విద్యుల్లేఖ వెయిట్‌ లాస్‌ జర్నీ ఇది!
close
Updated : 27/06/2020 17:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యుల్లేఖ వెయిట్‌ లాస్‌ జర్నీ ఇది!

అప్పుడు హేళన చేశారు.. ఇప్పుడు పొగుడుతున్నారు

చెన్నై: తనదైన నటన, కామెడీ టైమింగ్‌తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి విద్యుల్లేఖ రామన్‌. బొద్దుగా ఉండే ఈ విద్యుల్లేఖ కొన్ని రోజుల కిందట కురచ దుస్తుల్లో దిగిన ఫొటోలను షేర్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఆమె బరువు తగ్గిన ఫొటోలను షేర్‌ చేయడంతో అవి కాస్తా వైరల్‌ అయ్యాయి. తన బరువు విషయంలో విమర్శలు వచ్చాయని, అవెంతో బాధించాయని గతంలో ఆమె ఆవేదన చెందారు. ఇప్పుడు తాను ఎలా బరువు తగ్గింది? ఎలాంటి కసరత్తులు చేశారు? తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాతో పాటు, ఓ ఆంగ్ల పత్రికతో పంచుకున్నారిలా..

‘‘ఫేక్‌ నమ్మకానికి.. నిజమైన నమ్మకానికి చాలా తేడా ఉంది. నేను అధిక బరువు ఉన్నప్పుడు ‘నువ్వు ఎలా ఇంత ఆత్మస్థైర్యంతో ఉండగలుగుతున్నావు?’ అని నన్ను చాలా మంది అడిగారు. కానీ ఇప్పుడు నిజంగా నాలో విశ్వాసం పెరిగింది. ఎందుకంటే.. నేను సాధించలేను అనుకున్నది.. సాధించా. నా లైఫ్‌స్టైల్‌ను, అలవాట్లను మార్చుకున్నా. మనసుపెడితే ఏదైనా సాధ్యమేనని అర్థం చేసుకున్నా.. ఇది నిజం.’’

‘‘నన్ను ద్వేషించుకోవడంతో నా ప్రయాణం ప్రారంభం కాలేదు. నన్ను నేను కొత్తగా మలుచుకోవాలన్న ఆలోచన నుంచి ఇది పుట్టింది. నేను 86 కిలోలు ఉంటే బాగుంటాను. కానీ, అది ఆరోగ్యానికి మంచిది కాదు. పైగా నేను చిరుతిళ్లు అంటే పడి చస్తా. నిద్రపోయే సమయం కూడా సరిగా ఉండదు. దీనితో పాటు నాకు పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌(పీసీఓఎస్‌) సమస్య ఉంది. రుతుక్రమం కూడా సరిగా వచ్చేది కాదు. నడుం నొప్పి, కీళ్ల నొప్పులతో బాధపడుతుండటం వల్ల పనిపై శ్రద్ధ పెట్టలేకపోయేదాన్ని. మధుమేహం వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఆ దెబ్బతో నాకు మత్తు వదిలినట్లైంది. దాంతో బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా’’

‘‘నేచురోపతి, ఆయుర్వేద, యోగాలను ఉపయోగించి బరువు తగ్గడం ప్రారంభించా. మూడు నెలల్లో 5-6 కిలోలు తగ్గా. కీటోజెనిక్‌ డైట్‌ ప్రారంభించా. దీని వల్ల ఊబకాయం తగ్గడం మొదలైంది. ఈ విషయంలో నా ట్రైనర్‌ నవీన్‌ ఎంతో సహకరించారు’’

‘‘నేను 86 కేజీలు ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నా. కానీ, ఆరోగ్యంగా లేను. ఇప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగానూ ఉన్నాను. బాడీ షేమింగ్‌కు నేను వ్యతిరేకం, కానీ బాడీ పాజిటివిటి కాదు. బరువు తగ్గే సమయంలో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి. ఫిట్‌గా తయారు కావడానికి ఎలాంటి దగ్గరి మార్గాలు(షార్ట్‌ కట్స్‌) ఉండవు. అందుకు వ్యక్తిగతంగా ఎంతో ఓపికగా కృషి చేయాలి’’

‘‘జీవితంలో క్రమశిక్షణ ఎంతో అవసరం. వారంలో ఆరు రోజులు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. సరైన ఆహారం తీసుకోవాలి. బరువు తగ్గడానికి ఎటువంటి రహస్యాలు, మందులు అవసరం లేదు. కేవలం స్వచ్ఛమైన శ్రమ చాలు.. మన కన్నీరు, కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. 2020 జూన్‌ 20 నాటికి నా బరువు 68.2 కిలోలు..’’ 

‘‘ఈ ఏడాది జనవరిలో చెన్నై మారథాన్‌లో పాల్గొన్నా. 10కి.మీ. దూరాన్ని 90 నిమిషాల్లో పూర్తి చేయడం నాకు సంతోషం అనిపించింది. దురదృష్టవశాత్తూ జనవరి మధ్యలో నా గాల్‌బ్లేడర్‌లో నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించా. అందులో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు. బరువు తగ్గుదామనుకున్న సమయంలో ఇలా జరిగింది. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌తో అందరం ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే, ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనుకున్నా. ఎంతో కాలంగా బరువు తగ్గాలన్న నా కలను సాకారం చేసుకునేందుకు దృష్టి సారించా. జనవరిలో 77కేజీల ఉన్న నేను జూన్‌ నాటికి 68 కిలోలకు తగ్గా. కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. కానీ, ఒక విషయం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం. ఈ సమయాన్ని మిమ్మల్ని మీరు మార్చుకునేందుకు, ఆరోగ్యం ఉండేందుకు ఉపయోగించుకోండి’’

‘‘నేను లావుగా ఉండటం, బొద్దుగా కనిపించడం వల్లే నాకు ప్రత్యేకంగా కామెడీ సన్నివేశాలు రాసేవారు. మొదట్లో దాన్ని వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఆ తర్వాత వెండితెరపైనా, బయట నా బరువుపై విమర్శలు చేసేవారు. అప్పట్లో ఈ విషయాన్ని చెప్పడానికి నాకు ధైర్యం లేదు. కానీ, ఇప్పుడు నా శరీర బరువుపై జోక్స్‌ రాయొద్దని నా దర్శక-రచయితలకు ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఒకప్పుడు నన్ను హేళన చేసిన వారే ఇప్పుడు పొగుడుతున్నారు. సమాజాన్ని బతిమాలుకోనవసరం లేదు. నాకు ఏం కావాలో అదే చేశా’’ అని విద్యుల్లేఖ చెప్పుకొచ్చారు.


 
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని