
బిజినెస్
దిల్లీ: ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించే ఉజ్వల పథకం కింద మరో కోటి ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే రెండేళ్లలో వీటిని అందించనున్నారు. ఇది పూర్తయితే నూరు శాతం కుటుంబాలు ఎల్పీజీని వినియోగించినట్లు అవుతుందని ఇంధన శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ పీటీఐ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉచిత గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన ప్రణాళికలు రూపు దిద్దుకుంటున్నాయని చెప్పారు. ఎల్పీజీ కనెక్షన్‌కు నామమాత్రపు ధ్రువీకరణ పత్రాలు సరిపోతాయని కపూర్ చెప్పారు. నివాస ధ్రువపత్రం కోసం ఒత్తిడి తేబోమని వెల్లడించారు.
అలాగే, గ్యాస్ వినియోగదారులు ఇకపై ఒకే డిస్ట్రిబ్యూటర్ ద్వారా కాకుండా, దగ్గర్లో ఉన్న ముగ్గురు డీలర్స్ను ఎంపిక చేసుకునే సౌకర్యం తీసుకొస్తున్నామని కపూర్ చెప్పారు. డిమాండనో, ఇతర కారణాలతోనో గ్యాస్ లేదనే సమాధానం రాకుండా ఈ వెసులుబాటు తీసుకురానున్నట్లు చెప్పారు. గడిచిన నాలుగేళ్లలో 8 కోట్ల మంది పేదలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించామనని కపూర్ చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య 29 కోట్లకు చేరిందన్నారు. రాబోయే రెండేళ్లలో కోటి కనెక్షన్ల లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్ పొందడం కష్టంగా ఉండేదని, ఇప్పుడు దాన్ని సులభతరం చేశామని చెప్పారు. ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో ఉజ్వల యోజన పథకాన్ని 2016 మేలో తీసుకొచ్చారు. తొలుత 5 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు వీటిని అందజేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 2018లో దాన్ని 8 కోట్లకు పెంచారు.