
క్రైమ్
అంబానీ ఇంటికి సమీపంలో కనుగొన్న ఎస్‌యూవీపై పోలీసుల వెల్లడి
ముంబయి: దక్షిణ ముంబయిలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాలతో కనుగొన్న వాహనం గత వారం చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఒక లేఖ కూడా పోలీసులకు దొరికింది. డ్రైవరు సీటు పక్కన ఉన్న నీలిరంగు బ్యాగులో ఉన్న ఆ లేఖలో.. ‘‘ఇది కేవలం ఝలక్ మాత్రమే. మరోసారి పూర్తిస్థాయిలో అమర్చిన సామాను(పేలుడు పదార్థాలు) ఉంటుంది’’ అని రాసి ఉంది. జిలెటిన్ స్టిక్స్‌తో ఉన్న ఈ వాహనాన్ని గురువారం పోలీసులు కనుగొన్న సంగతి తెలిసిందే. అనంతరం దాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. కాగా ఈ దృశ్యాలను చూసి గుర్తించిన వాహన యజమాని హిరేన్ మన్సుఖ్ దక్షిణ ముంబయిలోని పోలీసు కమిషనర్ కార్యాలయానికి శుక్రవారం వెళ్లి అది తన వాహనమే (ఎస్యూవీ)నని తెలిపారు. ఆయన వాంగ్మూలాన్ని ముంబయి క్రైం బ్రాంచి, నిఘా విభాగం రికార్డు చేస్తుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఠాణేకు చెందిన మన్సుఖ్ అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాను ఈనెల 17న ఓ కార్యక్రమానికి వెళుతుండగా స్టీరింగ్ పట్టేయడంతో ఆ వాహనాన్ని ఐరోలీ ములుంద్ బ్రిడ్జి సమీపంలో పార్క్ చేసి వెళ్లిపోయినట్లు చెప్పారు. మరుచటి రోజు వెళ్లి చూసేసరికి తన వాహనం అక్కడ లేదని, 4 గంటలు వెతికిన అనంతరం విఖ్రోలీ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా వాహనంలో కనుగొన్న జిలెటిన్ స్టిక్స్ ప్యాకెట్‌పై తయారీదారు పేరు ‘సోలార్ ఇండస్ట్రీస్, నాగ్‌పుర్’ అని ఉంది. ఈమేరకు తనకు ముంబయి పోలీసుల నుంచి ఫోను వచ్చినట్లు ఆ కంపెనీ యజమాని సత్యనారాయణ్ నువాల్ ఓ ప్రకటనలో తెలిపారు.
మరోవైపు పేలుడు పదార్థాల వాహనం ఉదంతంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కూడా సమాంతరంగా విచారణ ప్రారంభించింది. ఈమేరకు ముంబయి పోలీసు క్రైం బ్రాంచిని ఎన్ఐఏ సంప్రదించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.