close

Updated : 15/01/2021 11:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మళ్లీ కొరడా తీసిన ట్రంప్‌..!

చైనా దిగ్గజ కంపెనీలపై కఠిన ఆంక్షలు

బైడెన్‌కు సవాలే

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

మరో ఐదు రోజుల్లో అధికారం అప్పగించనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చివర్లో చైనాకు షాకుల మీద షాకులిస్తున్నారు.  తన ఓటమికి కారణాల్లో చైనా కూడా ఒకటని ఆయన బలంగా నమ్ముతున్నారు. దీంతో ఆయన వ్యూహాలు రెండువైపులా పదునున్న కత్తిని తలపిస్తున్నాయి.  పదవి నుంచి దిగే సమయంలో చైనా కంపెనీలను ఆయన లక్ష్యంగా చేసుకొన్నారు. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ దాదాగిరీ చేసినందుకు ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. తొమ్మిది చైనా కంపెనీల్లో అమెరికా పెట్టుబడులపై నిషేధం విధించారు. అంతేకాదు పలువురు కీలక వ్యక్తులపై కూడా ఆంక్షలు విధించారు. చైనా కంపెనీలకు మాత్రం కీలకమైన టెక్నాలజీ అందడం ఇక ముందు మరింత కష్టంగా మారనుంది. ఇప్పటి వరకు కాబోయే అధ్యక్షుడు జోబైడెన్‌ దీనిపై స్పందించలేదు. 2016 ఎన్నికల్లో జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ ఒబామా కూడా ఇటువంటి ఆంక్షలను గతంలో విధించారు. ఇప్పుడు ట్రంప్‌ అదే శైలిని అనుసరిస్తున్నారు.

ఏమి జరిగింది..?

చైనా నేషనల్‌ ఆఫ్‌షోర్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (నూక్‌) అనే ప్రభుత్వ రంగ సంస్థ దక్షిణ చైనా సముద్ర జలాల్లో చమురు అన్వేషించే పొరుగుదేశాలను వేధిస్తోందని అమెరికా వెల్లడించింది. ముఖ్యంగా వియత్నాం వంటి దేశాలు దీని బాధితులని పేర్కొంది. చైనా సైన్యం తరఫున ఇది సముద్ర జలాల్లో దాదాగిరి చేయడం.. కృత్రిమ ద్వీపాల నిర్మాణానికి సహకరించడం వంటివి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో గురువారం అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ ‘ఎంన్టిటీ లిస్ట్‌’లో చేర్చింది. ఇక అమెరికా సంస్థల నుంచి ఎటువంటి పరికరాలు, టెక్నాలజీని పొందాలన్నా లైసెన్స్‌ సంపాదించడం కష్టంగా మారుతుంది. దీంతో దీనిని ఎస్‌అండ్‌పీ డోజోన్స్‌ సూచి నుంచి ఫిబ్రవరి 1 కంటే ముందే తొలగించనున్నారు. 
ఇది జరిగిన కొన్ని గంటలకే షావోమి కంపెనీని చైనా సైన్యంతో సంబంధాలున్న కంపెనీల జాబితాలో చేర్చింది. తాజాగా తీసుకొన్న నిర్ణయంతో అమెరికా పెట్టుబడి దారులు షావోమి సెక్యూరిటీలను కొనడం, పెట్టుబడులు పెట్టడం చేయలేరు. ఈ సంస్థ గతేడాది మూడో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీగా నిలిచింది. అప్పటి వరకు ఆస్థానంలో ఉన్న యాపిల్‌ను వెనక్కి నెట్టింది. ఈ రెండిటితోపాటు మరో ఏడు కంపెనీలను కూడా ఈ జాబితాలో పెట్టింది. స్కైరిజోన్‌ను మిలటరీ ఎండ్‌యూజర్‌ లిస్ట్‌లో చేర్చింది. మైక్రోఫాబ్రికేషన్ ఎక్విప్‌మెంట్‌ ఐఎన్‌సీ, లూకుంగ్‌ టెక్నాలజీస్‌ కార్ప్‌,  బీజింగ్‌ ఝాన్‌గ్వాంకన్‌ డెవలప్‌మెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సెంటర్‌, గోవిన్‌ సెమీకండక్టర్స్‌, గ్రాండ్‌ చైనా ఎయిర్‌కో లిమిటెడ్‌, గ్లోబల్‌టోన్‌  కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, చైనా నేషనల్‌ ఏవియేషన్‌ హోల్డింగ్స్‌పై కూడా ఆంక్షలు విధించింది.

ఆ మూడు ఈసారికి తప్పించుకొన్నాయి..

2015లో షీజిన్‌పింగ్‌ దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రదేశాలను సైనికీకరణ చేయబోమని నాటి అమెరికా అధ్యక్షుడికి మాట ఇచ్చారు. కానీ, ఆ తర్వాత దానిని గాలికొదిలేశారు. దీంతో అమెరికా ఆంక్షలు విధిస్తోంది. గతంలో కూడా హువావే, కమర్షియల్‌ డ్రోన్లను విక్రయించే డీజేఐ వంటి దిగ్గజాలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. తాజాగా నూక్‌, షావోమిలు కూడా వీటిలో చేరాయి. చైనా సైనిక ఆధునికీకరణకు అమెరికా ఇన్వెస్టర్లు సాయం చేయకుండా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు. 

ఇక అలీబాబా, టెన్సెంట్‌, బైడూలను కూడా ఈ జాబితాలో చేర్చాలని అమెరికా డిఫెన్స్‌, స్టేట్‌ డిపార్ట్‌మెంట్లు తీవ్రంగా ప్రయత్నించాయి. కానీ, అమెరికా ట్రెజరీ సెక్రటరీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీటిని వదిలేశారు. ఈ మూడు టెక్‌ కంపెనీలు కూడా జాబితాలోకి చేరితే.. చైనాకు ఎదురుదెబ్బగా నిలిచేది.

కొత్త నిబంధనలు సిద్ధం..

మరోపక్క ట్రంప్‌ సర్కారు చైనా నుంచి దిగుమతులపై కొత్త నిబంధనలను సిద్ధం చేసింది. ఇవి సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ విభాగాలకు వర్తిస్తాయి. చైనా నుంచి దిగుమతి చేసేకొనే ఏదైనా టెక్నాలజీ అనుమానాస్పదంగా ఉంటే దానిని బ్యాన్‌ చేసే అధికారం అమెరికా వాణిజ్యశాఖకు కట్టబెట్టింది. టెలికం, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లను దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనలు తయారు చేసింది. వినియోగదారుల డేటాను సేకరించే చైనా యాప్‌లకు కూడా ఇది వర్తిస్తుంది.

బైడెన్‌కు ఇబ్బందే..

జాతీయ భద్రతను చూపించి ఈ కంపెనీలపై ట్రంప్‌ ఆంక్షలు విధించారు. చైనాతో సంబంధాలు మెరుగుపర్చుకోవాలని ఉత్సాహంతో ఉన్న బైడెన్‌కు ఇది కళ్లెం వేస్తుంది.  ఫలితంగా కొత్తగా పదవి చేపట్టాక బైడెన్‌ ఈ ఆంక్షలు తొలగిస్తే.. ‘అదిగో చూడండి బైడెన్‌ చైనా మిత్రుడు..!’ ‘హంటర్‌ బైడెన్‌ కోసం ఆంక్షలు తొలగిస్తున్నారు’ అని ఇరుకున పెట్టొచ్చు. దీంతో బైడెన్‌ కూడా వెంటనే వీటి జోలికి వెళ్లకపోవచ్చు. 

చైనా ఉచ్చు నుంచి బయటకు లాగుతాము..

బీద దేశాలకు ఎడాపెడా రుణాలు మంజూరు చేసి అప్పుల ఊబిలోకి లాగడం చైనా స్టైల్‌. ఆ తర్వాత మెల్లిగా ఆ దేశాల భూభాగాలను తన ఆధీనంలోకి తెచ్చుకొంటుంది. లాటిన్‌ అమెరికా దేశమైన ఈక్వెడార్‌ ఇలానే రుణ ఉచ్చులో చిక్కుకుపోయింది. ది యూఎస్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఈక్వెడార్‌తో ఒక ఒప్పందం చేసుకొంది. దీంతో చైనా ఇచ్చిన బిలియన్ల డాలర్ల రుణాలు తిరిగి చెల్లించే అవకాశం వచ్చింది.


ఇవీ చదవండి

జో బైడెన్‌ కీలక ప్రతిపాదన
ట్రంప్‌ ఖాతాను నిషేధించడం సరైనదే

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని