close

Published : 18/01/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మార్కెట్లపై కరోనా ఒత్తిడి

స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు
పలు దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్‌లు, కఠిన నిబంధనలు
రక్షణాత్మక రంగాలపై మదుపర్ల చూపు
కంపెనీల త్రైమాసిక ఫలితాలు.. గిరాకీపై వ్యాఖ్యలూ కీలకం
విశ్లేషకుల అంచనాలు

ఐరోపా నుంచి చైనా వరకు అంతర్జాతీయంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక రికవరీ అంచనాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు నష్టభయం తక్కువగా ఉండే రంగాల వైపు వెళ్లవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా కొవిడ్‌ టీకా పంపిణీ ప్రారంభం కావడం సానుకూలాంశం. కార్పొరేట్‌ కంపెనీల డిసెంబరు త్రైమాసిక ఆర్థిక ఫలితాలూ కీలకం కానున్నాయి. గిరాకీపై ఆయా సంస్థల యాజమాన్యాలు చేసే వ్యాఖ్యలు, అంచనాలను బట్టి ఎంపిక చేసిన స్క్రిప్‌లు, రంగాల్లో కదలికలు కనిపించవచ్చని ట్రేడర్లు అంటున్నారు. వినియోగదారు, వ్యాపార సెంటిమెంటు ఇటీవల మెరుగుపడింది. నిఫ్టీ-50కి ఈ వారం 14,650 వద్ద నిరోధం; 14,350 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఉద్దీపన ప్యాకేజీ పరిణామాలనూ మదుపర్లు గమనించవచ్చు. ఈ వారం ప్రకటితమయ్యే బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ఫలితాల నుంచి మదుపర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
* ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ వారం స్థిరీకరణకు గురికావొచ్చు. అంతర్లీనంగా సానుకూతలు కనిపించవచ్చు. అప్‌స్ట్రీమ్‌ కంపెనీలతో పోలిస్తే రిఫైనరీ కంపెనీల షేర్లు బలంగా కదలాడవచ్చు.
* ప్రయాణికుల వాహన ధరలను కంపెనీలు పెంచే అవకాశం ఉన్నందున వాహన కంపెనీల షేర్లు  లాభాల బాట పట్టొచ్చు. త్వరలో వెలువడే తుక్కు విధాన ప్రకటన, వాహన రంగానికి ప్రకటించబోయే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంపై మదుపర్లు దృష్టి సారించవచ్చు.
* ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు కీలక సూచీల నుంచి సంకేతాలను అందిపుచ్చుకోవచ్చు. ప్రపంచవ్యాప్త  రికవరీ అంచనాలు ప్రభావం చూపవచ్చు. రక్షణాత్మకం కనుక ఈ రంగం మదుపర్లను ఆకర్షించవచ్చు.
* లోహ కంపెనీలకు సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఈ వారం ఫలితాలు ప్రకటించనున్న హిందుస్థాన్‌ జింక్‌(బుధ), జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌(శుక్ర), జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌(గురు)లపై మార్కెట్‌ దృష్టిసారించవచ్చు. ధరలు పెరగడంతో ఉక్కు కంపెనీలు రాణించవచ్చు.  
* టెలికాం కంపెనీల షేర్లు సానుకూలంగా కదలాడొచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకునేందుకు ఇవి టారిఫ్‌లు పెంచాలని చూస్తున్నాయి. గత వారం 11% మేర పెరిగిన భారతీ ఎయిర్‌టెల్‌ షేరు ఈ వారం కూడా లాభాలు కొనసాగించొచ్చు.  
* యంత్ర పరికరాల షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి ట్రేడవవచ్చు. ఎల్‌ అండ్‌ టీ, భెల్‌, సీమెన్స్‌ ప్రకటించే అక్టోబరు-డిసెంబరు ఫలితాలు, ఆయా కంపెనీల యాజమాన్యాలు చేసే వ్యాఖ్యల ఆధారంగా ఈ రంగంలోకి కొనుగోలుదార్లు అడుగుపెట్టొచ్చు.
* కొద్ది వారాలుగా కీలక సూచీలకు అనుగుణంగా రాణిస్తున్న సిమెంటు కంపెనీల షేర్లు కొంత దిద్దుబాటుకు గురికావొచ్చు. ముడి పదార్థాల ధరలు పెరగడంతో  కంపెనీల లాభదాయకత ఒత్తిడిలో ఉండడం ప్రతికూలాంశం.
* అంతర్జాతీయంగా కరోనా కేసులు పెరుగుతున్నందున ఔషధ వంటి రక్షణాత్మక షేర్లు రాణించవచ్చు. డిసెంబరు త్రైమాసికంలో బలమైన ఫలితాలు నమోదు చేయవచ్చన్న అంచనాలూ ఉపకరిస్తాయి.
* ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌(మంగళ), ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌(బుధ), మైండ్‌ ట్రీ(సోమ) వంటి మధ్య స్థాయి ఐటీ కంపెనీలు ఆర్థిక ఫలితాల నేపథ్యంలో వెలుగులోకి రావొచ్చు. ఇవీ రాణిస్తాయని అంచనా.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని