి ఎవరు వచ్చినా అనుమతించేది లేదని సరిహద్దుల వద్ద ఏపీ అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి వస్తే.. ఆ వచ్చిన వారికేగాక, వారి కుటుంబ సభ్యులకు ముప్పు ఉంటుందన్నారు.

ఉదయం నుంచీ గందరగోళం...
అంతకుముందు ఉదయం నుంచి రాత్రి వరకూ తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రైవేటు వసతి గృహాల యజమానుల ఆంక్షలతో హైదరాబాద్‌లో ఉండేందుకు అవకాశం లేక పోలీసుల అనుమతి తీసుకుని బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు, విద్యార్థుల పరిస్థితి సరిహద్దుల వద్ద ఇబ్బందికరంగా మారింది. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడువద్ద ఏపీ పోలీసులు అడ్డుకోవడంతో వేల మంది అక్కడే నిలిచిపోయారు. వందల సంఖ్యలో వాహనాలు చిక్కుకుపోయాయి.  కొందరు విద్యార్థులు  వైద్య ధ్రువీకరణతో ఎన్‌వోసీలు తెచ్చుకోవడంతో రాష్ట్రంలోకి అనుమతించారు. మిగిలిన వారంతా భారీగా రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొ న్నారు.

బుధవారం ఉదయం హైదరాబాద్‌లో వసతి గృహ యజమానులు విద్యార్థులను ఖాళీ చేయాలని చెప్పడంతో వారంతా పోలీసు ఠాణాల వద్ద బారులు తీరారు. అనుమతి ఇస్తే ఇళ్లకు వెళ్లిపోతామని చెప్పడంతో పోలీసులు దాదాపుగా 8వేల మందికి నిరభ్యంతర పత్రాలను జారీ చేశారు. దీంతో వారందరూ స్వస్థలాలకు బయలుదేరారు. కొందరు సొంత వాహనాలు, కార్లు, ద్విచక్రవాహనాలపై ప్రయాణమయ్యారు. వీరిలో ఎక్కువమంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, ఉద్యోగులు, విద్యార్థులున్నారు. వారిని సరిహద్దులవద్ద ఏపీ పోలీసులు ఆపేశారు. నిరభ్యంతర పత్రాలను ఎందుకు స్వీకరించబోరంటూ వచ్చినవారు వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. రహదారులపై వేల మంది ఉండిపోయారు. ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. మరో వైపు.. రామపురం క్రాస్‌ నుంచి  ఏపీలోకి వచ్చేందుకు వాహనదారులు ప్రయత్నించారు. రామపురం క్రాస్‌, బుధవాడ గ్రామాల దగ్గర స్థానికులు కంచెలు వేసి, వారిని అడ్డుకున్నారు. తమ గ్రామాల మీదుగా వెళ్లొద్దంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈలోగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడారు. విద్యార్థులందరూ ప్రయాణమవడంవల్ల రవాణా ఇబ్బందులొస్తాయని చెప్పారు. ఎక్కడి వారక్కడే ఉంటేనే బాగుంటుందని సూచించారు. ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని కూడా ఈ అంశంపై తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో మాట్లాడారు. స్పందించిన మంత్రి కేటీఆర్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి వసతి గృహాల మూసివేత వద్దని నిర్వాహకులను ఆదేశించారు. దీంతో కొత్తగా నిరభ్యంతర పత్రాల జారీని పోలీసులు ఆపేశారు. మరోవైపు అప్పటికే ప్రయాణమైనవారు, ప్రయాణానికి రోడ్లపై పడిగాపులు పడుతున్న వారి పరిస్థితి గందరగోళంగా మారింది. చివరకు ముఖ్యమంత్రుల జోక్యంతో పరిస్థితి చక్కబడింది.

అదను చూసి.. అదనంగా దోచేసి..
సొంతూళ్లకు బుధవారం బయలుదేరిన విద్యార్థులు, ఉద్యోగులను ప్రైవేటు వాహనాలవారు ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. వందల్లో వసూలు చేయాల్సిన రుసుములను ఒక్కసారిగా వేల రూపాయలకు పెంచారు.

అక్కడే ఉండాలి.. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ విద్యార్థులు, ప్రైవేటు విద్యా సంస్థలు, సంస్థల్లో పని చేస్తున్నవారు.. ఎక్కడి వారక్కడే ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న సమయంలో బయటకు రావొద్దని కోరింది. ఏపీలోని తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. ఏవైనా సమస్యలుంటే 1902 నంబరుకు ఫోన్‌ చేయాలని సూచించింది.

-ఈనాడు, ఈనాడు డిజిటల్‌- హైదరాబాద్‌, అమరావతి, జగ్గయ్యపేట- న్యూస్‌టుడే

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.