
బిజినెస్
విశాఖ హిందుస్థాన్ షిప్‌యార్డులో 5 ఎఫ్ఎస్వీల నిర్మాణం
ప్రాజెక్ట్ వ్యయం రూ.11,000- 14,500 కోట్లు
టర్కీ షిప్ బిల్డింగ్ సంస్థ అనడోలు సాంకేతిక సాయం
ఈనాడు-దిల్లీ
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్ఎస్ఎల్)లో 5 పెద్ద ఫ్లీట్ సపోర్ట్ వెసెల్స్ (ఎఫ్ఎస్వీలు) నిర్మించేందుకు భారత నావికా దళం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2021 ఆఖరుకు తొలి ఎఫ్‌ఎస్‌వీ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ 5 ఎఫ్ఎస్వీల నిర్మాణ వ్యయం సుమారు రూ.10,782-14,496 కోట్లుగా ఉంటుందని అంచనా. నిర్మించబోయే వెసెల్స్ 230 మీటర్ల పొడవుతో, 45,000 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఎఫ్ఎస్వీలు సాధారణంగా నావికా యుద్ధ నౌకలకు ఇంధనం, ఇతర సామగ్రిని తీసుకెళుతుంటాయి.
టర్కీ సాంకేతికత
ఎఫ్ఎస్వీల నిర్మాణం కోసం టర్కీలోని షిప్ బిల్డింగ్ సంస్థ అనడోలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించబోతోంది. 2020 మార్చిలోనే హెచ్ఎస్ఎల్ సదరు సంస్థతో సాంకేతిక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ సంస్థతో పాటు దేశీయ విక్రేతలు కూడా ఈ ఎఫ్ఎస్వీల నిర్మాణంలో పాలుపంచుకోబోతున్నారు.
* అనడోలు షిప్‌యార్డ్ ఒప్పందం అధికారికంగా ప్రారంభం కావడానికి భారత నావికాదళం నుంచి ఆర్డర్ రావాల్సి ఉంటుంది. 2021 అక్టోబరు నాటికి ఇది వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
* భారత నావికా దళానికి తొలి ఎఫ్ఎస్వీని, నిర్మాణం మొదలైన 4 ఏళ్లలో అందించేందుకు హెచ్ఎస్ఎల్ రంగం సిద్ధం చేస్తోంది. ఆ తరవాత ప్రతి 12 నెలలకు ఒకదాని చొప్పున మిగతా ఎఫ్ఎస్వీలను అందించనుంది.
* సంప్రదాయ ప్రాజెక్టులకు భిన్నంగా ఈ 5 ఎఫ్ఎస్వీల నిర్మాణం జరగబోతోంది. ప్రారంభ దశ నుంచే టర్కీ సంస్థ సాంకేతికతను అందించడమే కాకుండా అయిదింటిని పూర్తి చేయనుంది. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి బలం చేకూర్చేలా టర్కీ ఇంజినీర్లు ఈ ప్రాజెక్టులో పని చేసేందుకు వైజాగ్ రాబోతున్నారని సమాచారం.
* ఒక పక్క భారత్-టర్కీ సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నా, మరో వైపు పాకిస్థాన్‌తో ఆ దేశానికి రక్షణ సంబంధ ఒప్పందాలున్నా, 5 ఎఫ్ఎస్వీల నిర్మాణం కోసం హెచ్ఎస్ఎల్, అనడోలు షిప్‌యార్డ్ ఒప్పందం చేసుకోవడం గమనార్హం. 2019లో జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగించాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టర్కీ అధ్యక్షుడు ఆర్ తయ్యిప్ ఎర్డోగాన్ విమర్శించడం గమనార్హం.