
బిజినెస్
వాణిజ్యాన్ని కొనసాగించాల్సిందే
రాజీవ్ బజాజ్
ముంబయి: చైనాతో భారత్ వాణిజ్య సంబంధాలు కొనసాగాల్సిన అవసరం ఉందని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ముడిసరుకు ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడ నుంచి తెప్పించుకోవాలని అన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పుణె ఇంటర్నేషనల్ సెంటర్లు సంయుక్తంగా వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన ఆసియా ఎకనమిక్ డైలాగ్- 2021 సమావేశంలో మాట్లాడుతూ పై విషయాలు వెల్లడించారు. ‘మనది ఓ అంతర్జాతీయ కంపెనీగా అనుకోవాలి. కార్యకలాపాలపరంగా ఆ కోణంలోనే ఆలోచించాలి. ప్రపంచవ్యాప్తంగా డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, సరఫరాదార్లు ఉండటం అవసరం. అందుకే చైనాతో వ్యాపారం కొనసాగించాలని తాను భావిస్తున్నాన’ని ఆయన పేర్కొన్నారు. ‘చైనా లాంటి ఓ పెద్ద దేశాన్ని, ఓ పెద్ద విపణిని పక్కకుపెట్టి మన వ్యాపారాలను నిర్వహిస్తే ఒకానొక సమయంలో ఏదో కోల్పోయిన సంగతి మనం గుర్తిస్తాం. ఆ నష్టం మనపై ప్రభావం చూపే అవకాశమూ ఉంద’ని బజాజ్ అభిప్రాయపడ్డారు. దేశీయంగా, అంతర్జాతీయ విపణులకు సరఫరా చేయాల్సిన ఉత్పత్తులకు అవసరమయ్యే విడిభాగాలను దేశీయ విపణిలో రాత్రికి రాత్రే తయారుచేయడం వీలవుతుందా అని ఆయన ప్రశ్నించారు. అందువల్ల ప్రస్తుతమున్న సరఫరా వ్యవస్థను కొనసాగించడం ముఖ్యమని తెలిపారు.