అంతా శూన్యంలా ఉంది: సునీత - Sunitha Emotional Message
close
Updated : 29/09/2020 09:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంతా శూన్యంలా ఉంది: సునీత

భావోద్వేగానికి గురైన గాయని

హైదరాబాద్‌: ప్రముఖ గాయని సునీత భావోద్వేగానికి గురయ్యారు. గురువుగా భావించే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో అంతా శూన్యంలా మారిందని అన్నారు. ఏదో జన్మలో అదృష్టం చేసుకోవడం వల్లే బాలుగారితో పరిచయం ఏర్పడిందని, ఆయనతో కలిసి ఎన్నో పాటలు పాడే అవకాశం దక్కిందని తెలిపారు. దయచేసి ఆయన లేరని ఎవరూ అనొద్దని.. ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారని ఆమె వివరించారు. ఈ మేరకు సునీత సోషల్‌మీడియా వేదికగా ఎస్పీబాలుతో తనకున్న అనుబంధం గురించి తెలియజేస్తూ తాజాగా ఓ వీడియో పోస్ట్‌ చేశారు.

‘‘ఏదో జన్మలో అదృష్టం చేసుకుని ఉంటాను. బాలుగారితో పరిచయం ఏర్పడింది. సినిమాల్లోనే కాకుండా, ‘స్వరాభిషేకం’ పుణ్యమా అని ఎన్నో పాటలు ఆయనతో కలిసి పాడే అదృష్టం నాకు దక్కింది. పుట్టేటప్పుడే అందరూ మహా రుషులుగా పుట్టరు. ఎదిగే క్రమంలో వాళ్లు నేర్చుకున్న పాఠాలు, అనుభవాలు.. వాళ్లకి ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని అందిస్తాయి. అలా బాలు ఎన్నో ఒడుదొడుకులు చూశారు. ఎన్నో అనుభవాలు. మరెన్నో అనుభూతులు.. ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మహా మనీషి బాలు గారు. ఎదో చెప్పుకోవాలనిపిస్తుంది. కానీ ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. అంతా శూన్యంలా ఉంది. ఆయన పాటను ఇష్టంగా కాదు.. బాధ్యతగా అనుకున్నారు. పాటని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. పనిపట్ల ఆయనకున్న నిబద్ధత, తపన ఆయన్ని గొప్ప కళాకారుడిగా తీర్చిదిద్దాయి. బాలుగారు లేరని దయచేసి ఎవరూ అనకండి. ఆయన ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు. కొంతమంది కారణజన్ములు. ఒక పని కోసం వస్తారు. ఆ పని పూర్తి చేయగానే దేవుడు వాళ్లకి మరొక పని అప్పగిస్తారు. రేపటి నుంచి బాలుగారి కొత్త పాటలు వినమంతే.. కానీ ఆ పాత పాటల్నే మళ్లీ మళ్లీ వింటుంటే ఈ జీవితకాలం మనకి సరిపోదు. అంత నిధి మనకి వదిలేసి ఆయన ఎక్కడో విశ్రాంతి తీసుకుంటున్నారు. ‘జీవితం ఎప్పుడూ పూలబాట కాదు.. ముళ్లబాట. చూసుకుంటూ అడుగులెయ్యాలి. దారిలో ఎన్నో అడ్డంకులొస్తాయి. నవ్వుతూ నిబద్ధతతో, ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణతో ముందుకు అడుగులు వేయాలి. ముఖ్యంగా ఆడపిల్లలు’ అని ఆయన చెప్పిన ఈ మాటలను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని సునీత అన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని