
క్రైమ్
తణుకు, న్యూస్టుడే: సరస్వతీ నిలయంలో ఉపాధ్యాయురాలిపై చాకుతో దాడి చేసి గాయపరిచిన ఘటన ఇరగవరం మండలం కాకిలేరు మండల ప్రజాపరిషత్ ప్రత్యేక పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు. ఇరగవరం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గుత్తుల నాగలక్ష్మికి జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన కడలి రామదుర్గాప్రసాద్కు 2016 అక్టోబర్ 16న వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. రామదుర్గాప్రసాద్ కిరాణా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నాగలక్ష్మి కాకిలేరు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. భార్య, భర్తల మధ్య మనస్పర్థల కారణంగా నాలుగు నెలల నుంచి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భర్త వేధింపులపై నాగలక్ష్మి ఉండ్రాజవరం, ఇరగవరం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడంతో రామదుర్గాప్రసాద్పై కేసు నమోదు చేశారు. ఆ తరవాత నాగలక్ష్మి తూర్పువిప్పర్రులో ఉంటున్న తన బాబాయ్ గుత్తుల మోహన్రావు వద్దకు వచ్చేశారు. నాగలక్ష్మి ఇటీవలే బదిలీలపై కాకిలేరు పాఠశాలకు వచ్చారు. శుక్రవారం యథావిధిగా తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తుండగా రామదుర్గాప్రసాద్ వచ్చి ఆమె ఉన్న తరగతి గదిలోకి ప్రవేశించి ఆమెపై చాకుతో దాడి చేశాడు. విద్యార్థులు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అతనిని బంధించి పోలీసులకు అప్పగించారు. గాయాలతో ఉన్న నాగలక్ష్మిని మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తీసుకెళ్లారు. తన వద్ద ఏటీఎం కార్డు తీసుకుని నగదు వాడుకోవడమే కాకుండా నిత్యం తనను చంపేస్తానని బెదిరించేవాడని దీంతో భయపడి బదిలీపై వచ్చానని, అయినా తనను చంపడానికి పాఠశాలకు వచ్చి దాడి చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.