అన్నీదక్కాలని అనుకోవడం అత్యాశే
close
Published : 03/02/2020 10:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నీదక్కాలని అనుకోవడం అత్యాశే

అమలాపాల్‌

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ఇటీవల ‘ఆడై’ చిత్రంతో సినీ జనాలను ఆకట్టుకుంది అమలాపాల్‌. ఇప్పుడు ‘అదో అంద పరవైపోల’, మలయాళంలో ‘ఆడు జీవితం’ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే ‘నారప్ప’ చిత్రంలోనూ ఓ ముఖ్యమైన పాత్రకు ఇటీవల ఎంపికైంది. అదేవిధంగా మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. వినోద్‌ కేఆర్‌ దర్శకత్వంలోని ‘అదో అంద పరవైపోల’ చిత్రంలో ఈ అమ్మడు ప్రధాన పాత్ర పోషిస్తోంది. చిత్రీకరణ కూడా పూర్తయింది. త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా తన చిత్ర విశేషాల గురించి అమలాపాల్‌ వివరించింది. ఆ విశేషాలు..

ప్ర: ‘అదో అంద పరవైపోల’ ఎలాంటి చిత్రం?

జ: ఓ అమ్మాయి కారడవిలో ఒంటరిగా చిక్కుకుంటే.. అక్కడి నుంచి ఆమె ఎలా తప్పించుకుంది అన్నదే చిత్ర ప్రధాన కథ. 48 గంటల్లో జరిగే కథతో ఈ సినిమాను రూపొందించారు. ప్రతి సన్నివేశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వాస్తవానికి అడవిలో చిక్కుకున్న ఆమె మృగాలకు భయపడిందా..? మనుషులకు భయపడిందా..? అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేశాం.

ప్ర: ఆ మధ్య హిమాలయాలకు వెళ్లొచ్చారు. అప్పటి అనుభవంతో తెరకెక్కించిన చిత్రమా ఇది?

జ: 2017లో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఆ సమయంలోనే నేను హిమాలయాలకు ట్రెక్కింగ్‌కు వెళ్లా. వాస్తవానికి అక్కడే చిత్రీకరణ జరపాలని అనుకున్నాం. కానీ ఆ తర్వాత పెద్ద అడవిని కనిపెట్టి.. అక్కడ షూటింగ్‌ మొదలు పెట్టారు.

ప్ర: ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఎదురైన అనుభవాలు..?

జ: నిజానికి నాకు మనుషుల కన్నా మృగాలే ఇష్టం. అందుకే నగరాల కన్నా.. అడవే నయం అనుకున్నా. అడవిలో చిత్రీకరణ జరిపినప్పుడు చిన్నపాటి సమస్యలు ఎదురయ్యాయి. ఫోన్లకు సిగ్నళ్లు కూడా రాలేదు. అందువల్ల ఫోన్లకు దూరంగా చాలా సంతోషంగా జీవించాం.

ప్ర: యాక్షన్‌ సన్నివేశాల్లో నటించడంపై మీ అభిప్రాయం?

జ: ఈ చిత్రంలో మొత్తం మూడు పోరాట సన్నివేశాలు ఉన్నాయి. స్టంట్‌ మాస్టర్‌ సుప్రీం సుందర్‌తో అద్భుతమైన ఓ పోరాట సన్నివేశం కూడా ఉంది. దీనికోసం నేను ముందుగా శిక్షణ తీసుకున్నా. ప్రతి వ్యక్తిలోనూ శివశక్తి ఉంటుంది. ఆ విషయాన్ని నేను ఈ చిత్రంలో గ్రహించా.

ప్ర: వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారా?

జ: అవును. బాలీవుడ్‌లో రూపొందిన ఓ లవ్‌ స్టోరీ ఆధారంగా కొన్ని మార్పులు, చేర్పులు చేసి తమిళంలో వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించాం. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తాం.

ప్ర: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రం నుంచి మిమ్మల్ని తప్పించినట్లు వార్తలు వస్తున్నాయే..?

జ: ఈ చిత్రంలోని ఓ పాత్రకు సంబంధించి ఎంపికలు జరిగాయి. కానీ ఆ పాత్రకు నేను నప్పలేదు. దీంతో మణిరత్నం సార్‌ పిలిచి.. మరో చిత్రంలో మీకు మంచి అవకాశం ఇస్తానని చెప్పారు. 90 శాతం నప్పితేనే నటించగలం. మనకు అన్నీ దక్కాలని అనుకోవడం కరెక్టు కాదు కదా!

ప్ర: ‘ఆడై’ చిత్రానికి తగిన గుర్తింపు లభించలేదని అనుకుంటున్నారా?

జ: నా కెరీర్‌లో దిబెస్ట్‌ చిత్రం ‘ఆడై’. తెలుగులో ‘ఆమె’గా వచ్చింది. విడుదలైన అన్ని చోట్ల మంచి గుర్తింపు లభించింది. నటిగా నన్ను నేను నిరూపించుకున్నా. ఆ చిత్రానికి జాతీయ అవార్డు వస్తుందని అందరూ భావించారు. అదే నాకు పెద్ద అవార్డుతో సమానం.

ప్ర: తదుపరి చిత్రాల గురించి?

జ: తొలిసారిగా బాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్నా. నా కలల చిత్రం అది. మహేష్‌ భట్‌ నిర్మిస్తున్నారు. ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తా.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని