
తాజా వార్తలు
అహ్మదాబాద్: దేశ వ్యాప్తంగా కొద్ది రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత మూడు రోజులుగా దేశంలో 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో గుజరాత్లోని నాలుగు ప్రధాన నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూను మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్లలో కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఈ నాలుగు నగరాల్లో నవంబర్ నుంచి నిరవధిక కర్ఫ్యూ అయిదు దఫాలుగా పొడిగించారు. ఈ నెల 28తో కర్ఫ్యూ ముగియనున్న నేపథ్యంలో కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించి పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.
అమరావతిలో 8 వరకు లాక్డౌన్
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లాక్డౌన్ విధించారు. అమరావతిలో విధించిన లాక్డౌన్ను మార్చి 8 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అకోలా, అకోట్, ముర్జీత్పుర్లలో సైతం ప్రజలు తప్పనిసరిగా లాక్డౌన్ నియమాలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. ఇక్కడ మార్చి 5, 6 తేదీల్లో పరిస్థితిని సమీక్షించిన అనంతరం తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని అధికారులు వివరించారు.