ఓటీటీ విప్లవం..చిన్న సినిమాలకు వరం
close
Published : 11/06/2020 16:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీ విప్లవం..చిన్న సినిమాలకు వరం

ఇంటర్నెట్ డెస్క్‌: కరోనా వైరస్‌.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలతో పాటు సినీ రంగాన్ని కూడా కుదిపేసింది. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే షూటింగ్స్‌ మొదలవుబోతున్నాయి. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. భౌతిక స్పర్శ ద్వారా కరోనావైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఎక్కువగా ఉండటంతో చిత్రీకరణలు ఎలా చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. లొకేషన్లలో అతి కొద్దిమంది మాత్రమే ఉండేలా చిత్ర బృందాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా తక్కువ బడ్జెట్‌తో, అతి కొద్దిమందితో చిత్రీకరణ చేయగలిగిన కథల అన్వేషణలో పడ్డారు దర్శక-నిర్మాతలు. కొందరు నిర్మాతలు ప్రత్యేకంగా ఓటీటీ(ఓవర్‌ ది టాప్ మీడియా సర్వీసెస్‌)లో విడుదల చేసేలా సినిమాలు చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.


 

సంక్షోభాన్ని సదావకాశంగా మలుచుకున్న ఓటీటీ..

టెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్‌/టీవీ, ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిన తర్వాత యువత ఓటీటీలపై వైపు నెమ్మదిగా పయనించడం మొదలు పెట్టారు. ఈ పరిస్థితుల్లో కరోనా సంక్షోభం ఓటీటీ వేదికలను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. లాక్‌డౌన్‌తో వీక్షకుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. అమెజాన్‌, నెట్‌ప్లిక్స్, ఆహా, సన్‌ నెక్స్ట్‌, డిస్నీ+ హాట్‌ స్టార్‌, జీ5, ఏటీఎల్‌ బాలాజీ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు తమ పరిధిని పెంచుకునే పనిలో ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో ప్రసారం అవుతున్న వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం గరిష్ఠంగా పది ఎపిసోడ్‌ల చొప్పున ఒక్కో వెబ్‌సిరీస్‌ ప్రసారం అవుతోంది. 40 నిమిషాల నిడివి వరకు ఉండే ఈ వెబ్‌ సిరీస్‌లలో ఎక్కువగా క్రైమ్‌, హారర్‌, థ్రిల్లర్ జోనర్లలోనే సాగుతుండగా, ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపిస్తున్నారు మేకర్స్‌. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిన్న బడ్జెట్‌ సినిమాలు, క్యాష్‌ చేసుకునే పనిలో భాగంగా ఓటీటీలను ఆశ్రయిస్తున్నాయి. కంటెంట్‌ను బట్టి రేటు బాగానే పలుకుతోంది. ఈ మధ్యనే జ్యోతిక నటించిన ‘పొన్‌మగళ్‌ వందాళ్‌’, అంతకుముందు తెలుగు చిత్రం ‘అమృతరామమ్‌’ ఓటీటీ వేదికగానే విడుదల అయ్యాయి. హిందీలో అమితాబ్‌, అయుష్మాన్‌ ఖురానా నటించిన ‘గులాబో సితాబో’ త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. చిన్న చిత్రాలే కాక అధిక బడ్జెట్‌తో నిర్మితమైన జాన్వికపూర్‌ ‘గుంజన్‌ సక్సేనా’ కూడా ఓటీటీ బాటలో నడుస్తున్నాయి. అప్పులు తెచ్చి సినిమాలు నిర్మించిన నిర్మాతలకు వడ్డీల భారం అధికమవుతుండటంతో వచ్చిన కాడికి బయటపడిపోతే మేలని భావిస్తున్నారు.


మరిన్ని మార్పులు

సగటు ప్రేక్షకుడి అభిరుచి మారుతుంది. భారీ స్థాయిలో ఉండే ఎలివేషన్‌ సీన్లు, మూస కథలను ఇష్టపడే వారి సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. కథ హృదయానికి హత్తుకోవాలి. ఉద్వేగాన్ని కలిగించేలా, ఉత్కంఠను రేకేత్తించేలా చిత్రాలు ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. దీంతో భాషాతో సంబంధం లేకుండా అన్ని చిత్రాలను ఆదరిస్తున్నారు. సినిమా బాగుంటే చాలు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ, మరాఠీ అనే భేదం లేదు. సోషల్‌మీడియాలో ఫలానా చిత్రం బాగుందంటూ నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. ఓటీటీలు సబ్‌ టైటిల్స్‌ రూపంలో అన్ని ప్రాంతాల భాషలను అందుబాటులో ఉంచడం కలిసొచ్చే విషయం. ఈ పరిణామం రచయితలు, దర్శకులు కావాలనుకునే వారికి స్వర్ణయుగంగా మారనుంది. అత్యంత పకడ్బందీగా కథా కథనాలు రాసుకుని, ప్రీ ప్రొడక్షన్ పనులు పక్కాగా చేసుకుంటే మంచి విజయం సాధించవచ్చు. బడ్జెట్‌ తక్కువలో ఉండటం, థియేటర్ల కొరత సమస్యలు లేకపోవటంతో నిర్మాతలు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు.

‘‘ప్రస్తుతం తిరిగి షూటింగ్‌లు ఎలా మొదలుపెట్టాలన్నదానిపై చర్చిస్తున్నాం. ఓటీటీకి అమ్మేసుకునే చిత్రాల షూటింగ్‌లు మొదలు పెడితే మంచిది. అదే విధంగా టెలివిజన్‌ సిరీస్‌లు కూడా. ఎందుకంటే ఆ సినిమాను అమ్ముకునే అవకాశం ఉంది. ఎవరో ఒకరు కొంటారు. 50మందితో మాత్రమే షూటింగ్‌ చేయాలని అంటున్నారు. అది అస్సలు సాధ్యపడదు. మేము తీస్తున్న ‘నారప్ప’కోసం రోజుకు 100మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లు కావాలి. నా స్వార్థం కోసం నేను షూటింగ్‌ మొదలు పెట్టి, అందులో ఎవరికైనా కరోనా వస్తే, ఆ మచ్చ నాపై పడిపోతుంది. నా సినిమా పూర్తయినా కూడా ఇప్పుడే విడుదల చేసే పరిస్థితి మార్కెట్‌లో లేదు. ఇలాంటి సమయంలో తొందరపడకూడదని నేను అభిప్రాయపడుతున్నా’’
- దగ్గుబాటి సురేష్‌బాబు


‘‘ ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు తెరిచినా ఇంతకు మందులా ప్రేక్షకులు వచ్చే అవకాశం తక్కువ. ప్రస్తుతం పరిస్థితులన్నింటిని గమనిస్తున్నాం. రాబోయే కాలంలో ఎక్కువగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు సరిపడా సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతా’’
- చంటి అడ్డాలమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని