టాలీవుడ్‌కు సీఎం కేసీఆర్‌ హామీలు - GST reimbursement for below rs10crores budget movies
close
Updated : 23/11/2020 21:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాలీవుడ్‌కు సీఎం కేసీఆర్‌ హామీలు

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయిన తెలుగు చిత్రసీమకు సీఎం కేసీఆర్‌ భరోసా కల్పించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా అధికార తెరాస మేనిఫెస్టోలో టాలీవుడ్‌కు కూడా స్థానం కల్పించారు. అందులో ముఖ్యంగా..
1. రూ.10కోట్ల లోపు నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ అందించడం.
2. థియేటర్ల యాజమాన్యం రోజూవారి ప్రదర్శనల సంఖ్య పెంచుకునేందుకు వీలు కల్పించడం.
3. సినిమా టికెట్‌ ధరలో సవరణలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం.

4. థియేటర్లకు కనీస విద్యుత్తు ఛార్జీలను కూడా రద్దు చేస్తామని తెరాస ప్రకటించింది. 
వీటితో పాటు థియేటర్లను ఎప్పుడైనా తెరుచుకోవచ్చన్నారు. ఆ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు సినీ పరిశ్రమకు పూర్తి అధికారం ఇస్తున్నామని కేసీఆర్‌ చెప్పారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని సినీపెద్దలు వ్యూహాత్మకంగా ఆలోచించాలని సీఎం అన్నారు.

సీఎం కేసీఆర్‌ను పలువురు సినీ ప్రముఖులు ఈ నెల 22న (ఆదివారం) మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా తెలుగు సినీ పరిశ్రమ ఎంతగానో నష్టపోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు సీఎంను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్‌.. తెలుగు చిత్ర పరిశ్రమకు పలు హామీలు ఇచ్చారు. కరోనా దెబ్బతో తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూసిన టాలీవుడ్‌ను కాపాడుకోవటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వపరంగా రాయితీలు, మినహాయింపులు ఇస్తామని ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా తెరాస విడుదల చేసే మేనిఫెస్టోలో సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలనను ప్రస్తావిస్తామని కేసీఆర్‌ తెలిపారు.

కేసీఆర్‌కు కృతజ్ఞతలు...

తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి మద్దతుగా నిలిచిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అగ్ర కథానాయకుడు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ‘కరోనాతో కుదేలైన సినిమా రంగానికి వరాల జల్లు కురిపించిన కేసీఆర్‌ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కేసీఆర్‌ నిర్ణయాలు ఈ కష్ట సమయంలో చిత్ర పరిశ్రమకు, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకు ఎంతో తోడ్పడుతుంది. కేసీఆర్‌ నేతృత్వంలో ఆయన విజన్‌కి తగ్గట్టుగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి, దేశంలోనే మొదటి స్థానాన్ని పొందుతామన్న పూర్తి విశ్వాసం మాకుంది’ అని చిరు పేర్కొన్నారు. మరో అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌ కూడా కేసీఆర్‌కు ధన్యవాదాలు  చెప్పారు. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని చిత్ర పరిశ్రమ అధిగమించాలంటే ఈ చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.  చిరంజీవి ట్వీట్‌ను రామ్‌చరణ్‌ రీట్వీట్‌ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రతినిధులు కూడా కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ట్వీట్‌ చేశారు. థియేటర్లు రీ-ఓపెనింగ్‌కు జీవో ఇవ్వడంతో పాటు సినీ పరిశ్రమలకు లాభం చేకూర్చేలా నిర్ణయాలు ప్రకటించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ధన్యవాదాలు తెలిపింది.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని