close
 • మూడు రోజుల విరామం అనంతరం హైదరాబాద్‌లో టీకా పంపిణీ ప్రక్రియ పునః ప్రారంభం కావడంతో వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. ఎలాగైనా టీకా వేయించుకుని తీరాలనే క్రమంలో కింగ్‌కోఠి ఆస్పత్రి వద్ద కొందరు గేటు తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు.
 • ఇక్కడ కన్పిస్తున్న రెండు చిత్రాలు జమ్మూకు సంబంధించినవే. నిత్యావసరాల కోసం అధికారులు కరోనా ఆంక్షల్ని కాస్త సడలించగానే ఓ కూరగాయల మార్కెట్లో భారీగా జనం గుమిగూడారు. ఆ తరువాత కాసేపటికి మళ్లీ లాక్‌డౌన్‌ అమలు చేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.
 • కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అంతా మాస్కులు ధరించాలని పిలుపునిస్తూ శాన్‌ఫ్రాన్సిస్కోలో భారీ మాస్క్‌ను ఓ వ్యక్తి తన ఇంటికి కట్టారు.
 • మెక్సికోలో ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని మెక్సికో సిటీలో మెట్రో వంతెన కూలిపోవడంతో రైలు కిందపడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి.
 • ఏపీలో కరోనా కట్టడికి ఆంక్షలు విధించారు. త్వరలో లాక్‌డౌన్‌ విధిస్తారనే పుకార్లను నమ్మి కొందరు నగదు నిల్వల కోసం బ్యాంకుల బాట పడుతున్నారు. దీంతో బ్యాంకుల వద్ద తీవ్ర రద్దీ నెలకొంటోంది. ఎంతో కొంత సొమ్ము చేతిలో పడితే చాలనే ఆలోచనలో జాగ్రత్తలు పాటించాలనే విషయం మరచిపోతున్నారు. కర్నూలులోని బుధవారపేటలో ఓ బ్యాంకు వద్ద ఖాతాదారులు ఇలా బారులుతీరారు.
 • ఈ చిత్రంలో కన్పిస్తున్న మహిళ ఆటో ఎక్కడం కోసం చెయ్యెత్తి నిలబడిందని అనుకుంటే పొరబడ్డట్లే. ఆటోవాలాలు, ద్విచక్ర వాహనదారులు, పాదచారుల దాహార్తి తీర్చేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నం ఇది. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో శ్రీమాత సేవా సమితి సభ్యులు మజ్జిగ, మంచినీరు, మాస్కులు ఇలా పంపిణీ చేస్తూ కనిపించారు. వారి సేవలను పలువురు అభినందించారు.
 • ఈ చిత్రంలో కన్పిస్తున్న వృద్ధురాలి పేరు ఇందిర. కొద్దిరోజుల క్రితం కొవిడ్‌ బారినపడటంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. ఆమె కోసం కుటుంబం మొత్తం హైదరాబాద్‌లోని ఫుట్‌పాత్‌లపై నిరీక్షించింది. ఇప్పుడు వారి స్వగ్రామమైన వరంగల్‌ జిల్లా ఎల్కుర్తి వెళ్దామనుకుంటే ఊరి జనం రానీయడం లేదు. నెల రోజుల పాటు ఇక్కడే ఉండాలని హుకుం జారీ చేయడంతో గాంధీ ఆస్పత్రి ఎదుటకు చేరారు. అధికారులు ఎవరైనా స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
 • హైదరాబాద్‌లో రెండో డోసు వ్యాక్సిన్‌ కోసం టీకా కేంద్రాలకు వచ్చిన వృద్ధులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని సోమవారం కింగ్‌కోఠి ఆస్పత్రికి పలువురు వృద్ధులు వచ్చారు. పది గంటలైనా సిబ్బంది ఎవరూ రాకపోవడంతో వాకబు చేయగా.. టీకా వేయడం లేదని తెలిసింది. దీంతో ఇలా ఇళ్లకు తిరుగు పయనమవుతూ కనిపించారు.
 • హైదరాబాద్‌ చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచే మొజంజాహీ మార్కెట్‌ కట్టడం సోమవారం సాయంత్రం కురిసిన వర్షపునీటిలో ఇలా అందంగా కనిపిస్తోందని అనుకుంటే పొరపాటే. వారం రోజులుగా అక్కడ ఓ డ్రైనేజీ పొంగిపొర్లుతోంది. పట్టించుకునే వారు లేకపోవడంతో రోడ్డంతా మురుగునీరు పరుచుకుంది.
 • ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ నల్గొండ జిల్లా చింతపల్లి రైతులు నాగార్జునసాగర్ హైవేపై ధాన్యాన్ని పోసి నిప్పంటించి ఆందోళన తెలిపారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినా కొనుగోళ్లు చేయడం లేదంటూ కర్షకులు రాస్తారోకో నిర్వహించారు.
 • ఎరుపు వర్ణంలో విరబూసిన గుల్‌మొహర్‌ పూలు ఆకట్టుకుంటున్నాయి. మహబూబ్‌నగర్‌ నుంచి హన్వాడకు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు కొన్ని నిండుగా పూలు పూసి కనువిందు చేస్తున్నాయి. ఆ మార్గంలో ప్రయాణించే వారికి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రకృతి ప్రేమికులను కనులు తిప్పనివ్వడం లేదు. ఆ దృశ్యాన్ని ‘ఈనాడు’ కెమెరా క్లిక్‌ మనిపించింది.
 • తిరుపతి ఎస్వీ తారకరామ మైదానం వద్ద సోమవారం కన్పించిన పొడవాటి తోక ఉన్న ఈ గొర్రెలు, పొట్టేళ్లను మేకలదొడ్డి బాషా అనే వ్యాపారి హైదరాబాదు నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చారు. వింతగా, సరికొత్తగా ఉన్న వీటిని నగరవాసులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. గొర్రెలకు సాధారణంగా తోక బెత్తెడు ఉంటుంది. చిన్న చెవులు, కొమ్ములతో కన్పిస్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌ , దిల్లీకి చెందిన కొన్ని రకాల గొర్రె జాతులకు పొడవాటి తోకతో ఉంటాయని పశుసంవర్ధకశాఖకు చెందిన అధికారులు తెలిపారు.
 • కన్నీటి కష్టాలకు పొదిలి పెట్టింది పేరు. ప్రకాశం జిల్లా నడి మధ్యనున్న ఈ ప్రాంతంలో తరచూ నీటి ఎద్దడి పరిస్థితులు తలెత్తుతుంటాయి. అన్నవరం గ్రామంలో నీటి పైపులైనుకు చిన్నపాటి లీకు ఏర్పడింది. దీని నుంచి వృథాగా పోతున్న నీటిని పైపు ద్వారా పట్టుకుంటున్నారు. సన్నగా వస్తున్న ధారతో ఓ బిందె నిండాలంటే గంటలు తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. అయినా గొంతులు తడుపుకొనేందుకు తమకు ఈ అవస్థలు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 • కరోనా వార్డుల్లో విధుల్లో ఉన్న సిబ్బంది కొందరు తాము ధరించిన పీపీఈ కిట్లను ఆరుబయట ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. దీని వల్ల వైరస్‌ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని భయాందోళన వ్యక్తమవుతోంది. విశాఖ కేజీహెచ్‌ కొవిడ్‌ వార్డు, ప్రభుత్వ ఛాతి ఆసుపత్రుల పరిసర ప్రాంతాల్లో వాడేసిన పీపీఈ కిట్లు, ఇతర వైద్య సామగ్రి కనిపిస్తున్నాయి. వాటిని చూసి రోగుల బంధులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
 • కరోనా విలయంతో మృత్యువాత పడుతున్నవారికి పాపులర్‌ ఫ్రంట్ ప్రతినిధులే దిక్కవుతున్నారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు కరోనాతో నెల్లూరులో ఆదివారం మృతి చెందగా.. మృతదేహానికి సోమవారం ఫ్రంట్‌ ప్రతినిధులు అంత్యక్రియలు పూర్తిచేసి మానవత్వం చాటుకున్నారు.
 • ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో తాగునీటి సమస్య తలెత్తుతోంది. ఇదే సమయంలో నెలరోజులుగా ఆత్కూరు క్రాస్‌ రోడ్డు వద్ద మిషన్‌ భగీరథ పథకం పైపులైను లీకై తాగునీరు వృథాగా పోతోంది. లీకేజీని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ నీటితో తమ దాహార్తిని తీర్చుకునేందుకు ఓ చిన్నారి మగ్గుతో బకెట్టులోకి ఎత్తిపోస్తోంది. మండుటెండలో సైతం నీటిని ఎత్తిపోస్తున్న దృశ్యాన్ని సోమవారం ‘న్యూస్‌టుడే’ తన కెమెరాలో బంధించింది.
 • ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు లాలూ నాయక్‌. నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ సమీపంలోని వెల్కంబాయి తండా. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. భార్య అనారోగ్యంతో మృతి చెందారు. కొడుకు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతనికి భారం కాకూడదని కోఠి చౌరస్తాలో మండే ఎండల్ని భరిస్తూ.. ఆసరాగా విభాగినికి మధ్యలో కవర్లు కట్టుకొని యాచిస్తూ జీవిత చరమాంకాన్ని భారంగా లాగిస్తున్నాడు.
 • మహమ్మారి బాధితుల సమస్యలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన ఈ వృద్ధురాలికి వైరస్‌ సోకడంతో సోమవారం కింగ్‌కోఠి ఆస్పత్రికి వచ్చారు. కుమారుడు పడక వెతుకులాటకు లోపలికి వెళ్లగా గంటన్నర నుంచి ఆమె వాహనంలోనే ఉండిపోయారు.
 • కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాల్లో చాలాచోట్ల మౌలిక వసతులు లేక అనుమానితులు అష్టకష్టాలు పడుతున్నారు. హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి పరీక్ష కేంద్రానికి బారులు తీరే మార్గంలో చెట్లు ఉండడంతో ఇలా నీడన నిలబడుతున్నారు.
 • ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్న కరోనా బాధితులకు వేసే రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల లభ్యత బయట ఎలా తయారైందో తెలిసిందే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం వైద్యుల సూచన మేరకు అవసరమున్న వారికే వేస్తున్నారు. కోఠి వైద్యవిధాన పరిషత్‌ ఆస్పత్రిలో ఆ ఇంజెక్షన్లను సోమవారం సిబ్బంది ఇలా తీసుకెళ్లారు.
 • ప్రభుత్వం ఇంటర్‌ పరీక్షలు వాయిదా వేయడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి విజయవాడలో చదువుకుంటున్న విద్యార్థులు సొంత ఊళ్లకు బయలుదేరారు. దీంతో రైల్వే స్టేషన్, బస్టాండు రద్దీగా మారాయి. బస్టాండులో సామాన్లు భద్రపరచుకునే గదులు సరిపడినన్ని లేకపోవడం.. ఉన్న రెండు క్లాక్‌రూమ్‌లు నిండిపోవడంతో ఇలా బయటే బ్యాగులు పడేసి చీటీలు ఇస్తున్నారు.
 • ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నా మందుబాబులకు మాత్రం అది పట్టడం లేదు. కొవిడ్‌ ఉద్ధృతితో ఎంతో మంది బాధితులుగా మారుతున్నా మద్యం కోసం ఇలా భౌతికదూరం మరిచి, కిక్కిరిసిన క్యూలైన్లలో నిలబడుతున్నారు. విజయవాడ బీఆర్టీఎస్‌ రోడ్డులో ఓ దుకాణం ముందు ఇదీ పరిస్థితి.
 • ఆదిలాబాద్‌ పట్టణంలో నెంబరు ప్లేట్లు లేకుండా, సరిగ్గా నెంబర్లు కనిపించకుండా తిరుగుతున్న వాహనాలపై పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పొరుగు మహారాష్ట్ర నుంచి నెంబరు బోర్డులను మార్చి ఇటువైపు వస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇటీవల ఉమ్మడి జిల్లాలో ఒకే నెంబర్‌ బోర్డులతో ఉన్న రెండు వాహనాలు కనిపించడం చర్చనీయాశంగా మారింది. ఒకవేళ ఇటువంటి వాహనాలతో ప్రమాదాలు జరకముందే .. సంబంధిత అధికారులు ప్రత్యేక తనిఖీలు చేయాలని పట్టణవాసులు కోరుకుంటున్నారు.
 • 2016 ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా గెలిచిన కోడలు గుండు అశ్రితారెడ్డిని హత్తుకుంటున్న రాష్ట్ర మహిళా ఆర్థిక సంస్థ ఛైర్మన్‌ గుండు సుధారాణి. నేడు జరిగిన ఎన్నికల్లో గెలుపొంది వరంగల్‌ మేయరు రేసులో ఉన్న సుధారాణిని హత్తుకొని అభినందిస్తున్న అశ్రితారెడ్డి.
 • ఆదివారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నం బచ్చుపేట ప్రాంతం నుంచి అనారోగ్యంతో ఉన్న శ్రీనివాసు అనే వ్యక్తిని అతని కుమారుడు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. పడకలు లేవని.. వేచి ఉండమని చెప్పడంతో అదే ఆవరణలోనే ఉన్నారు. సోమవారం ఉదయం ఊపిరాడక ఇబ్బందిపడుతున్న తండ్రి ఆవేదన చూడలేక వైద్యులు ఎవరైనా బయటకు వచ్చి తన తండ్రిని చూడాలని వేడుకున్నా ఫలితం కనిపించలేదు. అప్పటివరకు మాట్లాడిన తండ్రి ఒక్కసారిగా ఉలుకుపలుకు లేకుండా ఉండటంతో ‘నాన్నా మాట్లాడు.. నీళ్లు తాగు’ అని కుమారుడు విలపిస్తుండగా అక్కడే ఉన్న రెడ్‌క్రాస్‌ వాలంటీరు వచ్చి గుండెపై అదిమి చూసి ప్రాణం పోయిందని చెప్పాడు.
 • విశాఖ ఎన్‌ఏడీ కూడలికి చెందిన మధు అనే యువకుడి తండ్రిని కేజీహెచ్‌ కొవిడ్‌ వార్డులో చేర్చారు. అతను తండ్రికి అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వార్డు బయట గుడారం ఏర్పాటు చేసుకుని ఇలా నిరీక్షిస్తూ కనిపించాడు.
 • మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో బెలూన్‌ తరహా గుడారంలో తాత్కాలికంగా నిర్మిస్తున్న కొవిడ్‌ కేర్‌ సెంటర్‌.
 • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించిన సందర్భంగా కరుణానిధి చిత్రంతో తయారు చేసిన 70 కిలోల ఇడ్లీతో ఆ పార్టీ కార్యకర్తలు ఇలా సంబురాల చేసుకున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు