ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime
close
 • డ్రోన్‌ కెమెరాలతో అధికారులు పోలవరం ప్రాజెక్టును ఫొటోలు తీశారు. చుట్టూ కొండలు, పచ్చదనంతో ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.
 • బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌-క్యారీ జాన్సన్‌, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌-జిల్‌ బైడెన్‌ జంటలు ఇంగ్లాండ్‌లో సందడి చేస్తున్నాయి. జీ7 సదస్సు సందర్భంగా వీరంతా ఇంగ్లాండ్‌లోలోని కార్న్‌వాల్‌కు వెళ్లారు.
 • సాధారణంగా కుండీల్లో మట్టి వేసి అందులో మొక్కలను పెంచుతాం. కానీ ఇక్కడ వేలాడుతున్న మొక్కలకు మట్టి అవసరం లేదు. తాళ్లతో వేలాడదీసి నీటిని చల్లితే బతికేస్తాయి. దాంతో పాటు స్వచ్ఛమైన గాలిని కూడా ఇస్తాయి. కడియం నర్సరీలో ఈ మొక్కలను పెంచుతున్నారు.
 • కరోనా వేళ ముఖానికి, చేతులకు, కాళ్లకు కనీస రక్షణ తొడుగులు లేకుండా పారిశుద్ధ్య కార్మికులు 15 అడుగుల లోతున్న మ్యాన్‌హోళ్లలో దిగి ప్రమాదకరంగా పని చేస్తున్నారు. రాజమహేంద్రవరం గోదారిగట్టు రోడ్డులో కనిపించిన దృశ్యాలివి.
 • కరోనా విజృంభణ నేపథ్యంలో చిన్నారులకు ఊళ్లో కంటే.. పంట పొలాల్లోనే రక్షణ ఎక్కువ. ఈ ఆలోచనతోనే ఆదిలాబాద్‌ గ్రామీణ ప్రాంతమైన తంతోలిలో ఓ వ్యక్తి మంచాన్నే ఊయలగా చెట్టుకు కట్టారు. దీంతో ఒకేసారి నలుగురు చిన్నారులు ఊయల ఊగుతూ ఆనందంగా గడుపుతున్నారు.
 • చూసేందుకు అచ్చం మునక్కాయల్లా కనిపిస్తున్న వీటిని ఆక్సిజన్ మొక్కలు అంటారు. దీని శాస్త్రీయ నామం సెన్స్‌వేరియా సిలిండ్రికా. కడియం నర్సరీలో కనిపించిన ఈ మొక్కలు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. ఇటీవలి కాలంలో చాలా మంది ఇళ్లల్లో పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మొక్కలను మనకు నచ్చిన విధంగా అల్లుకుని చివరన ఇలా రిబ్బన్లతో ముడి వేసుకోవచ్చు.
 • తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నగర పాలక సంస్థ ఇనుప వ్యర్థాల నుంచి అందమైన కళాఖండాలను తీర్చిదిద్దింది. ఇందులో భాగంగా జైల్‌రోడ్‌లోని ఫుట్‌పాత్ పై ఏర్పాటు చేసిన గుర్రం బొమ్మ ఆకట్టుకుంటోంది. ఈ బొమ్మ నోటికి దగ్గరే మొక్క ఉండటంతో దూరం నుంచి చూసేవారికి ఇది ఆ మొక్కను మేస్తుందేమో అన్నట్లు భ్రమ కలిగిస్తోంది.
 • సినీ నటుడు గోపిచంద్‌ జన్మదినం సందర్భంగా ‘పక్కా కమర్షియల్‌’ సినిమాలోని ఆయన లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు.
 • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన జస్టిస్‌ ఎన్వీ రమణకు శంషాబాద్‌ విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ హిమా కోహ్లీ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు సీజేఐకు స్వాగతం పలికారు.
 • ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ పూరీ తీరంలో జగన్నాథస్వామి సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.
 • రెండు రోజుల దిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైల్వే, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశమయ్యారు. కొవిడ్‌ కారణంగా తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని కేంద్ర మంత్రికి వివరించారు.
 • సినీ నటుడు కార్తి శుక్రవారం కొవిడ్ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ ఫొటోను ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు.
 • హైదరాబాద్‌లో గురువారం చిరుజల్లులు కురవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. దీంతో ట్యాంక్‌బండ్‌పై పక్షులు హాయిగా విహరిస్తూ కనిపించాయి.
 • పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా శుక్రవారం సచివాలయం సమీపంలోని తెలుగు తల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, అంజన్ కుమార్‌ యాదవ్‌ తదితరులు ధర్నా చేశారు.
 • ఇంగ్లాండ్‌ ఫాల్‌మౌత్‌లోని సముద్రతీరంలో సామాజిక కార్యకర్తలు కొందరు జీ7 దేశాల అధినేతల వేషధారణలో కనిపించారు. టీకా కోసం నేతలు తలపడుతున్నట్లు ప్రదర్శన ఇచ్చారు. శుక్రవారం ఇంగ్లాండ్‌లో జీ7 దేశాల సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కరోనా నియంత్రణ, వాతావరణం, విదేశాంగ, ఆర్థిక విధానాలపై చర్చించనున్నారు.
 • ఆహ్లాదకరంగా కనువిందు చేస్తున్న కొండల్లోకి చేరుకునేలా కనిపిస్తున్న ఈ రైలు పట్టాలు విశాఖ రైల్వేస్టేషన్‌లోనివి. స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లను పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య సిబ్బంది నిత్యం శ్రమిస్తున్నారు. సాయంత్రం సమయంలో రైళ్లు లేకపోవడంతో 3, 4 ప్లాట్‌ఫామ్‌లు ఇలా ఆకట్టుకున్నాయి.
 • కర్నూలు జిల్లావ్యాప్తంగా తొలకరి వర్షాలు పడటంతో రైతులు తమ భూములను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే డోన్‌ తదితర ప్రాంతాల్లో దుక్కులు దున్ని విత్తనాలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. మరికొందరు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు పట్టణాలబాట పట్టారు.
 • మణుగూరు మండలంలో అటవీ ప్రాంతంలో ఉండే కంభంతోగులో వందేళ్లనాటి చింతచెట్టు ఉంది. 40 కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. ఊరి మధ్యలో ఈ చెట్టు ఉండటంతో గ్రామంలోని అందరికీ దీనిమీద హక్కు ఉంటుంది. ఏటా గ్రామస్థులంతా కలిసి చింతకాయలను సేకరిస్తారు. వచ్చిన మొత్తాన్ని అందరూ కలిసి పంచుకుంటారు. ఈసారి ప్రతీ ఇంటికి రెండు కిలోల చింతపండు వచ్చిందని గ్రామ పెద్ద గోపయ్య తెలిపారు. గ్రామానికి అంతా చింతపండు అందిస్తున్న ఈ చెట్టు కథ సామాజిక మాధ్యమాల్లో కూడా చక్కర్లు కొడుతోంది.
 • సూర్యలంక తీరం ప్రకృతి అందాలకు నెలవు. సూర్యోదయం, సూర్యాస్తమయం వేళ అరుణ కిరణాలతో ఆకాశం బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ప్రకృతి రమణీయ దృశ్యాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. నింగిలో కమ్మిన కారుమబ్బులు నీలిరంగుతో దర్శనమిస్తూ సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి.
 • గుంటూరులోని ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రంలో తన పిల్లల నోటికి ఆహారాన్ని అందిస్తున్న తల్లి కొంగలు.
 • నిర్మల్‌ పట్టణం ఏఎన్‌రెడ్డి కాలనీలో నివాసముండే మాధవీలత-సంపత్‌కుమార్‌ దంపతులు తమ ఇంటిని చక్కని మొక్కలతో పచ్చదనంగా ఉంచుతారు. వర్షాకాలం వస్తున్నందున వానలో గూడు కోసం చిన్న పక్షులు ఇబ్బంది పడతాయని నెల రోజుల ముందే ప్రత్యేకంగా వాటి కోసం మట్టితో కుండీలు తయారు చేయించారు. మెల్లిగా వాటిలోకి పిచ్చుకలు రావడం అలవాటయ్యాయి. వాళ్లింటి బాల్కనీలో కిచ్‌కిచ్‌మంటూ అవి ఎంతో సందడి చేస్తాయి. మనం ఏర్పాటు చేసిన గూడులో అవి తలదాచుకున్నప్పుడు చూస్తే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేమంటున్నారు ఆ దంపతులు.
 • విజయవాడలోని తాడిగడప నుంచి ఎనికేపాడు వెళ్లే 100 అడుగుల రోడ్డులో ఓ బహుళ అంతస్తుల భవనం బాల్కనీల్లో పచ్చని మొక్కలు అందంగా ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లేవారు భవనాన్ని ఆసక్తిగా చూస్తున్నారు.
 • ఆదిలాబాద్‌ జిల్లాలో వర్షాధారంగానే ఎక్కువగా వ్యవసాయం చేస్తారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడతాయనే ఆశతో రైతులు ఉన్నారు. వారం రోజుల కిందట కురిసిన వర్షానికి దుక్కులు దున్ని.. విత్తనాలు తెచ్చుకొని... వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. మంచి వర్షం పడితే విత్తనాలు విత్తుదామని మూడు రోజులుగా ఎదురుచూస్తున్నారు.గురువారం కురిసిన వర్షం వారికి కొండంత బలాన్నిచ్చింది. విత్తనాలు నాటుకొనేందుకు మంచి అవకాశం దొరికింది.
 • పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేట శివారులో ఈత వనాన్ని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉలి పట్టి ఈత చెట్టును గీశారు. చెట్టు నుంచి వచ్చిన కల్లును ఆకుతో పట్టుకుని రుచి చూశారు. -న్యూస్‌టుడే, మెట్‌పల్లి గ్రామీణం
 • ఈ కుర్రాడు కోతికొమ్మచ్చి ఆడుకుంటూ చెట్టు ఎక్కాడనుకుంటే.. పొరపాటే. ఆన్‌లైన్‌ తరగతులతో వచ్చిన తిప్పలు. చెట్టు మీద కూర్చొని పుస్తకం చేత పట్టుకొని, చరవాణి ద్వారా వింటూ రాసుకుంటున్న విద్యార్థి పేరు తిప్పేస్వామి. శెట్టూరు మండలం చింతర్లపల్లి. అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సాధారణంగా గదుల కొరత ఉంటే చెట్టు కింద కూర్చొని పాఠాలు వింటారు.. ఇక్కడ చెట్టెక్కి పాఠాలు వినడం ఏమిటని ఆశ్చర్యం కలగొచ్చు. ఆన్‌లైన్‌ పాఠాలు కావడంతో చెట్టంత కష్టం పడాల్సివస్తోంది. గ్రామంలో సెల్‌ నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ సక్రమంగా అందకపోవడంతో ఇలా చెట్టెక్కాల్సి వచ్చింది. మరికొందరు మిద్దెలు, గుట్టలు ఎక్కక తప్పడం లేదు. - న్యూస్‌టుడే, అనంతపురం విద్య
 • కువైట్, భారత దౌత్య సంబంధాలు 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం కువైట్‌లో సమావేశమైన ఇరు దేశాల విదేశాంగ మంత్రులు డాక్టర్‌ ఎస్‌.జైశంకర్, అహ్మద్‌ నాసర్‌ అల్‌- మహమ్మద్‌ అల్‌- సబా
 • దిల్లీలోని యమునా ఖదర్‌ మయూర్‌ విహార్‌ ప్రాంతంలో పంచశీల్‌ శిక్షణ్‌ సంస్థాన్‌ నిర్వహిస్తున్న ఓపెన్‌ ఎయిర్‌ ట్యూషన్‌ తరగతులకు హాజరైన మురికివాడల పిల్లలు
 • బ్రిటన్‌ పర్యటనలో భాగంగా గురువారం సముద్ర తీరంలోని కార్బిస్‌ బే (కార్న్‌వాల్‌)లో విహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ దంపతులు.
 • కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అనుమానితులకు ఇళ్ల వద్దే మందులు పంపిణీ చేస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌ నారాయణగూడలోని బీసీ భవన్‌లో వైద్య ఆరోగ్య సిబ్బంది మందుల కిట్లను తయారు చేస్తున్నారు. వీటిని హైదరాబాద్‌తో పాటు జిల్లాలకు వాహనాల ద్వారా తరలిస్తున్నారు. -ఈనాడు, హైదరాబాద్‌
 • బ్యాంకు వద్దకు వెళ్లి డబ్బు కట్టాలన్నా.. తీసుకోవాలన్నా మహిళలు, ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా గుంపుగా ఉంటున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు రుణాల కోసం ఒకేసారి వస్తుండడంతో రద్దీగా కనిపిస్తోంది. కానూరు ఇండియన్‌ బ్యాంకు వద్ద కనిపించిన దృశ్యమిది. -ఈనాడు, అమరావతి
 • సీఎం పర్యటన నేపథ్యంలో తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో 20 నిమిషాల పాటు ట్రాఫిక్‌ నిలిపివేశారు. దీంతో కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై నిలిచిపోయిన ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్సు. -ఈనాడు, విజయవాడ
 • కర్ఫ్యూ కారణంగా మధ్యాహ్నం 12గంటల వరకే బయట తిరగడానికి అనుమతి ఉంది. దీంతో ప్రజలు ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా తమకు కావాల్సిన ఆహారాన్ని తెప్పించుకుంటున్నారు. డెలివరీ బాయ్స్‌ తమ ఆర్డర్ల పార్సిల్స్‌ కోసం ఇదిగో ఇలా పోటీ పడుతున్నారు. -ఈనాడు, అమరావతి
 • ప్రభుత్వాసుపత్రిలో చేరాలంటే ముందుగా ఓపీ చీటీ తప్పనిసరి. మరి ఆ ఓపీ రాసే కౌంటరు ఎక్కడుందీ.. ఇదే కొవిడ్‌ ఆసుపత్రికి వచ్చిన ప్రతి రోగికీ ఎదురవుతున్న ప్రశ్న. కనీసం బోర్డు కూడా లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. తాడేపల్లి నుంచి వచ్చిన ఈ రోగికి ఓపీ రాయించడానికి వెళ్లిన బంధువులకు ఇదే పరిస్థితి ఎదురైంది. సిబ్బంది కూడా సమాధానం చెప్పేందుకు విసుక్కున్నారు. ఆస్పత్రిలో పడకలు ఖాళీగా ఉన్నా ఇచ్చేందుకు గంటకు పైగా సమయం పట్టింది. అప్పటి వరకు క్యాజువాలిటీ వద్ద బయట అంబులెన్సులోనే రోగికి ఆక్సిజన్‌ అందించారు. -ఈనాడు, విజయవాడ
 • తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు
 • ఈమె పేరు సునీత. స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా. వెండితెరపై వెలగాలన్న కలతో పదేళ్ల క్రితం హైదరాబాద్‌ తరలివచ్చారు. చిన్న చిన్న అవకాశాలు పొందారు. ఇప్పటివరకు 50 పైగా చిత్రాల్లో చిన్న వేషాలు వేశారు. కరోనా ఆమె కథను మార్చేసింది. సొంతూరికి తిరిగి వెళ్లలేక.. పొట్టకూటికి పాట్లు పడుతున్నారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో గురువారం ఇలా ఫుట్‌పాత్‌పై పుచ్చకాయలు విక్రయిస్తూ కనిపించారు.
 • కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం తప్పనిసరిగా మారింది. దీనిని పరిగణలోకి తీసుకొని ప్రజల్లో మరింత అవగాహన పెంచడానికి వరంగల్‌ నగరపాలక సంస్థ విస్తృత ప్రచారం చేపట్టింది. ఈ క్రమంలోనే బల్దియా అధికారులు హన్మకొండలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ కూడలిలో మాస్క్‌ ధరించిన ఓ పెద్ద బొమ్మను ఏర్పాటు చేశారు.
 • ఇక్కడ కనిపిస్తున్నవి నీటి కుక్కలు. శాస్త్రీయ నామం అట్టర్‌.. క్షీరద రకానికి చెందినవి. ఇప్పుడు ఇవి గుంటూరు జిల్లా ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రంలో సందడి చేస్తున్నాయి.
 • ద్విచక్ర వాహనాలపై చిన్నారులను తీసుకువెళ్లే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చైతన్యపురి వద్ద ఓ వ్యక్తి బాలుడిని బెల్టుతో తన నడుముకు కట్టుకుని స్కూటరుపై తీసుకువెళుతూ ఇలా కనిపించారు.
 • ఒకవైపు చకచకా పూర్తవుతోంది. మరోవైపు ఎదుగుబొదుగు లేకుండా అక్కడే ఆగిపోయింది. చింతల్‌కుంట వైపు నుంచి ఎల్‌బీ నగర్‌ వైపు నిర్మిస్తున్న పైవంతెన పరిస్థితి ఇది. వాహనాలు దిగాల్సిన వైపు పనుల్లో జాప్యం వల్ల ఇప్పట్లో ఇది అందుబాటులోకి వచ్చేలా లేదు.
 • బాలానగర్‌లోని నర్సాపూర్‌ చౌరస్తా పేరు చెప్పగానే కిటకిటలాడే ట్రాఫిక్‌ గుర్తుకొస్తుంది. ఆ కూడలి దాటాలంటే నరకం కన్పిస్తున్న పరిస్థితి. ఈ కష్టాలు తీర్చడానికి రూ.330 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పైవంతెన దాదాపు పూర్తికావచ్చింది. తుది మెరుగులద్దుతున్నారు.
 • మణికొండ పరిధి ల్యాంకోహిల్స్‌లోని చెరువు మొన్నటి వరకు మురుగు, గుర్రపుడెక్కతో నిండి మైదానాన్ని తలపించేది. ఇటీవల ‘ఈనాడు’లో ప్రచురితమైన చిత్రవార్తకు స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో తటాకం నీటితో కళకళలాడుతోంది.
 • లాక్‌డౌన్‌తో మూతబడ్డ చిరు వ్యాపారాలు.. గురువారం నుంచి సడలింపు సమయం పెంచడంతో తెరుచుకున్నాయి. సాయంత్రం వరకు వ్యాపారాలు కొనసాగడంతో కొంత సంతోషం వ్యక్తం చేశారు. నల్లకుంటలో చెప్పుల దుకాణం తెరిచి పనిలో నిమగ్నమైన మహిళ.
 • మలక్‌పేట రైల్వే వంతెన పనుల్లో భాగంగా భారీ ఇనుప కడ్డీని తొలగించారు. కానీ దానిని అక్కడే రోడ్డు పక్కన పడేశారు. ఇనుప కడ్డీ పూర్తిగా మొనదేలి ఉండడంతో అటుగా వెళ్లే వాహనదారులు పొరబాటున పడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
 • లాక్‌డౌన్‌ కారణంగా నగరంలోని యాచకులు తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు సంస్థలు అందించే ఆహారం వీరికి దిక్కయ్యింది. సికింద్రాబాద్‌లో ఓ సంస్థ సభ్యులు పీపీఈ కిట్లు ధరించి వృద్ధుడికి భోజన ప్యాకెట్‌ అందిస్తూ కనిపించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు