close

తాజా వార్తలు

Updated : 26/09/2020 08:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చేయూత.. బాలు మానవత

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, రవీంద్రభారతి

‘‘పుణ్యభూమి నా దేశం నమోనమామి..

ధన్యభూమి నా దేశం సదా స్మరామి..’’

అమర గాయకుడికి అశ్రునివాళి

* పాత తరం గాయని ‘ఉడత సరోజినీ’ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి సహకారం అందించేందుకు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ‘నేను రాలేని పరిస్థితి. నా స్నేహితుడు వస్తాడు. రూ.25వేలు ఇస్తారు. అది సరోజినీగారికి ఇవ్వండి’ అంటూ చెప్పటం ఆయన పెద్ద మనసుకు నిదర్శనం.

* 2018వ సంవత్సరంలో స్పర్శ ఛారిటీ సంస్థ కోసం శిల్పకళావేదికపై ప్రత్యేకంగా సంగీత విభావరిని నిర్వహించారు.

* గత ఏడాది చివరిలో సుప్రసిద్ధ సితార్‌ విద్వాంసులు మిట్టా జనార్ధన్‌ను సత్కరించాలనుకున్నారు. ఎస్పీ రూ.లక్ష వెచ్చించి స్వర్ణకంకణం బహూకరించారు.

* సుమారు 125 సంవత్సరాల ఘన చరిత్రగల ‘సురభి నాటక సమాజం’ ఉత్సవాలను నిర్వహించడానికి సంగమం ఫౌండేషన్‌ నిర్వహకులు సంజయ్‌కిషోర్‌ కార్యాచరణ రూపొందించారు. ప్రత్యేక గీతాన్ని రాయించి, ఆ పాటను ఎస్పీతో పాడించారు. పారితోషికంగా ఇచ్చిన రూ.50వేలకు మరో రూ.25వేలు జోడించి రూ.75వేలు సురభి కళాకారులకు అందజేశారు.

* సుప్రసిద్ధ గాయనీ పి.సుశీల తన పేరిట ఒక ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి నిర్వహణ బాధ్యతలను సంజయ్‌కిషోర్‌కు అప్పగించారు. తొలి పురస్కారం గానకోకిల ఎస్‌.జానకికి అందజేయాలని నిర్ణయించారు. ఒక లెజెండ్‌ పురస్కారం మరో లెజెండ్‌కు ఇస్తున్నప్పుడు ఆ స్థాయి కళాకారులతోనే పాటలు పాడించాలనుకున్నారు సుశీల. రవీంద్ర భారతిలో కచేరి ఇవ్వడానికి వచ్చిన బాలు కొత్తగా ఏర్పాటుచేసిన సౌండ్‌ సిస్టమ్‌ను పరిశీలించారు. ఎందుకులెండి మనమే సౌండ్‌ సిస్టమ్‌ తెచ్చుకుందాం అన్నారు. దానికి ఎంత ఖర్చవుతుందని సుశీల అడగ్గా అదంతా తాను చూసుకుంటానని చెప్పారు. మరుసటి రోజు సుశీల స్వయంగా వెళ్లి ‘మీరు కోరినంత స్థాయిలో పారితోషికం ఇవ్వలేను’ అని డబ్బులు ఇవ్వబోతుంటే.. ‘అమ్మా.. మీ పాటలు వింటూ పెరిగాను. మీతో కలిసి పాడుతూ ఎదిగాను. అలాంటిది మీరు నాకు పారితోషికం ఇవ్వడం ఏమిటీ.. మీ ఇద్దరు మహా తల్లుల కోసం పాట పాడటం నా పూర్వ జన్మసుకృతం’ అని చెప్పి ఆ డబ్బును తిరిగి బాలు ఇచ్చేశారు.


కాలనీ పార్కుకు ఎస్పీబీ పేరు

శ్రీనగర్‌కాలనీ, న్యూస్‌టుడే: ప్రముఖ సీనీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణవార్త తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని శ్రీనగర్‌కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన 2013 నుంచి శ్రీనగర్‌కాలనీలో నివాసం ఉంటున్నాడని, తమ కాలనీ వ్యక్తిగా ఇక్కడి ఓ పార్కుకు బాలసుబ్రహ్మణ్యం పేరును నామకరణం చేయనున్నామని తెలిపారు. తమ కాలనీలోనే నివాసం ఉన్నా ఆయన ఎప్పుడూ బయటపడేవారు కాదన్నారు. ఉదయం బయటకు వెళ్తే సాయంత్రం తిరిగి వచ్చేవారని వివరించారు. శ్రీనగర్‌కాలనీ సత్యసాయి నిగమాగమంలో జరిగిన ఓ కార్యక్రమంలో అక్కడి వేదిక నుంచి ఆయన పాడిన పాటలు ఇంకా గుర్తున్నాయని గతాన్ని గుర్తు చేసుకున్నారు.


చిట్టితల్లి కంట కన్నీరు

 ఆ చిన్నారి పేరు అక్షర. బాలనటిగా పలు సినిమాల్లో నటించింది. తన ముద్దుమాటలకు ముచ్చటపడిన బాలసుబ్రహ్మణ్యం ఓ అవకాశం ఇచ్చారు. ‘వన్‌ నేషన్‌ వన్‌సాంగ్‌’ పేరుతో పాడిన పాటలో అక్షరను భాగస్వామిని చేశారు. కరోనాతో బాలు ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి చిన్నారి ఆయన గురించి సమాచారం తెలుసుకుంటుంది. గురువారం రాత్రి ఆరోగ్యం క్షీణించినట్టు తెలియగానే రాత్రంతా జాగారం చేసింది. శుక్రవారం బాలు మరణవార్త తెలియగానే కన్నీరుమున్నీరైంది.


నడిచే ‘పాటల’ పాఠశాల బాలు

దైవజ్ఞశర్మ, ఆధ్యాత్మికవేత్త

ఎస్పీ కోదండపాణి కుమారుడు ఈశ్వర్‌ దంపతుల సన్మానంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

నడిచే పాటల పాఠశాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. తన గురువు ఎస్పీ కోదండపాణి కుమారుడు ఈశ్వర్‌ దంపతుల సన్మాన కార్యక్రమం సహా అనేక కార్యక్రమాల్లో బాలుతో కలిసి పాల్గొనడం మరచిపోలేని అనుభూతి. అత్యధిక ప్రాంతీయ భాషల్లో పాడగలిగిన గొప్ప గాయకుడు ఆయన. -న్యూస్‌టుడే, కాచిగూడ

కరోనా లాక్‌డౌన్‌కు కొద్దిరోజుల ముందు ఫిబ్రవరి 11, 12 తేదీల్లో హైదరాబాద్‌కు చెందిన కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో ఘంటసాల ఆరాధనోత్సవం నిర్వహించారు. సమాపనోత్సవ సభకు ముఖ్యఅతిథిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హాజరయ్యారు. సుమారు 100 మందికి పైగా గాయనీ గాయకులను సత్కరించి చక్కటి సందేశాన్నిచ్చారు. గంటకుపైగా ఆయన ప్రసంగం కొనసాగింది. ఇదే వేదికపై కిన్నెర పక్షాన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఎస్పీ బాలును ఘనంగా సత్కరించారు. ఎస్పీ పాల్గొన్న చివరి సభ కూడా ఇదే అవుతుందని ఎవరూ ఊహించలేకపోయారు.

ఊబకాయంతో బాధపడే ఎంతో మందికి గ్లోబల్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన కల్పించి మనోధైర్యం కల్పించారు గాన గంధర్వుడు బాలు. ఆయనతో తమకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందని ఆ ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ కె.రవీంద్రనాథ్‌ తెలిపారు.


ఆ బాలల నేస్తం

1975లో రవ్రీందభారతి వేదికపై జరిగిన ఆలిండియా ఎస్పీ బాలు పాటల

పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్న దివ్యాంగ బాలుడిని వేదికపైకి తన

చేతులతో ఎత్తుకుని తీసుకొస్తున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

తెరపై గాయకుడిగా అంతులేని ప్రేమాభిమానాల్ని గెలుచుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. తెరవెనుక ఎందరో దివ్యాంగ బాలల ప్రేమను చూరగొన్నారు. హయత్‌నగర్‌ ప్రాంతంలో ఉన్న వేగేశ్న ఫౌండేషన్‌ దివ్యాంగుల ఆశ్రమంలోని బాలలతో ఆయనకు విడదీయరాని బంధముంది. ఈ పిల్లల సహాయార్థం గత పన్నెండేళ్లుగా అమెరికాలో ‘ఎస్పీ బాలు సంగీతోత్సవం’ వంశీ సంస్థతో కలిసి నిర్వహిస్తున్నారు. తరచూ ఇక్కడికి రావడంతోపాటు వారి బాగోగుల్ని అడిగి తెలుసుకునే వారని ఆయనతో ఉన్న అనుబంధాన్ని సంస్థ వ్యవస్థాపకులు వంశీరామరాజు ‘ఈనాడు’తో పంచుకున్నారు.

-ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

తెలంగాణ సారస్వత పరిషత్తు సంతాపం

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేని భారతీయ సంగీతాన్ని ఊహించలేమని తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్యలు పేర్కొన్నారు. బాలు మృతి సందర్భంగా నివాళులర్పించారు. ఎందరికో స్ఫూర్తిప్రదాతగా ఉన్నారని కొనియాడారు.

తెలుగు వర్సిటీ నివాళి.. బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంతాపం తెలిపింది. 1998లో విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్‌ను ఇచ్చి సముచితంగా గౌరవించుకుంది. ఈ సందర్భంగా తెలుగువర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేశ్‌ మాట్లాడుతూ.. తెలుగు భాషలోని ప్రతి అక్షరాన్ని అందంగా పలికి తెలుగు భాషా సంస్కృతికి అర్థవంతమైన నిర్వచనాన్ని అందించిన భాషాప్రియులని కొనియాడారు.


చిత్ర పరిశ్రమకు తీరని లోటు

కళాజనార్దనమూర్తి, అధ్యక్షుడు, త్యాగరాయ గానసభ

గానసభలో జనార్దనమూర్తిని సన్మానిస్తున్న బాలసుబ్రహ్మణ్యం

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి 1978 నుంచి అనుబంధం ఉంది. తరచూ త్యాగరాయ గానసభకు వచ్చే వారు. పాడుతా తీయగా కొన్ని ఎపిసోడ్‌లను ఇక్కడే చేశారు. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ఆధ్వర్యంలో బాలసుబ్రహ్మణ్యం సారధ్యంలో సునాద వినోదినిని నిర్వహించారు.

-న్యూస్‌టుడే, గాంధీనగర్‌


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.