
క్రీడలు
సౌత్‌జోన్ అథ్లెటిక్స్‌లో మెరిసిన ‘ఈనాడు లక్ష్య’ క్రీడాకారిణి
ఈనాడు, హైదరాబాద్: ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్న వి.నిహారిక (ఆంధ్రప్రదేశ్) సౌత్‌జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటింది. కేరళలోని కాలికట్లో జరుగుతున్న ఈ పోటీల్లో అండర్-14 బాలికల 60 మీటర్ల పరుగులో నిహారిక కాంస్య పతకం సాధించింది. 8.32 సెకన్లలో పరుగును పూర్తిచేసి మూడో స్థానంలో నిలిచింది. అండర్-18 బాలికల 100 మీటర్ల పరుగులో దీప్తి (తెలంగాణ) స్వర్ణం సాధించింది. 12.09 సెకన్లలో పరుగును పూర్తిచేసి కొత్త మీట్ రికార్డును సృష్టించింది. అండర్-18 బాలికల లాంగ్‌జంప్‌లో నందిని (తెలంగాణ) బంగారు పతకం గెలుచుకుంది. 6.20 మీటర్లు దూకి జూనియర్స్ విభాగంలో జాతీయ రికార్డు నెలకొల్పింది. బాలుర 100 మీ పరుగులో శ్రీనివాస్ (10.85 సెకన్లు) స్వర్ణం సాధించాడు. ఇదే పరుగులో మూడో స్థానంలో నిలిచిన శరత్చంద్ర (తెలంగాణ)కు కాంస్యం దక్కింది. అండర్-16 బాలుర 100 మీ పరుగులో గణేశ్ (11.34 సెకన్లు) రజత పతకం సొంతం చేసుకున్నాడు. అండర్-16 బాలుర హైజంప్‌లో ప్రణయ్ (1.91 మీటర్లు- తెలంగాణ) ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణం సాధించాడు.